కేంద్రమంత్రి అక్బర్‌పై వేటు?


Fri,October 12, 2018 01:38 AM

MJ Akbar accused of sexual harassment by women journalists, Opposition demand resignation

-ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్న మోదీ సర్కార్
-లైంగిక వేధింపుల వివాదంతో ఇరకాటంలో ప్రభుత్వం
-మరికొందరు ప్రముఖులపైనా తాజాగా ఆరోపణలు
మీటూ ప్రకంపనలు

న్యూఢిల్లీ/ ముంబై: ఆరుగురు మహిళా జర్నలిస్టులను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ వ్యవహారంతో ఇరకాటంలో పడిన మోదీ సర్కార్.. నష్టనివారణ చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు అక్బర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి పదవికి ఆయనే స్వయంగా రాజీనామా చేసేలా అక్బర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్ స్వదేశానికి రాగానే మంత్రి పదవి ఊడటం ఖాయమని అంటున్నాయి. మరో ఆరునెలల్లో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సిన సమయంలో.. ఇప్పటికే రాఫెల్ ఉదంతంతో ఇరకాటంలో పడిన ప్రభుత్వం.. మరో వివాదంలో కూరుకుపోవడానికి సిద్ధంగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రమంత్రిపై వచ్చిన ఆరోపణల మీద ఎవరూ అనవసరంగా మాట్లాడవద్దని నేతలకు బీజేపీ ఆదేశించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. సుష్మాస్వరాజ్ ఈ ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించగా, తాజాగా మరో కేంద్రమంత్రి స్మృతిఇరానీ.. ఈ అంశంపై మాట్లాడాల్సింది అక్బరే..అంటూ సమాధానం దాటవేసేందుకు ప్రయత్నిం చారు. నైతిక పతనం, దుష్ప్రవర్తన వంటివాటిని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టంచేసిన నేపథ్యంలో అక్బర్‌పై చర్యలు తప్పవని బీజేపీ నేత ఒకరు చెప్పారు.

మీటూ ఉద్యమాన్ని ఎగతాళి చేసిన ట్రంప్


లైంగిక వేధింపుల ఘటనలను బాహాటంగా వెల్లడిస్తున్న మీటూ ఉద్యమాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఎగతాళి చేశారు. ఈ ఉద్యమం కారణంగా ఆయన ఆరోపణలకు అతీతుడు అనే మాటే లేకుండాపోయిందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఓ పదం ఉండేది. మీటూ ఉద్యమం పుణ్యమా అని ఇకపై ఆ వ్యక్తీకరణను నేను ఉపయోగించలేను అంటూ పెన్సిల్వేనియాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్.. తన తప్పిదాలకు పశ్చాత్తాప పడ్డారు. చాలాసార్లు మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించానని ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో అంగీకరించిన ఆర్నాల్డ్.. ఆ మహిళలకు క్షమాపణలు చెప్పారు.

సుభాష్ ఘయ్‌పై ఆరోపణలు


ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ ఆరోపించారు. మహిమా కుక్రేజా అనే రచయిత్రి ఈ ఉదంతాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కొన్నేండ్ల క్రితం సుభాష్ ఘయ్‌తో సినిమాల్లో పనిచేసినప్పుడు.. ఓరోజు నాకు మత్తు కలిపిన పానీయం ఇచ్చారు. మత్తులో ఉన్న నన్ను హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆ మహిళ ఆరోపించారు. ఈ ఆరోపణపై ఘయ్ (73) స్పందిస్తూ ఎవరి మీదైనా బురద చల్లటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇది బాధాకరం అని అన్నారు.
Activists

తాజాగా మరికొందరిపై..


బాలీవుడ్‌లో లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. సీనియర్ నటుడు అలోక్‌నాథ్ తాగుబోతుతనం, వేధించేతత్వం గురించి చిత్రపరిశ్రమలో అందరికీ తెలుసని సోనూకే టీటూకీ స్వీటీ ఫేమ్ దీపికాఅమీన్, టీవీనటి హిమానీ శివపురి పేర్కొన్నారు. ఇక వికాస్ బెహాల్ లైంగిక వేధింపుల గురించి ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నా యని నటుడు అర్జున్‌కపూర్ వ్యాఖ్యానించారు. గాయకుడు కైలాశ్ ఖేర్, మ్యూజిక్ డైరెక్టర్ అనూమాలిక్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన గాయని సోనా మహాపాత్ర గురువారం మరిన్ని ఆరోపణలు చేశారు. తనను ఉద్దేశించి తన భర్త రామ్‌సంపత్‌తో అనూమాలిక్ భలే సరుకు(మాల్)ను పట్టావ్ అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారని సోనా తెలిపారు. రెండేండ్లపాటు అర్ధరాత్రి వేళల్లో ఫోన్‌చేసి తనను వేధించేవాడని ఆమె ఆరోపించారు. హిందీ సినీ డైరెక్టర్ పీయూష్ మిశ్రా.. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని కేతకీ జోషి అనే జర్నలిస్టు ఫేస్‌బుక్‌లో వెల్లడించగా, స్పందించిన దర్శకుడు.. ఆమెకు క్షమాపణలు చెప్పారు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణల పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది.

705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles