నేను మాట్లాడింది చారిత్రక వాస్తవం


Thu,May 16, 2019 02:33 AM

Nathuram Godse remark Didnt use the term terrorist says Kamal Haasan

- కులం గురించో, మతం గురించో మాట్లాడలేదు
- గాడ్సే తీవ్రవాది వ్యాఖ్యను సమర్థించుకున్న కమల్‌హాసన్


మదురై, మే 15: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేను స్వతంత్ర భారత దేశంలో తొలి తీవ్రవాదిగా పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. చారిత్రక వాస్తవం గురించే తాను మాట్లాడానని పేర్కొన్నారు. నిజం చేదుగా ఉంటుందని, అదే ఔషధంగా మారి ప్రజల రుగ్మతలను నయం చేస్తుందని అన్నారు. తనమీద చేయగలిగితే అర్థవంతమైన విమర్శలు చేయాలని తన విమర్శకులకు సూచించారు. తమిళనాడులోని తిరుపురన్‌కుండ్రమ్‌లో బుధవారం ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. అవరకురిచిలో నేను చేసిన వ్యాఖ్యలు విమర్శకులకు ఆగ్రహాన్ని కలిగించాయి. నేను ఎవరినీ వివాదంలోకి లాగలేదు. కులం గురించో లేక మతం గురించో మాట్లాడలేదు. నేను మాట్లాడింది చారిత్రక సత్యం. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను విమర్శించే వారంతా తీవ్రవాది అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. కావాలంటే నేను (గాడ్సేకి వ్యతిరేకంగా) ఉగ్రవాది అనే పదాన్ని ఉపయోగించి ఉండవచ్చు.

కానీ అలా అనలేదు. మనవి క్రియాశీల రాజకీయాలు. వీటిలో ఎటువంటి హింసకు తావు ఉండకూడదు అని చెప్పారు. తన ప్రసంగాన్ని విమర్శకులు వారికి కావల్సినట్టుగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. విమర్శకుల నిందలు తనను బాధించాయన్నారు. తన వ్యాఖ్యల వల్ల హింస ప్రజ్వరిల్లిన ఉదంతాలేమైనా ఉంటే చూపగలరా అని విమర్శకులను ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను నేను గాయపర్చానని విమర్శకులు చెప్తున్నారు. నా కుటుంబంలో చాలా మంది హిందువులు ఉన్నారు. నా కుమార్తె కూడా హిందూ మతాన్ని నమ్ముతుంది. హిందువులకు వ్యతిరేకంగా నేనెందుకు వ్యాఖ్యలు చేస్తానని వారంతా ఆశ్చర్యపోతున్నారు అని కమల్‌హాసన్ తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ కమల్‌హాసన్ బుధవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తాను ప్రసంగించింది నాధూరామ్ గాడ్సే గురించేనని, అంతేతప్ప మొత్తం హిందువుల గురించి కాదని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఈ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కమల్‌హాసన్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించడంతో ఆయన ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు.

735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles