ముందు వీవీప్యాట్లను లెక్కించాలి


Wed,May 22, 2019 02:08 AM

Opposition leaders meet EC officials, demand verification of VVPAT slips before counting of votes

- ఆ తర్వాతే కౌంటింగ్ మొదలుపెట్టాలి
- తేడా వస్తే అన్ని వీవీప్యాట్లను లెక్కించాలి.. ఈసీకి విపక్షాల విన్నపం


న్యూఢిల్లీ, మే 21: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (ఈ నెల 23న) జరుగనున్న నేపథ్యంలో 22 ప్రతిపక్ష పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీని) కలిశారు. ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల)లోని ఫలితాలను వీవీప్యాట్లతో సరిపోల్చడం ద్వారా ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ తదితర ప్రతిపక్ష పార్టీల నేతలు ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టడానికి ముందే ఈవీఎంలలోని ఓట్లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ర్యాండమ్‌గా గుర్తించిన ఐదు బూత్‌లలోని వీవీప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చాలని వారు డిమాండ్ చేశారు. ఈసీని కలువడానికి ముందు విపక్ష నేతలు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.

ఈసీని కలిసిన తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై చర్చించేందుకు వీలుగా ఓట్ల లెక్కింపు రోజు తామంతా పరస్పరం టచ్‌లో ఉండాలని నిర్ణయించినట్టు ఓ విపక్ష నేత పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించడానికి ముందే ర్యాండమ్‌గా గుర్తించిన ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చాలని కోరుతున్నాం. ఎక్కడైనా వీవీప్యాట్ స్లిప్పుల తనిఖీలో తేడా వచ్చిన పక్షంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ల స్లిప్పులను పూర్తిగా (నూటికి నూరు శాతం) లెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని ఈసీకి సమర్పించిన వినతి పత్రంలో విపక్ష నేతలు పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని వీవీప్యాట్లలోని మొత్తం స్లిప్పులను ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చాలని కోరుతూ తాజాగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో విపక్ష నేతలు ఈసీని కలిసి ఈ వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై 22 పార్టీల నేతలు సంతకాలు చేశారు. దేశంలోని 70 శాతం మంది ఓటర్లకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పెంచాలి

ఈసీతో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ విలేకర్లతో మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియలో తొలుత వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని మేము ఈసీని కోరాం. వీటి లెక్కింపులో ఏమైనా వ్యత్యాసం ఉన్నట్టు కనిపిస్తే ఆ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఈసీకి విజ్ఞప్తి చేశాం అని తెలిపారు. విపక్షాల విజ్ఞప్తిపై చర్చించేందుకు బుధవారం సమావేశమవుతామని ఈసీ చెప్పినట్టు ఆజాద్ సహచరుడు అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని, దానిని వక్రీకరించకూడదని ఈసీని కోరినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడేందుకు భారీ సంఖ్యలో ఈవీఎంలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత సతీశ్ చంద్ర మిశ్రా ఆరోపిస్తూ.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించాలని డిమాండ్ చేశారు.

ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలను తరలించడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ అంశంపై దర్యాప్తు జరుపాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈసీని కలిసిన విపక్ష నేతల్లో గులాం నబీ ఆజాద్, చంద్రబాబు నాయుడు, అభిషేక్ సింఘ్వీ, సతీశ్ చంద్ర మిశ్రాతోపాటు అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), సీతారాం ఏచూరి, టీకే రంగరాజన్ (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి, డీ రాజా (సీపీఐ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, మజీద్ మెమన్, డీఎంకే నాయకురాలు కనిమోళి, తృణమూల్ నేత డెరెక్ ఓబ్రియాన్‌తదితరులు ఉన్నారు.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles