
షిల్లాంగ్, ఫిబ్రవరి 10: శారదా చిట్‌ఫండ్ స్కామ్‌కు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఆదివారం రెండో రోజూ సుదీర్ఘంగా విచారించారు. ఆయనతోపాటు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా అధికారులు విచారించారు. కేసులో కీలక ఆధారాలను నాశనం చేశారనే ఆరోపణలపై రాజీవ్‌కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. శారదా చిట్‌ఫండ్ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పట్లో రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కాగా, తృణమూల్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆదివారం 10.30 గంటలకు సీబీఊ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో 2013లో ఆయన అరెస్ట్ కాగా, 2016 నుంచి బెయిల్‌పై ఉన్నారు. మరోవైపు సీబీఐ వీరిద్దరినీ కలిపి విచారించింది.