వదినకు మద్దతుగా బరి నుంచి తప్పుకొన్న మరిది


Fri,May 25, 2018 06:48 AM

One chart to explain vote arithmetic

-కైరానాలో బలపడుతున్న ప్రతిపక్షాల అభ్యర్థి
-లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీకి గడ్డుకాలం..

కైరానా, మే 24: కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తమ ఐక్యతకు వేదికగా మార్చుకున్న ప్రతిపక్షపార్టీలకు ఆ మరుసటిరోజే మరింత ప్రోత్సాహాన్నిచ్చే వార్త అందింది. బీజేపీని సమైక్యంగా కలిసి ఓడించాలని భావిస్తున్న విపక్ష నేతలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ ఉప ఎన్నిక మరో అవకాశాన్ని కల్పించింది. ఈ స్థానం నుంచి విపక్ష పార్టీల అభ్యర్థిగా రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ)కి చెందిన బేగం తబస్సుం హసన్ పోటీ చేస్తున్నారు. ఐదులక్షలకు పైగా ముస్లిం ఓటర్లున్న ఈ నియోజకవర్గం నుండి తబస్సుం భర్త సోదరుడు (మరిది) కన్వర్ హసన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కైరానాలో ఈ నెల 28న (సోమవారం) ఉప ఎన్నిక జరుగనుండగా, అనూహ్యంగా కన్వర్ హసన్ తన వదిన తబస్సుంకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించారు. వెంటనే ఆయన ఆర్‌ఎల్డీలో చేరారు. కన్వర్ బరిలో ఉంటే ముస్లింల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉండేదని, కానీ ఇప్పుడు అది తొలిగిపోయిందని విపక్ష నేతలు సంతోషిస్తున్నారు. ఇప్పటికే యూపీ సీఎం, డిప్యూటీ సీఎం గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయి అప్రతిష్ఠను మూటకట్టుకుంది. ఇక కైరానాలో కూడా ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావడంతో అక్కడ కూడా బీజేపీకి ఓటమి తప్పకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీజేపీ తరఫున మృగాంకా సింగ్ బరిలో ఉన్నారు. మృగాంకా తండ్రి హుకుం సింగ్ మరణంతోనే ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. తబస్సుంకు సమాజ్‌వాదీ, కాంగ్రెస్, నిషాద్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగంగా మద్దతు తెలుపనప్పటికీ ఆ పార్టీ జెండాలు తబస్సుం ఇంటి వద్ద కనిపించాయి. బీఎస్పీ మాజీ ఎంపీ తబస్సుం ఆ తరువాత ఎస్పీలో అనంతరం ఆరెల్డీలో చేరారు. కైరానాతోపాటు మరో మూడు స్థానాలకు ఈ నెల 28న లోక్‌సభ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా-గోండియా, నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానం ఉన్నాయి. ఈ స్థానాల్లో సైతం బీజేపీ గట్టి పోటీనెదుర్కొంటున్నది.
KanwarHasan

2365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles