కుంభమేళాకు పోటెత్తిన భక్తులు


Tue,January 22, 2019 02:39 AM

More than 70 million people Holy baths on Monday in the Ganga river

-గంగానదిలో సోమవారం 70 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు
-నిండు చంద్రుని దర్శనంతో పులకించిన భక్తజనులు
-సన్యాసం స్వీకరించేందుకు వేలమంది ఎదురుచూపులు

అలహాబాద్, జనవరి 21: పుష్య పూర్ణిమ పర్వదినం సందర్భంగా అలహాబాద్ వద్ద గంగానదిలో సోమవారం ఒక్కరోజే 70 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళాలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు ఇది రెండవ అత్యంత పవిత్రమైన రోజు కావడంతో భక్తులు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయలేదు. ఆదివారం రాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో సంగమం ప్రాంతంలో విపరీతమైన కోలాహలం నెలకొన్నది. అనేక ఘాట్లలో భక్తులు సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు ముగించుకుని రావడం కనిపించింది. నదిలో మరింత లోతుకు వెళ్లవద్దని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేయాలని భక్తులకు అధికారులు పదేపదే విజ్ఞప్తులు చేశారు. అంతకుముందు వేకువజామున చంద్రుడు పూర్ణాకృతిలో దర్శనమివ్వడంతో భక్తుల సంతోషం రెట్టింపయింది.

అక్కడ వినిపించిన భక్తిగీతాలు సందర్శకులను మరింత పరవశంలో ముంచెత్తాయి. సూర్యోదయానికి ముందు సంగమం ఏరియాలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసినప్పటికీ పుణ్యస్నానాలను తరలివచ్చిన భక్తులను అదేమీ అడ్డుకోలేకపోయింది. సమయం గడిచేకొద్దీ భక్తుల రాక మరింత పెరిగింది. పౌర్ణమిని కుంభమేళాలో నిష్ఠాకాల (కల్పవాస్) ప్రారంభానికి ప్రతీకగా పరిగణిస్తారు. పుష్య పూర్ణిమ ప్రాధాన్యతను స్వామి అధోక్షానంద్ వివరిస్తూ.. హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన రోజని, పుష్యమికి శ్రీకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పురాణాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు పుష్య పూర్ణిమ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Ganga
జపం, తపం, దానం లాంటి సత్కార్యాలకు ప్రతీకగా నిలిచే పుష్య పూర్ణిమ ప్రాచీన భారత పండుగల్లో ఒకటని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలావుంటే, కుంభమేళా సందర్భంగా సన్యాసాన్ని స్వీకరించేందుకు వేలమంది ఎదురు చూస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటివరకు వివిధ అఖారాల వద్ద 5 వేల మందికిపైగా పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. 13 అఖారాలు ఈ రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తున్నాయి. సన్యాస స్వీకార ఉత్సవాలు మౌని అమావాస్య నుంచి వసంత పంచమి మధ్య ఎక్కువగా జరుగుతాయి. మౌని అమావాస్య ఫిబ్రవరి 4న, వసంత పంచమి పర్వదినం ఫిబ్రవరి 10న వస్తాయి.

229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles