తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు


Tue,August 9, 2016 02:32 AM

Madras High Court Clarification on Other language Old status

lawyers
చెన్నై/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తమిళానికి తప్ప మరే ఇతర భాషకు ప్రాచీన హోదా ఇవ్వరాదన్న వాదనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పొరుగు భాషలకు హోదా కల్పిస్తే తమిళానికి స్థాయి తగ్గుతుందన్న ఆందోళననూ కొట్టిపారేసింది. తెలుగుతోసహా పలు తమిళేతర భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదాను కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు, వాదనలు కోర్టును సంతృప్తి పరిచాయి. దీంతో తెలుగుకు ప్రాచీనహోదా విషయంలో అడ్డంకి తొలగిపోయినట్టయింది. కేంద్రం హోదా ఇచ్చినా ఈ కేసు వల్ల పూర్తిస్థాయి ప్రయోజనాలు అందకుండాపోయిన విషయం విదితమే. తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా ఇవ్వడం సరికాదంటూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కౌల్, న్యాయమూర్తి ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

-ప్రాచీనహోదా సబబే..ఇతర భాషలకు కూడా
-మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ
-తమిళానికి తప్ప ఇతర భాషలకు హోదా ఇవ్వొద్దన్న పిటిషన్ కొట్టివేత
-తెలంగాణ ప్రభుత్వ వాదనే గెలిచింది
-పంపన సాహిత్యం, శాతవాహనుల శాసనాలతో సాగిన మన వాదన

ప్రాచీన హోదా నిబంధనలకు ఆ భాషలు అర్హత కలిగిఉన్నాయని ఈ విషయమై నియమించిన నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ కమిటీ నిర్ణయాల్లోకి వెళ్లబోమని స్పష్టంచేసింది. ప్రాచీనభాష హోదా కల్పించేందుకు ఉద్దేశించిన నిబంధనలను, ఆ నిబంధనల కింద నాలుగు భాషలకు హోదా కల్పించడాన్ని సవాల్‌చేస్తూ సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ 2009లో ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఆ భాషలు అర్హత నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. ఆ నిర్ధారణల వెనుక గల వాస్తవిక అంశాల గురించి కూడా మా దృష్టికి తెచ్చారు.

నిపుణుల కమిటీ అభిప్రాయాలు, నిర్ధారణల పరిశీలన చేపట్టాలని మేం భావించడం లేదు అని ధర్మాసనం పేర్కొన్నది. ప్రాచీన హోదా కల్పించిన ఇతర భాషలతో సమానంగా చూడటం వల్ల తమిళానికి ప్రాముఖ్యం తగ్గుతుందని పిటిషనర్ చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ఒక భాష ప్రాముఖ్యం ఇతర భాషల ఉత్థానపతనాలపై ఆధారపడి ఉంటుందని మేం భావించడం లేదు అని తెలిపింది. నిజానికి ఒక భాష అభివృద్ధి ఆ భాష ఉపయోగం, కళా, సాహిత్య రూపాల ద్వారా జరిగే సృజనాత్మక కృషిపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. ఇలాంటి వ్యవహారాల్లో వాదోపవాదాలకు కోర్టు వేదికగా మారాలని మేం కోరుకోవడం లేదు అని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికీ పిటిషనర్‌కు సంతృప్తి కలుగకపోతే సం బంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించింది.

తెలంగాణ ప్రభుత్వ వాదనే గెలిచింది


తెలుగుకు ప్రాచీన హోదా కోసం సుదీర్ఘమైన పోరాటమే నడిచింది. అందులో ఉమ్మడి ఏపీ సర్కారు సరైన వాదనలు సమర్పించకపోవడంతో మద్రాస్ హైకోర్టును సంతృప్తిపరచలేకపోయింది. ప్రాచీన హోదాకు వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ఉండాలి. 1500 సంవత్సరాల భాషా చరిత్ర ఉండాలి. అరువు భాష (బారోడ్ లాంగ్వేజ్) కాకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్నయను ఆదికవిగా పరిగణిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. వెయ్యేండ్ల చరిత్ర చూపకపోవడం, ఆంధ్రమహాభారతం అనువాదం కావడం వల్ల తన వాదనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత నోటీసులకు ఉమ్మడి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ఇరు రాష్ట్రాలకు నోటీసులు పంపింది. తెలుగు భాషా చరిత్ర, సాహిత్య చరిత్రలో తమ ప్రాంతాన్ని విస్మరిస్తున్నారని ఉద్యమ కాలంలో వాణి వినిపించిన తెలంగాణ మద్రాస్ హైకోర్టుని వేదికగా చేసుకుని తమ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని చాటుకున్నది.

ఏడాది క్రితం భాష, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బీపీ ఆచార్య, భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా ఉన్న మామిడి హరికృష్ణ తెలంగాణ ప్రాచీన భాష, సాహిత్యానికి సంబంధించిన విశేషాలను చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మకు వివరించారు. ఈ కేసులో మన ప్రభుత్వం తరపున ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌కు సంబంధించిన ఆధారాల కోసం భాష, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మామిడి హరికృష్ణ ఏడాది కాలం భాష, సాహిత్య చరిత్రపై అధ్యయనం చేశారు. తెలుగుకు సంబంధించిన ప్రాచీన చరిత్ర మూలాలు తెలంగాణలో ఉన్నాయని, ప్రాచీన సాహిత్యం, ప్రాచీన కవులు తెలంగాణలో ఉన్నారని పేర్కొంటూ జూలై నెలలో మరో అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది.

మామిడి హరికృష్ణ అందించిన వివరాల ఆధారంగా.. నన్నయ్యకు పూర్వమే తెలంగాణలో జీవించిన కన్నడ ఆదికవి పంపన కాలంలో తెలుగులో సాహిత్యం ఉందని, ఆయన తెలుగు సాహితీ సృజన చేశారని కోర్టులో మన వాదనగా వినిపించారాయన. పంపన తమ్ముడు జినవల్లభుడు రాసిన కంద పద్యాలను ఉదహరించారు. కరీంనగర్ జిల్లా కురిక్యాల గ్రామంలో వేసిన శిలాశాసనంలో అవి దొరికాయి. నన్నయకు వందేండ్ల పూర్వంనాటి ఈ పద్యాలు, నన్నయ్య సాహిత్యం, నన్నయ్య తర్వాత సాహితీ సృజన చేసిన పాల్కురికి సోమనాథుని సాహిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ కారణం చేత తెలుగుకు 1050 సంవత్సరాల చరిత్ర ఉందన్న వాదనతో మద్రాస్ హైకోర్టు సంతృప్తి చెందింది. పైగా పంపన కాలపు సాహిత్యం అనువాదం కాకపోవడం మరో సానుకూల అంశం. తెలుగు భాషకు సుమారు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు వివరించింది. శాతవాహనుల కాలపు నాణేలు, శాసనాలను ఆధారాలుగా కోర్టుకి నివేదించారు. తెలుగులిపి అభివృద్ధికి సంబంధించిన ధూళికట్ట బౌద్ధస్థూపాల్లో లభించిన ఆధారాలను కోర్టుకు తెలియజేశారు. ఈ వివరాలతో మద్రాస్ హైకోర్టు సంతృప్తి చెందడంతో మన హోదా మనకు దక్కింది.

మద్రాస్ కోర్టు తీర్పు హర్షణీయం


తెలుగుకు ప్రాచీన హోదాపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయం. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలని మొట్టమొదట ఉద్యమించింది ఈనాటి తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఉన్న ఆనాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు సభ అని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా అవాంతరాలన్నీ తొలగిపోవడం యావత్ తెలుగుజాతి సంతోషించే విషయం.
- సినారె, ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు


తెలుగు భాషకు ప్రాచీన ప్రతిపత్తి అన్నది కేవ లం గౌరవసూచకమైన హోదా మాత్రమే కాదు. అనేక అంశాలపై విస్తృతమైన పరిశోధనకు, వినూ త్న ప్రచురణలు వెలువరించడానికి దీనివల్ల అవకాశాలు లభిస్తాయి. మద్రాస్ హైకోర్టులో తెలంగాణ బలమైన వాదన వినిపించడం మూలంగా ప్రాచీన హోదా దక్కించుకొన్నాం. ప్రాచీన హోదా కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు.
- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలుగు వర్సిటీ వీసీ

తెలంగాణ బిడ్డలు గర్వించాలి


తెలుగు అస్థిత్వానికి ప్రాచీన హోదా ఒక గుర్తింపు. తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలితంగానే దీనిని దక్కించుకోగలిగాం. తెలంగాణ చరిత్ర, సాహిత్యమే ప్రాచీన హోదాకు ప్రామాణికమయ్యాయి. తెలంగాణ బిడ్డలందరూ ఇందుకు గర్వించాలి. ప్రాచీనహోదా ద్వారా పరిశోధనలకు మరింత వెసులుబాటు కలుగుతుంది.
-మామిడి హరికృష్ణ, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు

తెలంగాణ కృషి వల్లే ఈ విజయం


ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయం. తెలుగు భాషకు అనుకూలంగా మద్రాసు హైకోర్టులో మన వాదనను వినిపించడం, సాక్ష్యాలను చూపించడం, పరిశోధనలు సాగించడంలో తెలంగాణ రాష్ట్రం సాగించిన కృషి ప్రశంసనీయం. తెలంగాణ భాష పరిరక్షణ, అభివృద్ధికి తగిన విధానాలు రూపొందిస్తున్నాం.
- దేశ్‌పతి శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ

2421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS