రాష్ట్ర రాజకీయాల్లోకి రాను

Fri,November 8, 2019 02:21 AM

న్యూఢిల్లీ, నవంబర్ 7: మహారాష్ట్రలో శివసేనతో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారనున్నట్టు వస్తున్న ఊహాగానాలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లోకి తాను తిరిగొచ్చే ప్రసక్తే లేదని ఆయన గురువారం స్పష్టంచేస్తూ.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోనే సర్కారు ఏర్పడుతుందన్నారు. నేను కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నా. మహారాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగొచ్చే ప్రశ్నేలేదు అని గడ్కరీ విలేకర్లకు తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ.. రాష్ట్రంలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఫడ్నవీస్ నాయకత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న తమ డిమాండ్‌ను తిరస్కరించినందుకు ఫడ్నవీస్‌పై శివసేన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటంతో సీఎం అభ్యర్థిగా గడ్కరీ పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకి సన్నిహితుడైన గడ్కరీకి ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా సుహృద్భావ సంబంధాలుండటంతో ఆయనను శివసేనకు అత్యంత ఆమోదయోగ్యుడిగా పరిగణిస్తున్నారు. శివసేన కంటే ఎక్కువ సీట్లు వచ్చినందున బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని గడ్కరీ ఉద్ఘాటించారు.

298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles