జూన్ 4న కేరళకు రుతుపవనాల రాక


Wed,May 15, 2019 02:03 AM

Monsoon likely to hit Kerala on June 4 Skymet

- ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు
- మందకొడిగా కదలనున్న రుతుపవనాలు
- స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా


న్యూఢిల్లీ, మే 14:వచ్చే నెల 4న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ అంచనావేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయని మంగళవారం తెలిపింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. జూలై మధ్యనాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా రానున్నాయి. మే 22న (రెండ్రోజులు అటూ ఇటూ) రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయి. జూన్ 4న (రెండ్రోజులు అటూ ఇటూ) నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని స్కైమెట్ అంచనావేసింది. దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 93% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ఈసారి రుతుపవనాల పురోగమనం మందకొడిగా ఉండే అవకాశం ఉందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ ఈఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందన్నారు. వాయవ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంతో పోలిస్తే తూర్పు, ఈశాన్య భారతం, మధ్య భారతదేశంలో తక్కువ వర్షపాతం కురుస్తుందన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురువడానికి 55 శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ పేర్కొంది.

తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఎల్పీఏలో 92 శాతం (సాధారణ కంటే తక్కువ) వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లకు వర్షాభావ ముప్పు ఉన్నదన్నది. ఉత్తరాది రాష్ర్టాలతో కూడిన వాయవ్య భారతంలో ఎల్పీఏలో 96 శాతం (సాధారణం, సాధారణం కంటే తక్కువ కేటగిరీలకు అంచున) వర్షపాతం నమోదుకావొచ్చన్నది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బాగా వర్షాలు పడుతాయని తెలిపింది. మధ్యభారతదేశంలో ఎల్పీఏలో 91% వర్షపాతం నమోదవుతుందన్నది. విదర్భ, మరాఠ్వాడా, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో సాధారణం కంటే అతితక్కువ వర్షపాతం నమోదు కావొచ్చన్నది. ఉత్తర కర్ణాటక, రాయలసీమలో తక్కువ వర్షాలు కురుస్తాయని, కేరళ, కర్ణాటక తీరప్రాంతాల్లో మంచి వర్షాలు పడుతాయని స్కైమెట్ తెలిపింది.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles