ఎన్‌ఐఏ విస్తృత సోదాలు


Sun,July 21, 2019 02:30 AM

NIA raids home of accused in Ansarulla terror case

-తమిళనాడులో అన్సారుల్లా ఉగ్ర సంస్థ కేసు
-నిందితుల ఇండ్లలో తనిఖీలు

చెన్నై, జూలై 20: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) శనివారం తమిళనాడులో పలు చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఐఎస్‌ఐఎస్‌, అల్‌ఖైదా, సిమి వంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి తమిళనాడులో ‘అన్సారుల్లా’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దేశంలో ఉగ్రదాడులకు వ్యూహరచన జరుపుతున్నారన్న సమాచారంతో ఎన్‌ఐఏ ఇటీవల 16 మందిని అరెస్ట్‌ చేసింది. ఇందులో 14 మందిని గతవారం సౌదీ అరేబియా నుంచి రప్పించి అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరిని తమిళనాడులో అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నిందితుల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టింది. రామనాథపురం, తేని, చెన్నై, మదురై, తిరునల్వేలి, తంజావూర్‌, పెరంబలూర్‌, నాగపట్నం, తిరువరూర్‌ జిల్లాల్లో సోదాలు జరిపినట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. నిందితుల ఇండ్ల నుంచి ఒక ల్యాప్‌టాప్‌, ఏడు మొబైల్‌ ఫోన్లు, ఐదు సిమ్‌ కార్డులు, ఒక హార్డ్‌డిస్క్‌ డ్రైవ్‌, రెండు పెన్‌డ్రైవ్‌లు, ఒక ఇంటర్నెట్‌ పరికరం, 9 సీడీ/డీవీడీలు, సుమారు 50 పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత సైబర్‌ ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 మందిని విచారించేందుకు 8 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో వారి ఇండ్లలో శనివారం సోదాలు నిర్వహించారు. వీరు భారత్‌లో ఇస్లామిక్‌ భావజాలాన్ని వ్యాపింపజేసి జీహాద్‌ పేరుతో ఉగ్రదాడులు పాల్పడేందుకు నిధులు సమకూర్చుకోవడంతోపాటు కొందరిని నియమించుకుంటున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.

230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles