
-తగిన ఆర్థిక వెసులుబాటు లేదు-లబ్ధిదారుల సమాచారం అందుబాటులో లేదు-ఈ పథకం ఎలా అమలు చేస్తారో రాహుల్ సమాధానం చెప్పాలి-రైతాంగ సమస్యల పరిష్కారానికి రుణమాఫీ పరిష్కారం కాదు-నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాగ్దానం చేసిన కనీస ఆదాయ హామీ పథకం ఆచరణలో సాధ్యంకాదని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఈ పథకం అమలుచేసేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేదని, అదే సమయంలో పథకం అమలు చేసేందుకు అవసరమైన లబ్ధిదారుల పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదని చెప్పారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన గరీబీ హఠావోను ఈ పథకం పోలి ఉన్నదని పేర్కొన్నారు. కనీస ఆదాయ హామీ పథకాన్ని ఎలా అమలు చేస్తారనే విషయాన్ని దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరించాలని కోరారు. ప్రజలకు సార్వజనీన ప్రాథమిక ఆదాయాన్ని(యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం) కల్పించాలంటూ మాజీ ఆర్థిక ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ తరుచూ చేసే సూచనను సైతం రాజీవ్‌కుమార్ వ్యతిరేకించారు. పనిచేసే వ్యక్తులకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించాలనేది తన అభిమతమన్నారు. అన్నదాతల సమస్యలకు రుణమాఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదని చెప్పారు.
ఆచరణ సాధ్యం కాదు
రాజీవ్‌కుమార్ ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. కనీస ఆదాయ హామీ పథకం ఆచరణ సాధ్యమవుతుందని నేను భావించడం లేదు. ఇది కేవలం అలంకార పద ప్రయోగంలా ఉంది. ఎందుకంటే పథకం అమలు చేసేందుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారం మన వద్ద అందుబాటులో లేవు. కాంగ్రెస్ కేవలం పథకాన్ని మాత్రమే ప్రకటించి, మిగతా అన్ని విషయాల్ని అసంపూర్తిగా వదిలివేసింది అని అన్నారు. సార్వజనీన ప్రాథమిక ఆదాయం పథకం ప్రవేశపెట్టాలంటూ మాజీ ఆర్థిక ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలను రాజీవ్‌కుమార్ తిరస్కరించారు. ఈ ఆలోచనకు నేను పూర్తిగా వ్యతిరేకం. భారతదేశ తలసరి ఆదాయం, జనాభా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుంటందని నా ఆలోచన. తద్వారా వారికి సామాజిక భద్రత చేకూరుతుంది. చైనా లాంటి చాలా దేశాలు కూడా నిరుద్యోగ భృతి కంటే యువతను సాధికారత వైపు పయనించేలా ప్రోత్సహిస్తున్నాయి అని పేర్కొన్నారు.
ఏడాదికి రూ.6,000 చిన్న మొత్తం కాదు
ఇటీవల కేంద్రం రైతులకు ప్రకటించిన ఏడాదికి రూ.6వేల ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని రాజీవ్‌కుమార్ సమర్థించారు. అయితే, ఈ మొత్తం చాలా తక్కువగా ఉందంటూ కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. చూడడానికి ఈ మొత్తం చాలా తక్కువగానే కనిపించవచ్చు. గ్రామీణ భారతంలో ఓ నిరుపేద లేదంటే ఉపాంత రైతు నెలకు సరాసరిన రూ.3వేల నుంచి రూ.4వేల వరకు సంపాదిస్తాడు. ఈ మొత్తానికి రూ.500 జతకావడం చిన్న విషయమేమీ కాదు. ఈ చిన్న మొత్తంతో ఒక రైతు తన పిల్లలను పాఠశాలకు పంపొచ్చు. రేషన్ సరుకులు కొనుగోలు చేయవచ్చు. పెద్ద రైతుల నుంచి పంటకు నీళ్లను బాడుగ తీసుకోవచ్చు. రూ.500 చిన్న మొత్తం కానేకాదు. నిరుపేదకు ఇది చాలా పెద్ద మొత్తం అని అన్నారు. రైతుకు ఏడాదికి రూ.6వేల చొప్పున 10 ఏండ్లకు ఈ మొత్తం రూ.60వేలకు చేరుతుంది. ఇది రైతుకు దీర్ఘకాలికంగా ఊరటనిస్తూ కొనసాగే నిరంతర ప్రక్రియ. ఇదే సమయంలో కేంద్రం ఏటా రూ.75వేల కోట్ల చొప్పున 10 ఏండ్లకు రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయనున్నది. ఇది ఆర్థికంగా చాలా భారంతో కూడుకున్న పని. అయినా కేంద్రం రైతుల శ్రేయస్సు కోసం ఈ భారం భరించేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పారు. ఈ పథకం పట్టణ పేదలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలపై రాజీవ్‌కుమార్ స్పందిస్తూ.. దేశంలో 13.7 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి ఎంతోకొంత మొత్తంలో భూమి ఉంది. వీరందరూ ఈ పథకం పరిధిలోకే వస్తారు. గ్రామీణ భారతంలోని ప్రతి కుటుంబం ఇంచుమించుగా ఈ పథకంలో లబ్ధిదారుగా ఉంది. అయితే, భూమిలేని రైతు కూలీలు 2.6 శాతం మంది ఉన్నారు. వీరందరికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తాం అని చెప్పారు. రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల దేశంలో 12 కోట్ల మంది అన్నదాతల కుటుంబాలు లబ్ధిపొందుతాయని, తద్వారా సుమారు 60 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని రాజీవ్‌కుమార్ గణాంకాలతో సహా వివరించారు. రైతు రుణమాఫీ కంటే ఇది చాలా పెద్ద పథకమని అభివర్ణించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో అమలు చేస్తున్న రుణమాఫీ పథకాలపై ఆయన స్పందిస్తూ.. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఇది సమాధానం కాదన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న అపరిష్కృత సమస్యల్ని నివారించాలంటే ఆ రంగాన్ని ఆధునికీకరించాలి. వ్యవసాయ రంగంలో ఖర్చుల్ని ముందుగా తగ్గించాలి. ఇటీవల పురుగు మందులు, ఇతర రసాయనాల వినియోగం బాగా పెరిగింది. దీంతో ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగి రైతు అప్పుల పాలవుతున్నాడు. ఈ పరిస్థితిలో అన్నదాతను బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ వైపునకు ప్రోత్సహిస్తే ఖర్చు తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. రైతు నేరుగా మార్కెట్‌తో అనుసంధానమైతే పంటలకు గిట్టుబాటు ధరలు లభించి అప్పుల ఊబి నుంచి బయటపడతాడు అని ఆయన వివరించారు.