తెలంగాణ వాదనలపై స్పందించిన జైట్లీ


Mon,June 19, 2017 02:16 AM

Minister KTR with the media after the GST meeting

జీఎస్టీ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, గ్రానైట్ పరిశ్రమ, బీడీ పరిశ్రమ, చేనేత పరిశ్రమల మీద జీఎస్టీ భారాన్ని పునరాలోచించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారని రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ తరఫున హాజరైన ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. విస్తృత ప్రజాప్రయోజనాలకోసం చేపట్టిన మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల మీద, అలాగే లక్షల మంది కార్మికుల ఉపాధితో ముడిపడి ఉన్న పరిశ్రమల మీద అధిక భారం వేయడం సరికాదన్న తమ వాదనను ఆలకించిన జైట్లీ ఆ అంశాలమీద సమగ్ర నివేదికను సమర్పిస్తే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.
arun-jaitley
కేంద్ర మంత్రి సూచన మేరకు నాలుగైదు రోజుల్లో నివేదిక అందచేస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, కాకతీయ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించి రూ.24వేల కోట్ల ఆర్థికసాయానికి సిఫారసు చేసిందని, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతి రాష్ట్రంలో మిషన్ భగీరథ అమలు చేస్తే బాగుంటుందని ప్రశంసించిందని, ఇలాంటి పథకాలకు కేంద్రం నుంచి ప్రోత్సాహం ఇవ్వాలే తప్ప జీఎస్టీ పన్ను భారం వేసి నిరుత్సాహపర్చడం భావ్యం కాదని కౌన్సిల్‌కు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వివరించానని చెప్పారు. మిషన్ కాకతీయతోపాటు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి బడ్జెట్‌లో ప్రతి ఏటా రూ.25 వేల కోట్లను కేటాయించి మొత్తం రూ.1.80 లక్షల కోట్లతో పూర్తిచేయాలని భావించిందని, జీఎస్టీ ద్వారా 18% పన్ను వేయడం వలన ఈ ప్రాజెక్టులు ఆశించిన తీరులో ముందుకు వెళ్ళడం ఆర్థికకోణం నుంచి ఇబ్బందికరమని వివరించామన్నారు. రాష్ర్టాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దానికనుగుణంగా జీఎస్టీలో పన్ను అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయే తప్ప, రాష్ర్టాలపై అధికభారం మోపితే ఆశించిన ఫలితాలు రావని జైట్లీకి వివరించినట్లు తెలిపారు.

ఆరు అంశాల ప్రస్తావన..


అంతకుముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణకు సంబంధించిన ఆరు ప్రధాన అంశాలను లేవనెత్తారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, గ్రానైట్ పరిశ్రమ, బీడీ పరిశ్రమ, చేనేత పరిశ్రమలు తదితర అంశాలు ప్రత్యక్షంగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. వీటిలో కొన్నింటిని పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించాలని, మరికొన్నింటిపై పన్నును తగ్గించాలని కోరారు.

చేనేతకు పన్ను మినహాయించండి..


మరమగ్గాలపై ఉత్పత్తి అయ్యే నేత వస్ర్తాలపై పన్నులను 5శాతానికి పరిమితం చేయాలని, చేనేత వస్ర్తాలపై పన్నును ఎత్తివేయాలని కేటీఆర్ కోరారు. గ్రానైట్ పరిశ్రమ మీద ఏకంగా 28శాతం పన్ను విధిస్తే అది తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. ఈ పన్నును 12శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వీరి ఆర్థిక దీనస్థితిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు నెలకు వెయ్యి భృతి చెల్లిస్తూ ఆదుకుంటున్నదని కేటీఆర్ చెప్పారు. ఈ పరిశ్రమపై 28% పన్ను విధిస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారని వివరించారు. బీడీ ఆకులను, బీడీలను జీఎస్టీ పరిధి నుంచి పూర్తిస్థాయిలో మినహాయించాలని కోరారు. హైదరాబాద్‌లో గుర్రపు పందాలు, బెట్టింగ్‌లపై 28% పన్నును 18%కి తగ్గించాలని కోరారు.
కేటీఆర్ వివరణలతో సంతృప్తిచెందిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఈ అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించినట్లయితే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృతంగా చర్చించి తదనుగుణమైన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఇవి కేవలం తెలంగాణకే కాకుండా అన్ని రాష్ర్టాలకూ వర్తించేవి కాబట్టి తప్పకుండా ప్రతి రాష్ర్టాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుందామని తెలిపారు.

తెలంగాణ మీద రూ.11,000 కోట్ల భారం


జీఎస్టీలో విధించిన పన్నుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం మీద ప్రతి ఏటా దాదాపు రూ. 11,000 కోట్ల మేరకు భారం పడుతుందని కేటీఆర్ వివరించారు. ఆరు అంశాల్లో తెలంగాణకు ఎదురయ్యే ఇబ్బందులను సవివరంగా సమావేశంలో వివరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో రూ.40వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు మీద జీఎస్టీ కారణంగా రూ. 1800 కోట్ల ఆర్థిక భారం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2012లో ఒక నోటిఫికేషన్ ఇస్తూ కాలువలు, పైప్‌లైన్, తాగునీటి ప్రాజెక్టులను సర్వీసు పన్ను నుంచి మినహాయించి, కేవలం 5% వ్యాట్ మాత్రమే ఉంచిందని, అయినా ప్రస్తుతం జీఎస్టీ కింద 18% పన్ను కట్టాల్సి వస్తున్నదని వివరించారు. ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని 5% పన్ను శ్లాబ్‌లోకి తీసుకురావాలని కోరారు. ఇక రైతుల ప్రయోజనం కోసం మిషన్ కాకతీయ పథకంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను రూ.1.80 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, దీనిమీద జీఎస్టీ వల్ల భారీస్థాయిలో రూ. 8000 కోట్ల భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ప్రభుత్వమే చేపడుతున్న ఇలాంటి పథకాల మీద 18శాతం పన్ను సమంజసం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే వినూత్నంగా పేదలకు డబుల్ బెడ్‌రూం పథకం చేపట్టి రూ.18 వేల కోట్లతో 2.86 లక్షల ఇండ్లను నిర్మిస్తున్నామని, జీఎస్టీ విధానంలో 18% పన్ను కారణంగా రూ. 900 కోట్ల భారం పడుతున్నదని చెప్పారు.

597

More News

VIRAL NEWS