ఉగ్రవాదానికి పాక్ అడ్డా


Wed,February 20, 2019 01:44 AM

Pakistan PM Imran Khan promises action if India shows Pulwama proof warns against any rash move

-ఆధారాలు చూపమనటం కుంటిసాకు మాత్రమే
-ముంబై దాడుల కేసును పదేండ్లుగా సాగదీస్తున్నారు
-ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్థాన్ ఉగ్రదాడులతో తమకు సంబంధం లేదని చెప్పడం పాత కథేనని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి అని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించకపోవడం తమను ఆశ్చర్యపరచలేదని తెలిపింది. ఆ దాడిని ఖండించకపోగా, కనీసం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపేందుకు కూడా ఆయనకు నోరు రాలేదని విమర్శించింది. ఆధారాలిస్తే చర్య తీసుకుంటామని చెప్పడం కేవలం కుంటిసాకు మాత్రమేనని మండిపడింది. పుల్వామా దాడి మా పనేనని జైషే మొహమ్మద్ చేసిన ప్రకటనను, దాడికి పాల్పడిన ఉగ్రవాది అంతకుముందు విడుదల చేసిన వీడియోను పాక్ ప్రధాని పట్టించుకోలేదు అని ఎత్తి చూపింది.

జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ పాకిస్థాన్‌లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందేనని విదేశాంగ శాఖ పేర్కొంది. చర్యలు తీసుకోవడానికి ఇమ్రాన్‌ఖాన్‌కు ఇంతకన్నా ఇంకా ఎటువంటి ఆధారాలు కావాలని ప్రశ్నించింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులకు సంబంధించి ఎన్నో ఆధారాలందించాం. కానీ గత పదేండ్లుగా ఆ కేసుకు అతీగతీ లేదు. అలాగే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడికి సంబంధించి కూడా ఆధారాలు అందించాం. ఆ కేసులోనూ పురోగతి లేదు. తప్పకుండా చర్య తీసుకుంటామంటూ ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి అంటూ విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది. ఉగ్రవాదానికి తాము కూడా బలయ్యామంటూ పాక్ మొసలి కన్నీరు కారుస్తున్నదని, కానీ ఉగ్రవాదానికే ఆ దేశం కేంద్రంగా ఉన్న సంగతి ప్రపంచమంతటికీ తెలుసునని వ్యాఖ్యానించింది.

నవ పాకిస్థాన్ గురించి ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతూ మీ నవ పాకిస్థాన్‌లో హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులతో కలిసి ప్రస్తుత మంత్రులు బహిరంగంగా వేదికను పంచుకుంటూ ఉంటారు అని ఎదేవా చేసింది. చర్చలకు సిద్ధమంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉగ్రవాదం, హింసలేని వాతావరణంలో సమగ్ర ద్వైపాక్షిక చర్చలకు తాము కూడా సిద్ధమేనని పునరుద్ఘాటిస్తున్నాము అని విదేశాంగ శాఖ తెలిపింది.

1051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles