పెద్దనోట్ల రద్దుతో ప్రతికూల ప్రభావం

Fri,November 8, 2019 02:46 AM

-మోదీ నిర్ణయంతో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్న 66% మంది
-వృద్ధిరేటు మందగమనానికి అదే కారణమన్న 33% మంది
-ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదన్న 28% మంది
-మూడేండ్ల పరిణామాలపై లోకల్‌సర్కిల్స్ సర్వేలో ప్రజాభిప్రాయం

న్యూఢిల్లీ: మూడేండ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న పెద్ద నోట్లరద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మికుల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందని 66% మంది ముక్తకంఠంతో చెప్పారు.ఆర్థిక వృద్ధిరేటు మందగించిందని 33% మంది పేర్కొన్నారు. నల్లధనాన్ని బయటకు తీసి, ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక మూలాల్ని పెకిలించి, దేశంలో అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేస్తామంటూ ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి నవంబర్ 8కి మూడేండ్లు. ఈ నేపథ్యంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజా జీవనంపై పెద్ద నోట్లరద్దు నిర్ణయం ఏ విధంగా ప్రభావం చూపిందన్న అంశంపై లోకల్‌సర్కిల్స్ అనే సామాజిక మాధ్యమ సంస్థ సర్వే చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ, కార్మికుల ఉపాధి అవకాశాలపై పెద్ద నోట్లరద్దు ప్రతికూల ప్రభావం చూపిందని సర్వేలో పాల్గొన్న 66% మంది పేర్కొనడం గమనార్హం. మరోవైపు, పెద్ద నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏ ప్రతికూల ప్రభావం పడలేదని 28% మంది తెలిపారు. పెద్ద నోట్లరద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పరుగులు తీస్తున్నదని, అయితే, ఆ నిర్ణయం కారణంగా ఆర్థిక వృద్ధిరేటు మందగించిందని 33 శాతం మంది వివరించారు. నోట్లరద్దు నిర్ణయం తర్వాత రెండు త్రైమాసికాల వరకూ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నా, ఆ తర్వాత వృద్ధిరేటు మందగించిందని తెలిపారు. 2017-18లో వృద్ధిరేటు కొంత పుంజుకున్నా గత ఐదు త్రైమాసికాలుగా దేశ జీడీపీ చాలా క్షీణించిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడటానికి పెద్ద నోట్లరద్దు ఒక్కటే కారణం కాదన్నారు.

అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం

అసంఘటిత రంగంపై పెద్ద నోట్లరద్దు తీవ్ర ప్రభావం చూపినట్టు ఆర్థిక నిపుణులు తెలిపారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికులు పెద్ద నోట్లరద్దు నిర్ణయంతో తమ ఉద్యోగాల్ని కోల్పోయారన్నారు. గ్రామీణులు తీవ్రంగా ప్రభావితం అయ్యారని, ఈ నిర్ణయంతో అక్కడి ప్రజలకు ఆర్థిక వనరులు తగ్గి కొనుగోళ్లూ తగ్గాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులు పెద్ద నోట్లరద్దు నిర్ణయం వల్ల ఆర్థికంగా చితికిపోయినట్టు 32% మంది పేర్కొన్నారు.

1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles