రెచ్చిపోయిన నాగాలు


Wed,May 22, 2019 02:55 AM

NPP Lawmaker His Son Among 11 Killed By Militants In Arunachal Pradesh

- అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎమ్మెల్యే దారుణ హత్య
- తీవ్రవాదుల దాడిలో ఆయన కుమారుడు సహా మరో 10 మంది హతం
- అసోం నుంచి తన నియోజకవర్గానికి వెళ్తుండగా ఘాతుకం


ఈటానగర్, మే 21: అరుణాచల్‌ప్రదేశ్‌లో నాగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ఎమ్మెల్యే సహా 11 మందిని దారుణంగా కాల్చి చంపారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన ఎమ్మెల్యే తిరాంగ్ అబోహ మంగళవారం ఉదయం 11.30 గంటలకు తన కుటుంబం, భద్రతా సిబ్బందితో కలిసి నాలుగు వాహనాల్లో అసోం నుంచి తన నియోజకవర్గానికి తిరిగి వస్తుండగా తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ తీరప్ జిల్లాలోని 11వ మైల్ ప్రాంతానికి ఎమ్మెల్యే వాహనాల కాన్వాయ్ చేరుకోగానే కాపుకాచి ఉన్న నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం) తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు లాంగ్‌జెమ్ మరో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. వాహనాల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోపాటు నలుగురు భద్రతా సిబ్బంది, ఒక పోలింగ్ ఏజెంట్ సహా మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, 11 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర డీజీపీ ఎస్‌బీకే సింగ్ తెలిపారు.

బుల్లెట్ గాయాలకు గురైన ఇద్దరిని దవాఖానకు తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో ఇద్దరు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారని తెలిపారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన ఎమ్మెల్యే కుమారుడు లాంగ్‌జెమ్ మరో వాహనాన్ని నడుపుతున్నారని చెప్పారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులను గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తిరాంగ్ అబోహ (41) ఎన్‌పీపీ తరఫున ఖోంసా పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేశారు. కాల్పుల అనంతరం తీవ్రవాదుల కోసం అసోం రైఫిల్స్ దళాలు గాలింపు చేపట్టాయి. చంపుతామంటూ తిరాంగ్ అబోహకు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని నార్త్-ఈస్ట్ డెమోక్రటిక్ అలియెన్స్‌లో ఎన్‌పీపీ భాగస్వామిగా ఉన్నది.

తీవ్రవాదులను వదిలిపెట్టం: పెమాఖండూ

ఎమ్మెల్యే హత్యను అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండూ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్‌రాడ్ కే సంగ్మా స్పందిస్తూ మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేను తీవ్రవాదులు హత్య చేయడం దారుణం. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని కార్యాలయాన్ని కోరుతున్నాం అని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ ఈశాన్య ప్రాంతంలోని శాంతికి విఘాతం కలిగించడానికే తీవ్రవాదులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని, వారిని వదిలిబెట్టబోమని హామీ ఇచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పందిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాప్రతినిధులకే రక్షణ లేనప్పుడు ఇక సామాన్య మానవులకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఎమ్మెల్యే హత్యపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేసింది.

1480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles