మోదీ నిర్వాకం ఇదీ..


Thu,March 21, 2019 02:40 AM

Modi govt destroyed 30000 jobs everyday in 2018

-ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పి
-రోజుకు 30 వేల ఉద్యోగాలు ఊడబీకారు
-ఆయన అసమర్థతకు ఇదే పెద్ద నిదర్శనం
-పీఎంవోను ప్రచార మంత్రి కార్యాలయంగా మార్చారు
-మోదీ ఏ యూనివర్సిటీలో చదివారో ఎవరికీ తెలియదు
-దేశంపై మిడిమిడి జ్ఞానాన్ని రుద్దుతున్నారు
-ప్రధానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్

ఇంఫాల్, మార్చి 20: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తనను తాను మార్కెటింగ్ చేసుకునేందుకు పీఎంవోను (ప్రధాన మంత్రి కార్యాలయాన్ని) ప్రచార మంత్రి కార్యాలయం (పబ్లిసిటీ మినిస్టర్స్ ఆఫీస్) స్థాయికి దిగజార్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బుధవారం ఆయన విద్యార్థులతో ముచ్చటించడంతోపాటు బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం మొదలుకొని పెద్దనోట్ల రద్దు వరకు వివిధ అంశాలపై ప్రధానిని తూర్పారబట్టారు. మోదీ కనుసన్నల్లో విద్యా సంస్థల కాషాయీకరణ జరుగుతున్నదని ఆరోపిస్తూ.. మోదీ ఎప్పుడైనా యూనివర్శిటీలో చదివారా అని ప్రశ్నించారు. పౌరసత్వ (సవరణ) బిల్లును రాహుల్ ప్రస్తావిస్తూ.. మోదీ సర్కారు తన యాక్ట్ ఈస్ట్ పాలసీకి ద్రోహం చేస్తున్నదని, ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టినప్పుడు దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తారని చెప్పిన మోదీ.. రోజుకు సగటున 30 వేలకుపైగా ఉద్యోగాలను నాశనం చేశారని, ఒక్క 2018లోనే కోటి మంది యువత ఉద్యోగాలను కోల్పోయారని రాహుల్ పేర్కొన్నారు. ఇది మోదీ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మోదీ ఎన్నడైనా యూనివర్సిటీకి వెళ్లినట్టు ఎవరికీ తెలియదు. ఆయన ఏ యూనివర్సటీ డిగ్రీలను పొందారో ఎవరికీ తెలియదు. ఆ వివరాలేవీ అందుబాటులో లేవు.

ప్రధాని పొందిన డిగ్రీలేమిటో తెలుపాలని సమాచార హక్క చట్టం కింద ఢిల్లీలో దాఖలైన దరఖాస్తుకు సమాధానమేమీ రాలేదు అని రాహుల్ చెప్పారు. ఆధునిక భారత దేశంపై మోదీ మిడిమిడి జ్ఞానాన్ని రుద్దుతున్నారని ఆరోపించారు. మణిపూర్ యూనివర్సిటీలో గతేడాది అశాంతి చెలరేగి మూడు నెలలపాటు ఆ యూనివర్సిటీ మూతపడటాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యా వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న వైస్ చాన్సలర్ ఏపీ పాండేని ఆ పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు సాగించిన పోరాటం విజయవంతమైనందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)తో సంబంధాలున్న ఏపీ పాండేని మీపై బలవంతంగా రుద్దారు. ఆయనను గెంటేయడంలో మణిపూర్ ప్రజలు సఫలీకృతులయ్యారు. లాగులు ధరించి, చేతిలో లాఠీ పట్టుకుని విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే విశ్వవిద్యాలయాన్ని నడిపేందుకు అర్హతలని కాషాయ మూకలు భావిస్తున్నాయి అని రాహుల్ పేర్కొంటూ.. పరోక్షంగా ఆరెస్సెస్‌పై విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దు హాస్యాస్పదమైన నిర్ణయమని, ఈ నిర్ణయంతో ఎంతో మంది ప్రజల జీవితాలను మోదీ నాశనం చేశారని నిప్పులు చెరిగారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే పౌరసత్వ బిల్లును తిరిగి ప్రవేశపెడతామని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడాన్ని ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై దాడిగా అభివర్ణించారు. ఆ బిల్లు ఆమోదం పొందకుండా చూస్తామని, ఈశాన్య ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ కాపాడుతుందని రాహుల్ స్పష్టం చేశారు.

ఆరెస్సెస్ మద్దతు ఉంటేనే పదవులు

మోదీ వారసత్వ రాజకీయాల విమర్శను తిప్పికొట్టిన కాంగ్రెస్
సంఘ్ పరివార్ మద్దతు లేకుండా బీజేపీకి చెందిన వారెవరూ కూడా ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాలేరని, స్వయంగా మోదీ కూడా ఆరెస్సెస్ ఆశీర్వాదాలతోనే ప్రధాని అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌వి వారసత్వ రాజకీయాలంటూ ప్రధానిమోదీ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. మోదీ ఏం మాట్లాడుతున్నారు? ఆరెస్సెస్ మద్దతు లేకుండా బీజేపీకి చెందిన వారెవరైనా ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలరా? సంఘ్ పరివార్ ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం. వారి ఆశీర్వాదాలు లేకుండా.. ప్రధాని పదవి కావచ్చు.. మంత్రి, గవర్నర్ లేదా ముఖ్యమంత్రి పదవి కావచ్చు.. ఈ దేశంలో ఎవ్వరూ ప్రభుత్వ పదవులు పొందలేరు అని చెప్పారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే బదులు ప్రధాని తనను తాను ఆత్మపరిశీలన చేసుకొని, ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సిబల్ హితవు చెప్పారు.

603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles