నిరుద్యోగ భృతి నెలకు రూ.10,000

Sat,October 12, 2019 03:08 AM

- రైతులకు 24 గంటల్లో రుణమాఫీ.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
- హర్యానాలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్‌

చండీగఢ్‌, అక్టోబర్‌ 11: హర్యానా ప్రజలపై కాంగ్రెస్‌ వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, స్థానికులకు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా, నిరుద్యోగులకు భృతి ఇస్తామని పేర్కొంది. ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొంది. రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. 300 యూనిట్లలోపు కరెంట్‌ను వినియోగించే గృహాలకు కూడా ఉచిత విద్యుత్‌ను ఇస్తామని వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపింది. అలాగే పంచాయతీ రాజ్‌కు చెందిన సంస్థల్లో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సిటీ కౌన్సిళ్లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. వితంతువులు, వికలాంగులు లేదా పెండ్లి కాని మహిళలకు నెలకు రూ.5100 పింఛన్‌ను అందజేస్తామని ప్రకటించింది. గర్భిణీలకు మూడో నెల నుంచి ప్రసవం అయ్యే వరకు నెలకు రూ.3100, మహిళ పేరుపై ఇల్లు ఉంటే ఇంటి పన్ను సగానికి తగ్గింపు, పీజీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.10,000, డిగ్రీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.7,000 భృతిని అందజేస్తామని పేర్కొంది.

4 రోజులు.. 9 సభలు

మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారు
మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. నాలుగు రోజులపాటు 9 సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ నెల 13న ఆయన భందారా జిల్లాలోని జల్‌గావ్‌, సకోలి నియోజకవర్గాల్లో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. 16న అకోలా, పాన్‌వెల్‌, పార్తూర్‌లలో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొంటారు. మరుసటి రోజు 17న పుణె, సతారా, పార్లిలలో ప్రసంగిస్తారు. 18వ తేదీన ముంబైలో జరిగే సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార వివరాలను శుక్రవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. బీజేపీ హయాంలో రూ.25, 000 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని గుర్తుచేశారు. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

3245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles