ప్రాజెక్టులతో ముకుతాడు


Sat,February 23, 2019 03:08 AM

Nitin-gadkari said government decided to stop our share of water which used to flow to pakistan

- సింధు జలాలు పాక్‌కు వెళ్లకుండా నిలువరింత
- వివరాలు వెల్లడించిన కేంద్ర జలవనరుల శాఖ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సింధు నదీ జలాల ఒప్పందం కింద భారత్‌కు వాటాగా లభించిన నదీ జలాలను పాకిస్థాన్‌కు ప్రవహించకుండా నిలువరించనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని అమలు చేసేందుకు నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలవనరుల శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులతో సింధు నదీ వ్యవస్థ ముడిపడి ఉంది. ఈ నదీ జలాల పరివాహక ప్రాంతం ప్రధానంగా భారత్, పాకిస్థాన్‌లో ఉండగా, ఆఫ్ఘనిస్థాన్, చైనాలోనూ కొద్ది మొత్తం ఉన్నది. 1960లో భారత్, పాక్ మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం... తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ భారత్‌కు దక్కగా, పశ్చిమ నదులైన ఇండస్, జీలం, చీనాబ్ పాక్‌కు దక్కాయి. ఇందులో భాగంగా సట్లెజ్ నదిపై భాక్రా డ్యామ్, బియాస్ నదిపై పాంగ్ అండ్ పండోహ్ డ్యామ్, రావి నదిపై థీన్ డ్యామ్ (రంజిత్‌సాగర్)ను భారత్ నిర్మించింది. వీటితోపాటు బియాస్- సట్లెజ్ లింక్, మాధోపూర్- బియాస్ లింక్, ఇందిరా గాంధీ నహర్ తదితర ప్రాజెక్టుల ద్వారా తూర్పు నదీ జలాల్లో 95 శాతం నీటిని భారత్ ఉపయోగించుకుంటున్నది. మిగిలిన 5 శాతం జలాలు పాక్‌కు వెళుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా రంజిత్‌సాగర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునేందుకు షాపూర్‌కండి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ నీటి ద్వారా జమ్ము కశ్మీర్, పంజాబ్‌లలో 37 వేల హెక్టార్లకు సాగునీరు అందించవచ్చు. అలాగే 206 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అలాగే రావి ఉపనది అయిన ఉజ్ నదిపై మరో బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 781 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసి సాగు, విద్యుదుత్పత్తికి వినియోగించనున్నారు. ఇక ఉజ్ నదికి దిగువన రావి-బియాస్ రెండో లింక్‌ను నిర్మిస్తున్నారు. రావి నదిపై థీన్ డ్యామ్‌ను నిర్మించినప్పటికీ మిగులు జలాలు పాక్ వెళుతుండడంతో ఆ నీటిని అడ్డుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా భారత్ నదీ జలాలు పాక్‌కు వెళ్లకుండా నిలువరించనున్నట్లు జలవనరుల శాఖ వెల్లడించింది.

మాకెలాంటి ఆందోళనా లేదు: పాకిస్థాన్

సింధు నదీ జలాల్లో భారత్‌కు వాటాగా లభించిన జలాలను పాక్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ స్పందించింది. ఆ నీటి మళ్లింపుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని పేర్కొంది. పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఖ్వాజా సుమైల్ ఆ దేశ పత్రికైన డాన్‌తో మాట్లాడుతూ.. తూర్పు నదీ జలాలను భారత్ మళ్లించడం పట్ల మాకెలాంటి ఆందోళన, అభ్యంతరం లేదు. సింధు నదీ ఒప్పందం ప్రకారం ఆ నదులు భారత్‌కు చెందాయి కాబట్టి, ఆ నీటిని వారు ఏ అవసరాలకు వాడుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. ఒకవేళ భారత్ పశ్చిమ నదులను మళ్లిస్తే మేం తప్పకుండా అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తాం అని పేర్కొన్నారు.

పుల్వామా ఘటన హేయం, పిరికి పంద చర్య: భద్రతా మండలి

పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ (జేయూడీ) ఆధ్వర్యంలో జరిగిన దాడి హేయమైన పిరికిపంద చర్య అని అభివర్ణించింది. కారకులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని శుక్రవారం తీర్మానించింది. పుల్వామా ఉగ్రదాడి కుట్రదారులను గుర్తించడంలో భారత్‌కు సహకరించాలని సభ్య దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది.
sindhu-river1

అక్టోబర్ వరకు గ్రే లిస్ట్‌లోనే పాక్


బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ఎఫ్‌ఏటీఎఫ్‌పై భారత్ ఒత్తిడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను నిషేధిత జాబితాలో (బ్లాక్‌లిస్ట్) చేర్చాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)పై భారత్ ఒత్తిడి తెస్తున్నది. అయితే ఈ ఏడాది అక్టోబర్ వరకు బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ అక్టోబర్ వరకు ఇదే జాబితాలో కొనసాగనుంది. ఉగ్రవాదులకు అందే నిధులపైన ఎఫ్‌ఏటీఎఫ్ నిఘా పెట్టి, అందుకనుగుణంగా చర్యలు చేపడుతుంది. ఏ దేశమైనా నిధులు సమకూర్చుతున్నట్లు తేలితే బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది.

పాక్ తన వైఖరిని మార్చుకోవాలి

పాకిస్థాన్‌పై ఎఫ్‌ఏటీఎఫ్ పరోక్షంగా విమర్శలు కురిపించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటో తమకు తెలుసునన్న విషయాన్ని పాకిస్థాన్ ప్రపంచానికి చాటి చెప్పేలా వ్యవహరించాలని సూచించింది. తమ వ్యూహాత్మక లోపాలను సరిదిద్దుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరింది. పుల్వామా ఉగ్రదాడిని ఎఫ్‌ఏటీఎఫ్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.

901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles