మమతకు మాయావతి బాసట


Fri,May 17, 2019 01:38 AM

Mayawati rallies behind Mamata Banerjee says Modi Shah targeting her is dangerous

- బెంగాల్‌పై మోదీ, షా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య
- ప్రధాని ఆదేశాల మేరకు ఈసీ పనిచేస్తున్నదని ఆరోపణ


లక్నో, మే 16: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి బాసటగా నిలిచారు. బెంగాల్ విషయంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌కు సంబంధించి మనం ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటున్నాం. ఎన్నికల నేపథ్యంలో హింస చోటుచేసుకుంటున్నది. ఈ పరిణామాలను పరిశీలిస్తే పథకం ప్రకారమే మోదీ, అమిత్ షా కుట్రకు పాల్పడుతున్నారని తెలుస్తున్నది. బెంగాల్ ప్రభుత్వం పట్ల వీరిద్దరూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ జరిగే పరిణామాలన్నింటికీ బీజేపీ, ఆరెస్సెస్సే బాధ్యత వహించాలి అని స్పష్టంచేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ సర్కార్ అమలు చేయలేదని, అందుకే ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో వారి దృష్టిని మరల్చడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం, ఆ ప్రభుత్వం పట్ల కుట్రపూరితంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని గడువుకన్నా ఒకరోజు ముందే ముగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉన్నదని ఆరోపించారు. ఈసీ ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని మాయావతి పేర్కొన్నారు. గురువారం ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో రెండు ఎన్నికల సభల్లో పాల్గొన్న తర్వాత ప్రచారానికి తెరపడేలా ఈసీ వ్యవహరించింది. దీన్నిబట్టి ప్రధాని ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పక్షపాతం వహించకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఈసీ మాట మీద నిలబడటం లేదు అని మాయావతి ఆరోపించారు.

206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles