‘ఒక దేశం ఒకే రేషన్‌ కార్డు’

Wed,December 4, 2019 03:33 AM

- జూన్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలు
- కేంద్రమంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రేషన్‌ కార్డు ఉన్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోని రేషన్‌ దుకాణానికైనా వెళ్లి అక్కడ లభించే సరుకులను కొనుగోలు చేసే పరిస్థితి త్వరలో సాకారం కానుంది. ఈ సదుపాయం వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. ఈ పథకం వల్ల వలస కార్మికులు, దినసరి కూలీలు లబ్ధి పొందుతారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరా శాఖల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారులు దేశంలోని ఏ రేషన్‌ దుకాణానికైనా వెళ్లి తమకు నిర్దేశించిన ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే సదరు రేషన్‌ దుకాణంలోని ‘ఈపోస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌)లో వేలిముద్రలు/ఆధార్‌ కార్డును ధ్రువీకరించుకోవడం ద్వారా మాత్రమే ఈ సదుపాయం పొందవచ్చని స్పష్టం చేశారు.

అన్ని సదుపాయాలకు ఒకే కార్డు ఆలోచన లేదు

దేశ పౌరులకు అన్ని సదుపాయాలు పొందేందుకు వీలుగా ఒకే కార్డును జారీచేసే ఆలోచనేదీ లేదని ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జాతీయ జనాభా రిజిస్టర్‌ను సిద్ధంచేసి, తాజాపరచాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.

నాలుగు వైద్య పరికరాల ధరల స్థిరీకరణ

నాలుగు వైద్య పరికరాల ధరలను స్థిరీకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. కార్డియాక్‌ స్టెంట్స్‌, డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్స్‌, కాండో మ్స్‌, ఇంట్రా యూటెరిన్‌లను అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చి వాటి ధరలను స్థిరీకరించామని తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ‘నిర్బల’ అంటూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యురాలు పూనమ్‌ మహాజన్‌ మండిపడ్డారు. మరోవైపు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌ పరిధిలోకి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రదేశాలు కూడా వస్తాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా, ఎస్పీజీ సవరణ చట్టానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ ఇదివరకే ఆమోదించింది. బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి అమిత్‌షా ఇచ్చిన సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. సముద్ర నీటి మట్టం పెరుగడం వల్ల ముంబై నగరం మునిగిపోయే ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం తెలిపింది. ఎంపీలు భారత శాస్త్రవేత్తలపై నమ్మకముంచాలని కోరింది.
Vilas-Paswan1

మీడియా సిబ్బందికి సామాజిక భద్రత కల్పించాలి: సుప్రియా సూలె

మీడియా సిబ్బందికి సామాజిక భద్రత కల్పించాలని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలె కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘బ్రేకింగ్‌ న్యూస్‌' సమయంలో సిబ్బంది ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుందని చెప్పారు. ఇటీవల మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం సందర్భంగా కెమెరామెన్లు రాజకీయ నాయకుల వాహనాలను అనుసరిస్తూ ద్విచక్రవాహనాల్లో వెనుక కూర్చొని ప్రయాణించారని, అది ఎంతో ప్రమాదకరమని తెలిపారు.

1009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles