మోదీ పాలన మాయని మచ్చ!


Thu,May 16, 2019 02:01 AM

Modi tenure as Gujrat CM blot on countrys communal history Mayawati

- గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మతవిద్వేషాలకు ఆజ్యం పోశారు
- ప్రధాని పదవికి అనర్హుడు, ఆయన నిజాయితీ కాగితాలకే పరిమితం
- నిప్పులు చెరిగిన మాయావతి


లక్నో, మే 15: మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సాగించిన పాలన జాతి చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీపై విరుచుకుపడ్డారు. లక్నోలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాష్ర్ట సీఎం, దేశ ప్రధాని పదవులకు నరేంద్ర మోదీ అనర్హుడు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ర్టమంతా అరాచకత్వం, విద్వేషాలు చెలరేగాయి. ప్రధానిగా ఉన్నప్పుడూ దేశమంతా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. నేను యూపీకి 4 సార్లు సీఎంగా పని చేసిన కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా చాలా ఏండ్లు కొనసాగినా, ఆయన పాలనలో చెలరేగిన విద్వేషాలు ఆయనపైనే కాకుండా బీజేపీ చరిత్రలో, జాతి చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయాయి అని మాయావతి నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలు, సంక్షేమం, దేశాభివృద్ధిపై నాకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ప్రజలకు అర్థమైంది. ఈ విషయంలో మోదీ విఫలమయ్యారన్నది కూడా అందరికీ తెలిసిపోయింది. మా హయాంలో యూపీలో ఎటువంటి అల్లర్లు, విద్వేషాలు చెలరేగలేదు. ఐతే మోదీ గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అరాచకత్వం, విద్వేషాలు, ఉద్రిక్త పరిస్థితులు, హింస చెలరేగాయి. మెరుగైన పాలననందించడంలోవిఫలమయ్యారు అని అన్నారు. తమ పార్టీ నాయకులు సచ్ఛీలురని, ఇతరులు అవినీతిపరులని నిరూపించడానికి ముందు వెనుక ఆలోచించకుండా బీజేపీ జీఎస్‌టీ, నోట్ల రద్దును తీసుకొచ్చిందని ఆమె దుయ్యబట్టారు. బీజేపీకి ప్రీతిపాత్రమైన అవినీతి పెట్టుబడిదారులు (మాల్యా, నీరవ్ మోదీలను ఉద్దేశిస్తూ) ప్రజల సొమ్మును దోచుకొని దేశం విడిచి పారిపోయారు.

ఇది మోదీ సర్కార్ చొరవతోనే సాధ్యమైంది అని ఆమె అన్నారు. తమ పార్టీ నేతలు నిజాయితీపరులని, ఇతరులు అవినీతిపరులని నిరూపించడానికి బీజేపీ ఆపసోపాలు పడుతున్నదని, ఐతే అవినీతి, బినామీ ఆస్తులు గల బీజేపీ నేతల గురించి ప్రజలకు తెలుసన్నారు. మోదీ ఓబీసీ కులం కాగితాలకే పరిమితమైనట్టు, ఆయన నిజాయితీపరుడనేది కూడా కాగితాల్లోనే ఉంటుందని ఆమె ఎద్దేవా చేశారు. మాయావతి దళిత్ కీ భేటీ కాదు దౌలత్ కీ భేటీ (ధనవంతుల కుమార్తె)గా అభివర్ణించిన వాళ్ళపై సైతం ఆమె మండిపడ్డారు. కులాలపై వివక్ష చూపేవాళ్లు, అవివేకులే ఈ వ్యాఖ్యలు చేస్తారని, అలాంటి వాళ్ళే దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని, అందులో బీజేపీ అగ్రస్థానంలో ఉంటుందని ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ విపక్షాలను అవినీతిపరులుగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నిసున్నదని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా తాను పేదవాడినని, సన్యాసినని, తనకు ఆస్తులు లేవని మోదీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. యూపీలో ఇప్పటికే ఆరు విడుతల్లో పోలింగ్ పూర్తయింది. చివరి విడుతలో భాగంగా.. మే 19న 13 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles