సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం


Mon,December 31, 2018 02:17 AM

Mrinal Sen legendary filmmaker and Phalke awardee passes away at 95

-భారతీయ సమాంతర సినిమాకు బాటలేసిన స్రష్ఠ
-ఒక ఊరి కథతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి
-అజరామర చిత్రకారుడి అస్తమయం
-దర్శక స్రష్ఠ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్‌సేన్ కన్నుమూత
-భారతీయ సమాంతర సినిమాకు బాటలేసిన దర్శకుడు
-ఐదు దశాబ్దాల తన సినీప్రస్థానంలో 27 సినిమాలతో చెరగని ముద్ర

కోల్‌కతా, డిసెంబర్ 30: నవతరపు సమాంతర భారతీయ సినిమా పథనిర్దేశకుడు, రియలిస్టిక్ కథాంశాన్ని రీళ్ల పైకి నడిపించిన దిగ్దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్‌సేన్ ఇక లేరు. 95 ఏండ్ల మృణాల్.. వయసురీత్యా వచ్చిన శారీరక సమస్యల కారణంగా కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోల్‌కతాలోని భవానిపూర్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. సత్యజిత్‌రే, రిత్విక్ ఘటక్‌లతోకూడిన మహాదర్శక త్రయంలో ఒకరైన మృణాల్ అస్తమయంతో బెంగాలీ సినిమాకు సంబంధించి ఒక శకం ముగిసింది. ఆయన భౌతికకాయాన్ని పీస్ వరల్డ్ మార్చురీకి తరలించారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు కునాల్ సేన్ వచ్చిన తర్వాత జనవరి 2న (బుధవారం) మృణాల్ అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. మృణాల్‌సేన్ 1923 మే 14న అవిభాజ్య భారత్‌లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న) ఫరీద్‌పూర్‌లో సంప్రదాయ హిందూ కుటుంబంలో జన్మించారు. స్థానికంగా హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకని, ఉన్నత చదువుల కోసం కలకత్తా వచ్చారు. ప్రసిద్ధ స్కాటిష్ చర్చ్ కళాశాలలో ఆయన భౌతికశాస్త్రం డిగ్రీ చదివారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. మృణాల్‌లో ఫరీద్‌పూర్‌లో ఉన్నప్పటి దృష్టికోణం కన్నా కలకత్తాలో అడుగిడిన తర్వాత ఏర్పడ్డ దృక్పథం విస్తృతమైనది.

mrinal-sen2
అదే ఆయనలో భౌతికశాస్ర్తానికి అతీతమైన కళల గురించి ఆలోచించే అవకాశాన్ని కలిగించింది. వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సాంస్కృతిక విభాగంతో అనుబంధం ఏర్పరచుకున్నారు. పార్టీ సభ్యత్వం స్వీకరించకున్నా సోషలిస్ట్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. అక్కడే మృణాల్‌కు ఎన్నెన్నో సాంస్కృతిక కళారూపాలతో, కళాకారులతో పరిచయం పెరిగింది. అది క్రమంగా ఆయనలోని సృజనాత్మకతను తట్టిలేపింది. తొలినాళ్లలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసిన మృణాల్ కొద్దిరోజులకే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కలకత్తాలోని ఓ సినిమా స్టూడియోలో ఆడియో టెక్నీషియన్‌గా చేరారు. అక్కడినుంచి ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ఫిల్మ్‌మేకింగ్‌పై విస్తృతంగా అధ్యయనం ఆరంభించారు. తను ఇష్టంగా చదివిన భౌతికశాస్త్ర సూత్రాలను వెండితెరపై భౌతిక వాస్తవాల కథలుగా రూపుదిద్దాలనుకున్నారు. సామాన్యుడి కష్టాలు, కన్నీళ్లను రూపుమాపే మెడిసిన్‌గా సినిమా కళను మార్చాలనుకున్నారు. తను ఫిల్మ్‌మేకర్‌గానే స్థిరపడాలనుకున్నారు.

mrinal-sen3

పద్మభూషణ్ మృణాల్‌సేన్..

సత్యజిత్‌రే, రిత్విక్ ఘటక్‌లది ఒక త్రయం. వారు బెంగాలీ సినిమాకే కాదు, ఆధునిక భారతీయ సమాంతర సినిమాకు ప్రపంచ వేదికపై గొప్ప ప్రతినిధులుగా వెలుగొందారు. సినిమా మాధ్యమంగా సామాజిక వాస్తవాన్ని వివరించడం, కళాత్మకంగా ప్రతిబింబించడం వంటి వాటికి మృణాల్‌సేన్ పేరుపొందారు. అంతర్జాతీయ, జాతీయ వేదికలపై పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, గౌరవాలు ఆయన పొందారు. మృణాల్ దర్శకుడిగా రాత్ భర్ (1955)తో సినిమా తెరపై తళుక్కున మెరిశారు. ఆ సినిమా పేరుకు తగ్గట్టుగానే ఆయన మొదట బెంగాలీ.. ఆ తర్వాత భారతీయ సినీ ప్రపంచానికి తొలి వేకువగా నిలిచారు. మూడేండ్ల విరామం తర్వాత 1958లో నీల్ ఆకాశర్ నీచే సినిమా తీశారు. 1960లో వచ్చిన ఆయన మూడో చిత్రం బైసే శ్రావణతో మృణాల్‌కు తొలిసారిగా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పునశ్చ (1961), అవశేషే (1963), ఆకాశ్ కుసుమ్ (1965), మాటిర మానిష (1966) వంటి సినిమా లతో మృణాల్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సినీ యవనికపైముద్రించే ప్రయత్నం చేశారు. మృణాల్‌సేన్ రూపొందించిన చిత్రాల్లో ప్రత్యేకమైనది భువన్ శోమ్. 1969లో ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైన ఈ సినిమా అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. ఇప్పుడు సమాంతర సినిమాగా వ్యవహరిస్తున్న ఇండియన్ ఆర్ట్ సినిమా లేదా న్యూవేవ్ సినిమాకు నాంది పలికింది ఈ చిత్రరాజమే. వాస్తవానికి ఈ సినిమాలో పెద్ద కథ అంటూ ఏమీ ఉండదు.

mrinal-sen4
దైనందిన జీవితంలో తారసపడే పాత్రలు, సంఘటనలతో కూడా సినిమాలు నిర్మించి వాటిని కేవలం అవార్డులకే పరిమితం చేయకుండా ప్రేక్షకుల మన్ననలు పొందేలా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన సినిమా భువన్ శోమ్. ఈ చిత్రం తర్వాతే సినిమాకి సమాంతరంగా వాస్తవిక దృక్పథంతో కూడిన సినిమాలు మనదేశంలో రావడం మొదలయ్యాయి. ఈ సినిమా తర్వాత.. పదాతిక్ (1974), మృగయా(1976), ఏక్ దిన్ ప్రతిదిన్ (1979), అకలేర్ సంధానే (1980), ఖరీజ్ (1981), ఖందార్ (1984).. ఇలా మొత్తం ఆరు సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా మృణాల్‌సేన్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. ఇవికాకుండా ఏక్‌దిన్ అచానక్ (1989), మహాపృథ్వి(1991), అంతరీన్, వంటి సినిమాలు తీసిన మృణాల్‌సేన్.. తన చివరిచిత్రం అమార్ భువన్(2002)ను సమాజంలో పెరుగుతున్న అసహనం కథాంశంగా రూపొందించారు. ఆయన సినిమాలకు నేపథ్యం, కథావస్తువు కలకత్తా నగరమే. ఆ నగరంపై తనకున్న ప్రేమను చాటుకోవడానికే కలకత్తా ట్రయాలజీ పేర మూడు సినిమాలు (ఇంటర్వ్యూ, కలకత్తా71, పదాతిక్) కూడా తీశారు. ఇప్పటి బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్‌కు తొలిసారిగా సినిమాలో అవకాశాన్నిచ్చింది మృణాల్. అయితే నటుడిగానే కాకుండా ఆయన గొంతులోని గంభీరతను గమనించి, దానిని తన భువన్ షోమ్ సినిమాలో వాడుకున్నారు. అలాగే మృగయా (1976) సినిమా ద్వారా మిథున్ చక్రవర్తిని వెండితెరకు పరిచయం చేయడమే కాకుండా, తొలిసినిమాతోనే మిథున్ జాతీయ ఉత్తమనటుడి అవార్డు సాధించేలా తీర్చిదిద్దారు. ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఆయన సినిమాలు అవార్డులు అందుకున్నాయి.

mrinal-sen5

ప్రముఖుల నివాళి

మృణాల్ మృతిపట్ల ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. సామాజిక వాస్తవికతను మృణాల్‌సేన్ సున్నితంగా దృశ్యమానం చేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. మృణాల్ సేన్ ఇక లేరన్న విషాద వార్త విన్నాను. భువన్‌షోమ్ నుంచి కలకత్తా ట్రయాలజీ వరకు అనేక దృశ్య కళాఖండాలతో మనకాలపు చరిత్రకారుడిగా ఆయన నిలిచిపోయారు అని రాష్ట్రపతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ.. మృణాల్‌సేన్ ఎన్నో అజరామర చిత్రాలను మనకందించారు. సినిమారంగంలో పలు తరాలపాటు ఆయన కృషి కొనసాగింది. ఆయనకు నా నివాళి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. మృణాల్ మృతి భారతీయ ఆర్ట్ సినిమాకు తీరని లోటు అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేఎన్ త్రిపాఠి, సీఎం మమతాబెనర్జీ తెలిపారు. సామాజిక వాస్తవాలను మానవీయంగా వివరించిన గొప్ప దర్శకుడు మృణాల్‌సేన్ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం యేచూరి గుర్తుచేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, కాంగ్రెస్ అధ్య క్షుడు రాహుల్‌గాంధీ కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అద్భుతమైన భారతీయ సినిమా నిపుణుడు ఇక లేరంటూ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా సినిమాల ద్వారా తన వాణిని మృణాల్‌సేన్ బలంగా వినిపించారని పలువురు మాజీ నక్సల్ నేతలు అజీజుల్ హక్, సంతోష్ రాణా, ఆశిమ్ ఛటర్జీ పేర్కొన్నారు.

mrinal-sen3

తెలుగులో ఒక ఊరి కథ

మృణాల్ తెలుగులో రూపొందించిన ఏకైక చిత్రం ఒక ఊరి కథ. 1977లో వచ్చిన ఈ సినిమా.. మున్షీ ప్రేమ్‌చంద్ నవల కఫన్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా హాంకాంగ్, కర్లోవీ వేరీ, కార్తేజ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకుంది. భారతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును ఒక ఊరి కథ గెలుచుకుంది. రాష్ట్రప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. ఓ పేదకుటుంబంలో కన్నతండ్రి-కట్టుకున్న భార్య మధ్య నలిగే యువకుడి కథను హృద్యంగా తెరకెక్కించారు మృణాల్‌సేన్. ఇష్టంలేని పెండ్లి చేసుకున్నందుకు కోడలు పురిటినొప్పులతో బాధపడుతున్నా, మంత్రిసానిని పిలిచేందుకు కూడా నిరాకరిస్తాడు మామ. ఫలితంగా కోడలు చనిపోవడం, ఆమె అంత్యక్రియల కోసం తండ్రీకొడుకుల్దిదరూ ఊరిజనం దగ్గర చందాలు సేకరించడం.. ఒక్కో సన్నివేశం ప్రేక్షకుడిని కదిలిస్తుంది. తండ్రీ కొడుకులుగా వాసుదేవరావు(వెంకయ్య), జీ నారాయణరావు (కిష్టయ్య)గా నటించగా, కిష్టయ్య భార్య నీలమ్మ పాత్రను నిన్నటి తరం బెంగాలీ నటి మమతా శంకర్ పోషించారు.

mrinal-sen6
అలనాటి హిందీ నటుడు ప్రదీప్‌కుమార్ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటించారు. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లో ఏక్ అధూరీ కహానీ, కోరస్, జెనెసిస్, అంతరీన్ వంటి మరెన్నో కళాఖండాలను మృణాల్‌సేన్ తెరపై సృష్టించారు. రాత్ చోర్ నుంచి అమార్ భువన్ వరకు 47 సంవత్సరాల ఫిల్మ్‌కెరీర్‌లో దాదాపుగా 27 సినిమాలను తీసి భారతీయ సినీ తెరపై తన సంతకాన్ని ముద్రించారు. ఇవేకాకుండా 15 షార్ట్ ఫిల్మ్‌లు, నాలుగు డాక్యుమెంటరీలు తీసి 2004లో ఆల్వేస్ బీయింగ్ బార్న్ పేరిట ఆత్మకథని రాశారు. ఆయన వల్ల స్ఫూర్తి పొందిన ఎంతోమంది మృణాల్ జీవితకథను డాక్యుమెంటరీలుగా, సినిమాలుగా రూపొందించారు. టెన్ డేస్ ఇన్ కలకత్తా (1984), విత్ మృణాల్‌సేన్ (1989), ఎ మ్యాన్ బిహైండ్ ది కర్టెన్ (1998), పోట్రయిట్ ఆఫ్ ఏ ఫిల్మ్ మేకర్ (1999) వంటివి వాటిలో కొన్ని మాత్రమే. 1981లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునిచ్చి భారత ప్రభుత్వం తన గౌరవాన్ని నిలుపుకొన్నది.

1141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles