గ్రహాంతర జీవుల నుంచి సంకేతాలు!


Fri,January 11, 2019 02:42 AM

Mysterious fast radio bursts from deep space could be aliens

-రెండోసారి రిపీటింగ్ ఎఫ్‌ఆర్‌బీని గుర్తించిన శాస్త్రవేత్తలు
టొరంటో: గ్రహాంతర జీవులు (ఏలియన్లు) ఉన్నారనే భావనకు మరింత బలం చేకూరింది. మన నక్షత్ర మండలానికి ఆవలి నుంచి ఒకే కేంద్రం (సోర్స్) ద్వారా వెలువడుతున్న రిపీటింగ్ ఫాస్ట్ రేడియో బరస్ట్(ఎఫ్‌ఆర్‌బీ- రేడియో సంకేతాలు) సంకేతాలను కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు రెండోసారి గుర్తించారు. బ్రిటిష్ కొలంబియాలో ఏర్పాటు చేసిన కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పరిమెంట్ (సీహెచ్‌ఐఎమ్‌ఈ) టెలిస్కోప్ ద్వారా ఈ సంకేతాలను గుర్తించారు. కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరం నుంచి వెలువడే శక్తిమంతమైన పేలుళ్లకు సంబంధించిన రేడియో తరంగాలనే ఎఫ్‌ఆర్‌బీలుగా వ్యవహరిస్తారు. ఈ ఎఫ్‌ఆర్‌బీలు గ్రహమంత పరిమాణంలో ఉన్న ఏలియన్ ట్రాన్స్‌మిటర్స్ నుంచి వెలువడుతుండవచ్చని హార్వర్డ్ స్మిత్‌సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఫ్రొఫెసర్ ఎవీ లియోబ్, మనస్వి లింగం 2017లో అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 60 ఎఫ్‌ఆర్‌బీ సంకేతాలను గుర్తించగా, 2015లో తొలిసారిగా ఒకే సోర్స్ ద్వారా వెలువడుతున్న రిపీటింగ్ ఎఫ్‌ఆర్‌బీని కనుగొన్నారు.

2018 వేసవిలో గుర్తించిన 13 ఎఫ్‌ఆర్‌బీలలో ఈ రిపీటింగ్ ఎఫ్‌ఆర్‌బీ ఒకటి. 1.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని ఒకే ప్రాంతం నుంచి ఆరు సార్లు ఈ సంకేతాలు వెలువడ్డాయి అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రేడియో తరంగాలు ఎక్కడి నుంచి వచ్చినా... వాటి పౌనఃపున్య శ్రేణి ఆసక్తికరంగా ఉందని వివరించారు. ఇప్పటివరకు ఒకే రిపిటీంగ్ ఎఫ్‌ఆర్‌బీని కనుగొన్నారు. రెండోది గుర్తించడం ద్వారా ఇలాంటివి మరిన్ని ఉండే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది అని శాస్త్రవేత్త ఇన్‌గ్రిండ్ స్టెయిర్స్ అన్నారు. తాజాగా గుర్తించిన 13 ఎఫ్‌ఆర్‌బీల్లో వికిరణ సంకేతాలు కనిపిస్తున్నాయని, రేడియో తరంగాలు వెలువడుతున్న ప్రాంత పరిసరాల గురించి తెలుసుకునేందుకు వీటి ద్వారా వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూపర్‌నోవా అవశేషం లేదా ఏదైనా గెలాక్సీలోని సెంట్రల్ బ్లాక్ హోల్ సమీపంలో ఈ రేడియో సంకేతాల కేంద్రం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

1259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles