చర్చల్లో తలమునకలు!

Thu,November 14, 2019 12:46 AM

-శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ వరుస భేటీలు
-కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారుపై కసరత్తు
-చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయన్న ఉద్ధవ్

ముంబై, నవంబర్ 13: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి ప్రణాళికను ఖరారుచేసేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తీవ్ర చర్చోపచర్చలు జరుపుతున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం కాంగ్రెస్ నేతలతో గంటకుపైగా సంప్రదింపు లు జరిపారు. అనంతరం మాట్లాడుతూ చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ మాట్లాడుతూ.. ఇదొక సానుకూల ముందడుగు అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేనతో పొత్తు ఖరారుకు ముందే కనీస ఉమ్మడి ప్రణాళికకు రూపకల్పన చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటుచేసే ఉమ్మడి కమిటీ కోసం ఎన్సీపీ ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది. ఆ పార్టీ నేత జయంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. శివసేనకు మేం ఎలాంటి షరతులు విధించలేదు. పరిపాలన ఎజెండాపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాం. కేంద్ర మంత్రి పదవికి అర్వింద్ సావంత్ రాజీనామా చేయ డంతో ఎన్డీయే నుంచి శివసేన బయటకొచ్చిన ట్టు మేం విశ్వసిస్తున్నాం అని చెప్పారు. కనీస ఉమ్మడి ప్రాతిపదికను మూడు పార్టీల అధినేతలు ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలవుతాయని కాంగ్రె స్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే.. సీఎం పీఠాన్ని శివసేన, ఎన్సీపీ చెరో సగం కాలం పంచుకుంటాయని, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులు ఇస్తారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఉమ్మడి ప్రణాళికలో శివసేన హిందుత్వ ఎజెండాకు ఎలా చోటు కల్పిస్తుందని బీజేపీ ప్రశ్నించింది. కాగా, రాజస్థాన్‌లోని జైపూర్ క్యాంప్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం తిరిగి ముంబై చేరుకున్నారు. శివసేన నేత సంజయ్‌రౌత్ బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్ ఖాతా పేరును మహారాష్ట్ర సేవకుడిగా మార్చుకున్నారు.

శివసేన డిమాండ్లకు ఒప్పుకునేది లేదు: అమిత్‌షా

మహారాష్ట్ర సంక్షోభంపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మౌనం వీడారు. బుధవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. మా కూటమి అధికారంలోకి వస్తే ఫడ్నవీసే సీఎం అవుతారని ఎన్నికలకు ముందు అనేకమార్లు చెప్పాం. శివసేన అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కొత్త డిమాండ్లు పెడుతున్నారు. వాటికి మేం ఒప్పుకునేది లేదు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 18 రోజులు గడిచినా ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదని గుర్తుచేశారు. గవర్నర్ నిబంధనల మేరకే నడుచుకున్నట్టు చెప్పారు.

కలిసివెళ్లకపోతే నష్టం

మహారాష్ట్రలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని, లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసినట్లేనని రాష్ట్ర పార్టీ నేతలంతా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పారు. శివసేనతో పొత్తు విషయంలో వ్యతిరేక వైఖరిని విడనాడాలని సూచించారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలు అశోక్‌చవాన్, పృథ్వీరాజ్‌చౌహాన్, బాలాసాహెబ్ థోరట్, మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు ఈ మేరకు సోనియాకు విజ్ఞప్తిచేసినట్లు తెలిసింది.

287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles