ప్రియాంక.. జగమెరిగిన మోసగత్తె!


Thu,December 6, 2018 02:15 AM

New York Magazine calls Priyanka Chopra scam artist

-నిక్ జోనాస్‌ను వంచించి పెండ్లి చేసుకుంది
-న్యూయార్క్ మ్యాగజైన్ అనుచిత వ్యాఖ్యలు.. నిరసనలతో క్షమాపణ

ముంబై, డిసెంబర్ 5: వివాహ బంధంతో ఒక్కటైన బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ జంటను అందరూ దీవిస్తుంటే, ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని, నిక్‌ను ఆమె వంచించి పెండ్లి చేసుకుందంటూ చెత్తంతా వెళ్లగక్కింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలేనంటూ నిరసనలు ప్రారంభం కావడంతో ఆ పత్రిక చివరకు క్షమాపణలు చెప్పింది. ప్రియాంక-నిక్‌జోనాస్‌లది నిజమైన ప్రేమేనా? అనే శీర్షికతో ది కట్ మ్యాగజైన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఈ కథనం ప్రచురితమైంది. జర్నలిస్ట్ మరియా స్మిత్ రాసిన ఈ కథనంలో అనేక అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. పాపం నిక్.. అందరు కుర్రాళ్లలాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రేమాయణం సాగించి వదిలేద్దామనుకున్నాడు.

కానీ ఆమె జగమెరిగిన మోసగత్తె. కుట్ర పన్ని.. పెండ్లి పేరుతో నిక్‌ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవశిక్షను విధించింది అంటూ రాసుకొచ్చింది. ఒక ఆసియా మహిళ అమెరికా సినీ, టీవీ రంగాల్లో రాణించడాన్ని జీర్ణించుకోలేకే ఇలా విషం కక్కుతున్నారని బాలీవుడ్ తారలు సోనమ్‌కపూర్, స్వరాభాస్కర్, గాయని సోనా మహాపాత్ర విమర్శించారు. నిక్ జోనాస్ సోదరి జోయ్ జోనాస్, ఆమె ప్రియుడు సోఫీ టర్నర్ కూడా ఈ కథనంపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి కథనాన్ని ప్రచురించినందుకు ఆ మ్యాగజైన్ సిగ్గుపడాలి అని వారు మండిపడ్డారు. నిరసనలు తీవ్రమవుతుండటంతో ది కట్ దిగివచ్చింది. ఆ కథనాన్ని తొలగిస్తున్నామని.. క్షమాపణలు చెప్పింది.

1370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS