-కేంద్ర మంత్రి నిర్మల వెల్లడి
-టర్కీ నుంచి మరో నాలుగువేల టన్నుల దిగుమతికి ఆదేశం
న్యూఢిల్లీ: ఉల్లి ధరల నియంత్రణకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బుధవారం లోక్సభలో తొలి విడుత అనుబంధ డిమాండ్లు- పద్దులపై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. ఉల్లి నిల్వలకు సంబంధించి పలు సంస్థాగత సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఎగుమతులపై నిషేధం, నిల్వలపై పరిమితులు, దిగుమతి చేసుకున్న ఉల్లిని కొరత ఉన్న ప్రాంతాలకు రవాణా చేయడం వంటి చర్యలను చేపట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొరత కారణంగా దేశంలోని కొన్ని చోట్ల కిలో ఉల్లిగడ్డ రూ.100 దాటిపోయింది. మరోవైపు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరింత ఉల్లి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ.. టర్కీ నుంచి మరో నాలుగు వేల టన్నుల ఉల్లి దిగుమతికి ఆదేశాలు జారీచేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే టర్కీ నుంచి 11 వేల టన్నులు, ఈజిప్ట్ నుంచి 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే రోజువారీగా పెరుగుతున్న ధరలను అరికట్టేందుకు ఆఫ్ఘనిస్థాన్ నుంచి అట్టారీ- వాఘా సరిహద్దు మీదుగా పంజాబ్, ఢిల్లీల వ్యాపారులు ప్రతిరోజూ ఉల్లిగడ్డలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి రోజూ 10 నుంచి 15 ట్రక్కుల్లో ఉల్లిగడ్డ దిగుమతి అవుతున్నది. ఒక్కో ట్రక్కులో 35 మెట్రిక్ టన్నుల ఉల్లి గడ్డ ఉంటుంది.