వెంకయ్యే ఉపరాష్ట్రపతి అభ్యర్థిTue,July 18, 2017 01:19 AM

-బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం..
-l నేడు నామినేషన్ దాఖలు

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: ఊహించినట్లుగానే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు రాజ్యాంగ పదవి చేపట్టబోతున్నారు. ఎలక్టోరల్ కాలేజీ గణాంకాల ప్రకారం గెలుపొందడానికి వెంకయ్యనాయుడికి తగిన మెజారిటీ ఉంది. ఇక విజయం లాంఛనమే. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాల అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సుమారు గంటకు పైగా చర్చలు జరిపి వెంకయ్యనాయుడి పేరును ఖరారు చేసింది.
Pic-ofthe-day
అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. నామినేషన్లను దాఖలు చేయడానికి మంగళవారం చివరిరోజు కావడంతో ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నామినేషన్ వేయనున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం తనకు ఇష్టం లేదని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై తనకు ఆసక్తి లేదని గతంలో పలుమార్లు వ్యాఖ్యానించినప్పటికీ ఆయనకున్న అర్హతల కారణంగా రాజ్యాంగ పదవిని ఇచ్చి గౌరవించాలని పార్టీ భావించింది. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, గృహనిర్మాణ, సమాచార మంత్రిత్వశాఖ పదవులకు వెంకయ్య రాజీనామా చేశారు.

వెంకయ్యనాయుడి ఎంపిక వెనుక..


రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీయేతర పార్టీల సంఖ్యాబలం ఎక్కువ. కాంగ్రెస్ సహా ఆ కూటమి పార్టీలు, ఏ కూటమికీ చెందకుండా ఉన్న పార్టీలకు చెందిన సభ్యుల మెజారిటీ ఉన్నందున కీలకమైన అనేక బిల్లులకు ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో అనేక కీలక బిల్లులపై విపక్ష పార్టీల సభ్యులు గందరగోళం సృష్టించడంతో వెంకయ్య తనదైన శైలిలో వ్యవహరించి చక్కదిద్దారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనుభవాన్ని రాజ్యసభలో ఉపయోగించుకోవటానికి ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసినట్లు సమాచారం. రాజకీయాల్లో శత్రువులే లేకుండా అందరితో కలుపుగోలుగా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అందరి మనిషిగా వెంకయ్యకు గుర్తింపు ఉంది. ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయటం ద్వారా.. దక్షిణాది రాష్ర్టాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ ప్రాంతీయ సమానత్వాన్ని సాధించామని ఎన్నికల్లో ప్రచారం చేసుకోడానికి అవకాశం లభిస్తుంది. ఈ కారణాలతోనే ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఆగస్టు 5వ తేదీన ఎన్నికల అనంతరం సెషన్ ముగింపు రోజైన ఆగస్టు 11న వెంకయ్య నూతన ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

158

More News

VIRAL NEWS