చేతులెత్తేసిన ఫడ్నవీస్‌

Mon,November 11, 2019 03:14 AM

- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న మహారాష్ట్ర బీజేపీ
- ప్రజాతీర్పును శివసేన అగౌరవ పర్చుతున్నదని వ్యాఖ్య
- సర్కార్‌ ఏర్పాటుకు శివసేనను ఆహ్వానించిన గవర్నర్‌
- 24గంటల్లోగా నిర్ణయాన్ని చెప్పాలని సూచన
- బీజేపీతో తెగదెంపులు చేసుకుంటేనే మద్దతుపై ఆలోచన: ఎన్సీపీ
- ప్రతిపక్షంలో కూర్చుంటాం: కాంగ్రెస్‌

ముంబై, నవంబర్‌ 10: మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగింది. కనీస మెజారిటీ లేకపోవడంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఆపద్ధర్మ సీఎం ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిసి తమ నిర్ణయాన్ని ఆయనకు వివరించింది. దీంతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించారు. తమ నిర్ణయాన్ని సోమవారం రాత్రి 7.30లోగా తెలుపాలని సూచించారు. మరోవైపు బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీయే నుంచి బయటికి వస్తేనే శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. అయితే ఎన్సీపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పేర్కొంది. మొత్తానికి ‘మహానాటకం’ ఆదివారం ఒక్కసారిగా వేడెక్కింది.

ఉదయం నుంచి హైడ్రామా

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్‌ ఆహ్వానంపై ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ సమావేశమైంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే, మళ్లీ సాయంత్రం 4 గంటలకు మరోదఫా సమావేశమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న నిర్ణయానికి కోర్‌ కమిటీ వచ్చింది. వెంటనే ఫడ్నవీస్‌, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, సీనియర్‌ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని ఆయనతో చెప్పారు. అనంతరం చంద్రకాంత్‌ పాటిల్‌ రాజ్‌భవన్‌ బయట విలేకరులతో మాట్లాడుతూ ‘మా మిత్రపక్షమైన శివసేనతో తలెత్తిన వివాదం (సీఎం సీటును చెరి రెండున్నరేండ్లు పంచుకోవాలన్నది) నేపథ్యంలో ప్రస్తుతం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేము. బీజేపీ-శివసేన కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన అగౌరవ పర్చుతున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న విషయాన్ని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ దృష్టికి తీసుకెళ్లాం’ అని పేర్కొన్నారు.

ఆరునూరైనా శివసైనికుడే సీఎం: రౌత్‌

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో శివసేన సీనియర్‌ నేత సంజత్‌రౌత్‌ స్పందించారు. ఆరునూరైనా శివసైనికుడే సీఎం అవుతారని చెప్పారు. ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ‘ఒప్పందాలు చేసుకోవడానికి మేము వ్యాపారులము కాదు. శివసేనకు రాజకీయాలంటే వ్యాపారం కాదు. లాభ, నష్టాలు అనే పదాలు మా డిక్షనరీలో లేవు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆహ్వానిస్తామని సంజత్‌రౌత్‌ తెలిపారు. ‘జర్మనీ నియంత హిట్లర్‌లా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఢిల్లీకి మహారాష్ట్ర బానిసగా ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా ముంబైలోని రీట్రీట్‌ హోటల్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను శివసేన యువనేత అదిత్య ఠాక్రే శనివారం అర్ధరాత్రి కలిశారు. వీరి మధ్య సమావేశం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగినట్లు సమాచారం. ఆదివారం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఠాక్రే కూడా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

ప్రతిపక్షంలోనే కూర్చుంటాం: కాంగ్రెస్‌

తాము చీటికి మాటికి మాట మార్చమని, ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పునిచ్చారని, ఈ తీర్పును తాము గౌరవిస్తూ ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఆదివారం ఆయన రాజస్థాన్‌లోని జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌కు వెళ్లి వారితో సమావేశమయ్యారు. మరోవైపు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ కూడా తమ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌నాయకులతో ముంబైలో సమావేశమయ్యారు. అనంతరం ఖర్గే వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి అధికార ప్రకటన వచ్చినప్పుడు స్పందిస్తానని తెలిపారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ శివసేన తొలుత బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని, ఎన్డీయే నుంచి బయటికి రావాలని, అప్పుడు ఆపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై ఆలోచిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105, దాని మిత్రపక్షం శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

రాష్ట్రపతి పాలన?

మహారాష్ట్ర భవిష్యత్‌ను తేల్చడంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ కీలకంగా మారారు. శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించిన ఆయన.. ఒకవేళ ఆ పార్టీ కూడా చేతులు ఎత్తేస్తే ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అహ్వానిస్తారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరూ ముందుకు రాకుంటే రెండో అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ఆహ్వానిస్తారు. ఆహ్వానం మేరకు వచ్చిన పార్టీ లేదా కూటమిని అసెంబ్లీలో బలనిరూపణలో గెలువగలరా? అని గవర్నర్‌ అడుగుతారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటములుగానీ, ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడిన పార్టీలుగానీ ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నామని రాతపూర్వకంగా గవర్నర్‌కు రాసిఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ పార్టీగానీ, కూటమిగానీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు గవర్నర్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి నివేదిక పంపుతారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. సిఫారసును రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది.

1139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles