తిట్లే నాకు బహుమతులు


Wed,May 15, 2019 01:57 AM

Modi throws open challenge to opposition to prove if he is corrupt instead of just abusing him

- నన్ను దూషించే వారికి ప్రజలే తమ ఓట్లతో బదులిస్తారు
- ఎన్ని ఆస్తులు కూడబెట్టానో చెప్పండి
- ప్రతిపక్షాలకు మోదీ బహిరంగ సవాల్


బల్లియా, మే 14: విపక్ష పార్టీల నేతలు తనను దూషించని రోజు లేదని, వారి దూషణలను తనకు బహుమానాలుగా పరిగణిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకల్తీ కూటమి నేతలంతా నన్ను దూషిస్తున్నారు. వారు నన్ను దూషించని రోజు లేదు. ఆరు విడుతల ఎన్నికల తరువాత వారి ఈ స్థితికి దిగజారారు. వారి దూషణలను బహుమానంగా భావిస్తాను. వారికి నేను జవాబు ఇవ్వను, మీరే (ఓటర్లు) బీజేపీకి ఓటేసి జవాబు చెప్పాలి అని మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల చివరి విడుత ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా, బక్సర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తాను ఏమైనా అక్రమంగా ఆస్తులు సంపాదించి ఉంటే, విదేశాలలో డబ్బు దాచి ఉంటే రుజువు చేయాలని మోదీ విపక్షాలను సవాల్ చేశారు. నేను మహాకల్తీ కూటమికి బహిరంగ సవాలు విసురుతున్నాను. వారికి దమ్ముంటే నన్ను దూషించడానికి బదులు.. నా సవాల్ స్వీకరించాలి. నేనేమైనా బినామీ ఆస్తులను కూడబెట్టి ఉంటే.. ఫార్మ్‌హౌజ్, భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఉంటే.. విదేశీ బ్యాంకులో డబ్బు దాచుకొని ఉంటే లేదా లక్షలు, కోట్లు విలువ చేసే వాహనాలను కొని ఉంటే రుజువు చేయాలి అని అన్నారు. తమ వైఖరి వల్లే పాక్, దాని ఉగ్రవాదుల అహంకారం గాలిలో కలిసిపోయిందన్నారు. పాక్‌లో తుపాకులు పట్టుకొని బహిరంగంగా తిరిగే ఉగ్రవాదులు ఇప్పుడు భూగర్భంలో దాక్కొని, మోదీని తొలిగించాలని ప్రార్థనలు చేస్తున్నారన్నారు. ఈనాడు మనం ఉగ్రవాదంపై యుద్ధాన్ని సరిహద్దులు దాటించాం అని మోదీ అన్నారు.

గూండాలను అదుపుచేయలేని వారు.. ఉగ్రవాదాన్ని అడ్డుకుంటారా

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) కూటమిపై ప్రధాని విరుచుకుపడ్డారు. అది మహాకల్తీ కూటమి అని అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేస్తున్నదన్నారు. స్థానికంగా ఉండే గూండాలను అదుపు చేయలేనివారు ఉగ్రవాదులకు ఎలా కళ్లెం వేయగలరు అని ప్రశ్నించారు. ప్రపంచమంతటా విస్తరించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీలో ఓ పటిష్ఠమైన ప్రభుత్వం ఉండటం అవసరమన్నారు. ఇటీవల ఘాజీపూర్‌లో ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను మోదీ ప్రస్తావిస్తూ, ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు, బట్టలు చించుకుంటున్నారు.. ఎన్నికలు పూర్తి కాక ముందే వారు ప్రతీకారాలకు దిగారు అని అన్నారు. కుల రాజకీయాలతో వారు తమ బంధువులకు బంగళాలు, భవంతులు కట్టారని, బినామీ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఈ పార్టీల నేతలు మళ్లీ ఒకరి గొంతును ఒకరు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ కూటమి అధికారానికి వస్తే రాళ్లురువ్వే వారికి, నక్సలైట్లకు ఉచిత లైసెన్సులు ఇస్తారని ఆరోపించారు. బల్లియా ప్రజలు విదేశీ పాలనపై తిరుగబడినట్లే, మోదీ పేదరికంపై తిరుగుబాటు చేశాడని పేర్కొన్నారు.

వారణాసి ఓటర్లకు వీడియో సందేశం

చివరి విడుతలో పోలింగ్ జరుగనున్న వారణాసి ఓటర్లకు ప్రధాని మోదీ ఓ వీడియో సందేశం అందించారు. వారణాసి నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను కాశీ వాసినని, రెండోసారి వారణాసి నుంచి లోక్‌సభలో ప్రవేశించేందుకు ఇక్కడి ప్రజల ఆశీస్సులు తనకు కావాలని చెప్పారు. కాశీ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కాశీవాసులు నరేంద్రమోదీ కోసం.. నరేంద్ర మోదీలా ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారని అన్నారు.

288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles