జమాత్ ఉద్ దవాపై నిషేధం

Fri,February 22, 2019 01:54 AM

-అంతర్జాతీయ ఒత్తిడితో పాకిస్థాన్ నిర్ణయం
-ప్రధాని ఇమ్రాన్ సారథ్యంలో ఎన్నెస్సీ భేటీ
-26/11 ముంబై దాడుల ఘాతుకం జమాత్ పనే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ముంబై 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సారథ్యంలోని జమాత్ ఉద్ దవా, దాని అనుబంధ స్వచ్ఛం ద సంస్థ ఫలాహ్ ఏ ఇన్సానియత్ ఫౌండేషన్‌లపై పాకిస్థాన్ నిషేధం విధించింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి మేరకు ఉగ్రవాద సంస్థలపై పాక్ కొరడా ఝుళిపించింది. గురువారం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ (ఎన్నెస్సీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతరంగిక వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ రెండు సంస్థలపై నిషేధం అమలును వేగవంతం చేయాలని కూడా ఎన్నెస్సీ సమావేశం నిర్ణయించిందన్నారు. కాగా, దేశీయంగా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా రూపొంచిందిన ఎన్నెస్సీ ప్రణాళికపైనా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సమీక్షించారు. సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు, కీలక శాఖల మంత్రులు పాల్గొన్నారు.

సమాజం నుంచి ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉన్నదని, పాక్ ఎంత మాత్రమూ మిలిటెంట్లకు స్థావరంగా ఉండబోదని ఇమ్రాన్ ఖాన్ అన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలను క్షేత్రస్థాయిలో తొలిగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అంతరంగిక మంత్రిత్వశాఖ, భద్రతా సంస్థల అధినేతలను ప్రధాని ఆదేశించారు. జమాత్ ఉద్ దవా నెట్‌వర్క్ పరిధిలో 300 సెమినరీలు, స్కూళ్లు, దవాఖానలు, ప్రచురణ సంస్థ, అంబులెన్స్ సర్వీసు ఉన్నాయి. రెండు సంస్థల పరిధిలో సుమారు 50 వేల మంది వలంటీర్లు, వందల మంది పెయిడ్ వర్కర్లు ఉన్నారు. ఇంతకుముందు ఈ రెండు సంస్థలు అంతరంగిక మంత్రిత్వశాఖ నిఘాలో ఉన్నాయి.

భారత్ దూకుడుగా వ్యవహరిస్తే
దాడులు చేయండి: ఇమ్రాన్ ఖాన్

సరిహద్దుల్లో భారత్ దూకుడుగా వ్యవహరించినా, దుస్సాహసానికి పాల్పడినా తదనుగుణంగా దాడులు చేయాలని సైన్యానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నెస్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ తమ ప్రజలను కాపాడుకునే సామర్థ్యం తమకు ఉన్నదని పేర్కొన్నారు. పుల్వామా దాడితో పాక్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ కేసు దర్యాప్తులో భారత్‌కు సహకరిస్తామని ఆయన అన్నట్లు సమావేశం తర్వాత ఒక ప్రకటన జారీ చేసింది. తమ ప్రతిపాదనకు భారత్ కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తుందని భావిస్తున్నామని తెలిపింది. దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించినా తగు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే కశ్మీర్ వివాద పరిష్కారానికి అంతర్జాతీయ సమా జం చొరవ చూపాలని ఒక వీడియో క్లిప్పింగ్‌లో ఇమ్రాన్ పేర్కొన్నట్లు వచ్చింది.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles