అంబానీ, మాల్యాలకు కోట్లు.. రైతులకు మాత్రం మూడున్నరా?


Sun,February 17, 2019 02:40 AM

Modi Govt Gave Crores of Rupees to Anil Ambani and Mallya

-ప్రజల సొమ్ము లాక్కుని పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేశారు
-మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ ధ్వజం

జగదల్పూర్ (ఛత్తీస్‌గఢ్), ఫిబ్రవరి 16: నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ లాంటి వ్యక్తులకు కోట్లాది రూపాయలు ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. రైతులకు మాత్రం రోజుకు కేవలం రూ.3.50 ఇస్తామని ప్రకటించిందని విమర్శించారు. రెండు హెక్టార్ల (ఐదెకరాల)లోపు సాగుభూమి ఉన్న రైతులకు ఏటా నేరుగా రూ.6 వేల నగదు సాయాన్ని అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఈ విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు లోక్‌సభలో బీజేపీ ఎంపీలు బల్లలు చరచడాన్ని రాహుల్ గుర్తుచేస్తూ.. ఇది జోక్ కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ధురాగావ్‌లో శనివారం గిరిజనుల సదస్సులో రాహుల్ మాట్లాడారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే పేద ప్రజలకు కనీస ఆదాయాన్ని కల్పిస్తామని, ఆ సొమ్మును నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాహుల్ తెలిపారు.

దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలోకి రూ.15 లక్షలు బదిలీ చేయడంతోపాటు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల మీరంతా బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు ఎప్పుడైనా క్యూలో నిల్చోవడాన్ని మీరు చూశారా? ఇది నల్లధనంపై పోరాటమే అయితే నిజాయితీపరులైన ప్రజలంతా క్యూలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ప్రజల సొమ్మును లాక్కున్నదని, వ్యాపారవేత్తలు చెల్లించాల్సిన లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం అర్ధరాత్రి పూట గబ్బర్ సింగ్ టాక్స్‌ను(జీఎస్టీని) తీసుకొచ్చి వర్తకుల వ్యాపారాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles