భారత్‌ను పెట్టుబడులతో ముంచెత్తండిTue,November 14, 2017 03:31 AM

- అనేక రంగాలలో విదేశీ పెట్టుబడులకు అవకాశం
- ఆసియాన్ దేశాలకు మోదీ పిలుపు
- నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధమైందని వెల్లడి
narendra-modi
మనీలా, నవంబర్ 13: భారత్‌ను పెట్టుబడులతో ముంచెత్తాలని ఆసియాన్ బిజినెస్ ఫోరంను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. దేశంలో తాము చేపట్టిన ఆర్థిక సంస్కరణలను వివరించిన ప్రధాని పరివర్తన దిశగా భారత్ అసాధారణస్థాయిలో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సోమవారం జరిగిన ఆసియాన్ బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రధాని మాట్లాడారు. తమ తూర్పు ఆసియా విధానంలో పది దేశాల కూటమికి కేంద్ర స్థానం ఇస్తున్నామని, భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో విదేశీ పెట్టుబడుల కోసం ద్వారాలు తెరిచామని చెప్పారు. సులభమైన, ప్రభావవంతమైన, పారదర్శకమైన పాలన కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని అన్నారు. ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారత్‌ను మార్చాలన్న లక్ష్యంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, యువతను ఉపాధి సృష్టికర్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నోట్ల రద్దుతోపాటు తాము వరుసగా చేపట్టిన పలు సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేశాయని చెప్పారు. పరిశ్రమలు స్థాపించే, ఇతర అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు. ప్రజలను చేరుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు.

వరిధాన్యం పరిశోధన కేంద్రం సందర్శన

భారత్‌కు చెందిన రెండు వరిధాన్యం రకాలను ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరిధాన్యం పరిశోధన కేంద్రానికి(ఐఆర్‌ఆర్‌ఐ) చెందిన జన్యు బ్యాంక్‌కు అందించారు. మనీలాకు 65 కిలోమీటర్ల దూరంలోని లాస్‌బానోస్ పట్టణంలో గల ఐఆర్‌ఆర్‌ఐని మోదీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ తన పేరిట నెలకొల్పిన ఒక వరిధాన్యం ల్యాబొరేటరీని ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మనీలాలో జైపూర్ కాళ్లను ఉచితంగా అందించే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జైపూర్ కాలును అమర్చుకున్న ఓ తొమ్మిదేండ్ల బాలుడిని ఆయన కలుసుకున్నారు. ఆ బాలుని గురించి మోదీ ట్వీట్ చేస్తూ నేను పోలీసును కావాలనుకుంటున్నాను అని నా స్నేహితుడు (బాలుడు) చెప్పాడు. అతని వంటి ఎంతోమంది యువతకు జైపూర్ కాలు రెక్కలు తొడగటం సంతోషాన్నిచ్చింది అని పేర్కొన్నారు.

కష్టపడి పనిచేయండి: భారత సంతతి వారితో మోదీ

21వ శతాబ్దం భారత్‌దే అయ్యేలా కష్టపడి పనిచేయాలని ఫిలిప్పీన్స్‌లోని భారతీయులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో పరివర్తన తెచ్చేందుకు, ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.

396

More News

VIRAL NEWS