జనం ‘ఓటె’త్తాలి


Fri,March 15, 2019 11:25 AM

Modi appeals citizens to vote ahead of the 2019 Lok Sabha election

-ఓటింగ్ శాతం పెంచండి ఓటర్లను ఓటు వేసేలా ప్రోత్సహించండి
-వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
-బలమైన ప్రజాస్వామ్యం కోసం సహకరించాలని పౌరులకు పిలుపు

న్యూఢిల్లీ, మార్చి 13: ఓటు వేయడం ప్రాథమిక కర్తవ్యమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల కోసం దేశం సమాయత్తమవుతుండగా, ఎన్నికల ప్రక్రియలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఆయన నాలుగు విజ్ఞప్తులు చేశారు. ఓటరుగా నమోదు చేసుకోండి, ఓటర్ల జాబితాలో మీ పేర్లు చూసుకోండి, ఎన్నికల రోజు కోసం సిద్ధంగా ఉండండి, ఓటు వేసేలా ఇతరులను ప్రోత్సహించండి అని ప్రధాని కోరారు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి ఓటు వేసేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని ఆయన వివిధ రంగాల ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని బుధవారం తన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో ఒక వ్యాసాన్ని రాయడంతోపాటు దానిని ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేశారు. వచ్చే నెల 11తో ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని ఆయన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పారిశ్రామికవేత్త రతన్ టాటా, క్రీడాకారిణి పీవీ సింధూ తదితరులకు ట్విట్టర్ వేదికగా పేరు పేరునా విజ్ఞప్తి చేశారు. ఓ వ్యక్తి వేసే ఓటు, దేశ అభివృద్ధి పథానికి తన వంతు సహకారాన్ని అందిస్తామన్న అంగీకారాన్ని తెలుపుతుంది.

ఓటు వేయడం ద్వారా ప్రజలు ఈ దేశ ఆశలు, ఆకాంక్షలలో భాగస్వాములవుతారు అని ప్రధాని ట్వీట్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, స్టాలిన్ తదితరులను కోరుతున్నా. ప్రజలు అత్యధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి మంచిది అని మోదీ పేర్కొన్నారు. ఓటు వేయడం ఓ వేడుకగా ఉండాలి తప్ప వేదనగా మారకూడదని వ్యాఖ్యానించారు. రాష్ర్టాల్లో పోలింగ్ బూత్‌లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్, కుమారస్వామి, చంద్రబాబు, నితీశ్‌కుమార్ తదితరులను కోరుతున్నా అని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. రాజకీయ నాయకులనే కాకుండా సినీ క్రీడా ప్రముఖులకు కూడా మోదీ విజ్ఞప్తి చేశారు. మరో ట్వీట్‌లో, ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సినీ నటులు మోహన్‌లాల్, అక్కినేని నాగార్జున తదితరులకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రదర్శనతో ఎన్నో ఎండ్లుగా కోట్ల మంది అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు.

మీలాంటి వారు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ఓటింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉంది అని ప్రధాని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు రాలేనివారిలో.. ఓటు వేయలేకపోయామన్న వేదన కలగాలని అన్నారు. దేశంలో మీకు అంగీకారం కాని పరిణామం ఏదో చోటుచేసుకుంటుంది. అప్పుడు మీరు.. నేను ఆ రోజున ఓటు వేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది, దేశం సతమతమవుతున్నది అని బాధపడటం అవసరమా? అని మోదీ ప్రశ్నించారు. 21వ శతాబ్దంలో (2000 తరువాత) జన్మించిన వారు మొదటిసారిగా తమ ఓటు హక్కును ఈసారి ఎన్నికల్లో వినియోగించుకోనున్నారని అందువల్ల ఈ లోక్‌సభ ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. అర్హులైన యువతీ యువకులందరూ తమ పేర్లను నమోదు చేసుకొని, ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని కోరారు.

ప్రజాస్వామ్యంలో మీడియాది కీలక పాత్ర

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, ప్రజల ఆలోచనలపై పెను ప్ర భావం చూపగలదని మోదీ అన్నారు. మీ డియా ప్రముఖులు వినీత్ జైన్, సంజయ్ గుప్తా, అరూణ్ పురీ, పీటీఐ, ఏఎన్‌ఐ వార్తా సంస్థలను తన ట్వీట్‌కు ట్యాగ్ చేసి న ప్రధాని, వారితో ఓటర్ల నమోదుకు, ఓటు హక్కుపై అవగాహనకు విస్తృత ప్రచారం కల్పించాలి. ఓటర్లకు అవగాహన కల్పించడంలో మీ మద్దతు 130 కోట్ల మంది భారతీయులకు ఎంతో అమూల్యమైనది అని అన్నారు. ఓట్ల శాతం పెరుగడమంటే బలమైన ప్రజాస్వామ్యం. బలమైన ప్రజాస్వామ్యం అంటే అభివృద్ధి చెం దిన భారత్. గత కొన్ని ఎన్నికల్లో వివిధ రాష్ర్టాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ఒరవడిని కొనసాగించాలి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని తోటి భారతీయులను కోరుతున్నాను అని ప్రధాని బ్లాగ్‌లో పేర్కొన్నారు. భారత ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి పోలింగ్ శాతం నమోదు కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles