ఫెడరల్ ఫ్రంట్ నేతలతో టచ్‌లో!


Sat,April 20, 2019 02:20 AM

Mamata Banerjee Fielding Own Force In West Bengal

-కేంద్రంలో వచ్చేది ఎన్డీయే, యూపీయే ఏతర ప్రభుత్వమే
-బీజేపీకి వంద సీట్లు మించవు
-పశ్చిమ బెంగాల్ సీఎం మమత
బెలూర్‌ఘాట్/గంగారామ్‌పూర్, ఏప్రిల్ 19: కేంద్రంలో ఈసారి ఎన్డీయే, యూపీయే ఏతర ప్రభుత్వమే ఏర్పాటవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పైనా ఆమె స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ నేతలతో తాను టచ్‌లో ఉన్నానని, వారందరితోనూ తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది తామందరం కలిసే నిర్ణయిస్తామని తెలిపారు. తాజాగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీదీ ఈమేరకు వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఒక బ్లాకు (వీధి) ప్రెసిడెంట్ అయ్యే యోగ్యత కూడా లేదని పేర్కొన్నారు. ఆయనకు ఎలాంటి అధికారాలూ లేవని, మోదీ నియమించారు కాబట్టి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు అని చెప్పారు. అమిత్‌షా నాయకుడని మీరు భావించొచ్చు.

నేను గానీ, ప్రజలు గానీ అలా భావించడం లేదు అని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి దక్కేది రసగుల్లానేనని (సున్నానేనని) మమతాబెనర్జీ అన్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న ప్రధాని మోదీ లక్ష్యం పగటి కలేనన్నారు. బెంగాల్ ప్రజలకు రెండు చేతుల్లోనూ లడ్డూలు ఇస్తామన్న మోదీ హామీ ఎన్నటికీ నెరవేరదని చెప్పారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తే.. ప్రజల రెండు చేతుల్లోనూ లడ్డూలు ఉంటాయని చెప్పారు. ఓవైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు దీదీ పై విధంగా బదులిచ్చారు. ఉత్తర బెంగాల్‌లోని దక్సిన్, దినాజ్‌పూర్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఈసారి దేశవ్యాప్తంగా వంద సీట్లకు మించి రావని నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీకి 73 సీట్లున్నాయని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 13 సీట్లు కూడా గెలువడం అనుమానమేనన్నారు. ఒడిశా, ఈశాన్య రాష్ర్టాల్లోనూ కాషాయపార్టీ ఒక్క సీటు కూడా దక్కదని జోస్యం చెప్పారు.

1226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles