ఆరేండ్లు అదనం ఎలా?


Thu,September 12, 2019 02:54 AM

Orbiter will have a lifespan of 7.5 years its possible to find Vikram Lander from orbiter Isro chief

- పెరిగిన ఆర్బిటార్ జీవితకాలం
- సమర్థమైన నిర్వహణతో కలిసొచ్చిందన్న ఇస్రో
- ప్రయాణ కాలం తగ్గడమూ కారణమేనంటున్న నిపుణులు


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుంచి సంకేతాలు పంపలేదని కాస్త నిరాశ చెందుతున్న సమయంలోనే ఇస్రో ఓ తీపికబురు అందించింది. ఆర్బిటార్ జీవితకాలం పెరిగిందని.. దాదాపు ఏడేండ్లపాటు అది సేవలందిస్తుందని ప్రకటించింది. ప్రణాళిక ప్రకారం ఆర్బిటార్ జీవిత కాలం ఏడాది మాత్రమే. కానీ.. అనూహ్యంగా ఆరేండ్లు పెరిగింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రయోగాన్ని కచ్చితత్వంతో నిర్వహించడం.. వ్యోమనౌకలోని యంత్రపరికరాల సరైన నిర్వహణ వల్లే ఇంధనం ఆదా అయ్యిందని ఇస్రో తెలిపింది. షెడ్యూల్‌లో మార్పులు కూడా ఇంధనం మిగలడానికి దోహదం చేశాయని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం చంద్రయాన్-2ను జూలై 15వ తేదీన ప్రయోగించాలి. అది 54 రోజులపాటు ప్రయాణించి సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగాలి. అయితే చివరిక్షణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వారం రోజులపాటు వాయిదావేశారు. జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం వారం రోజులు ఆలస్యమైనా.. ల్యాండింగ్ మాత్రం సెప్టెంబర్ 7నే జరుగుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అంటే షెడ్యూల్‌ను ఏడు రోజులపాటు కుదించారు. భూమి చుట్టూ తిరిగి, చంద్రుడి కక్ష్య వరకు చేరే కాలాన్ని ఎనిమిది రోజులు పెంచి.. చంద్రుడి చుట్టూ భ్రమణ కాలాన్ని 15 రోజులు కుదించారు. ఫలితంగా వారం రోజులు ఆదా కావడంతో ఆర్బిటార్‌లో ఇంధనం మిగిలింది. భూమి నుంచి బయలుదేరినప్పుడు ఆర్బిటార్‌లో 1697 కిలోల ఇంధనం ఉండగా కక్ష్యల కుదింపు వంటి ప్రక్రియల్లో దాదాపు 1200 కిలోల ఇంధనం ఖర్చయింది. ప్రస్తుతం ఆర్బిటార్‌లో 500 కిలోల ఇంధనం మిగిలి ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆర్బిటార్‌ను చంద్రుడికి 100 కి.మీ.ల ఎత్తులో ఉన్న కక్ష్యలోనే ఉంచి పరిశోధనలు కొనసాగిస్తే ప్రస్తుతం ఉన్న ఇంధనం మరో ఏడేండ్లపాటు పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే ఆర్బిటార్ జీవిత కాలం ఆరేండ్లు పెరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆర్బిటార్ కక్ష్యను మార్చాల్సి వస్తే ఇంధనం ఖర్చై జీవిత కాలం తగ్గుతుందని వివరిస్తున్నారు.

2200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles