కరుణ అస్తమయం


Wed,August 8, 2018 12:30 PM

m karunanidhi passes away

-రాష్ట్రపతి, ప్రధాని, ప్రభృతుల సంతాపం
-శోకసంద్రమైన తమిళనాడు
-ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు దివంగత నేత భౌతిక కాయం
-నేటి సాయంత్రం అంత్యక్రియలు
-నివాళులర్పించేందుకు చెన్నై రానున్న ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్
-ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తమిళ సర్కార్
- కీలకమైన ప్రదేశాలలో భద్రత మరింత పటిష్ఠం
- నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

దక్షిణభారత రాజకీయాల్లో ఒక యుగం పరిసమాప్తమయ్యింది. తమిళ సినీరంగంలో ఒక శకం ముగిసిపోయింది. ద్రవిడ ఉద్యమ సూర్యుడు అస్తమించాడు.
ప్రాంతీయ రాజకీయాలతో జాతీయ సమీకరణాలను కండ్లద్దాల మాటునుంచి శాసించిన నాయకుడు..తమిళ రాజకీయాల్లో ఎదురులేని శక్తి.. ఎవరూ ఎదుర్కోలేని వ్యక్తి.. ఆరు దశాబ్దాల పాటు ఓటమన్నదే ఎరుగని నేత..ద్రవిడ మున్నేట్ర కళగం అధినేత.. ఐదుసార్లు తమిళనాడు సీఎంగా సేవలందించిన కలైజ్ఙర్ ఎం కరుణానిధి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కోట్లమంది తమిళుల ఆరాధ్యదైవంగా జేజేలందుకున్న కరుణానిధి ఇక లేరు. ఎనిమిది దశాబ్దాలపాటు తమిళ సినీ, రాజకీయ రంగాలనేలిన కలైమామణి సెలవన్నారు. కొద్దిరోజులుగా మృత్యువుతో ఎడతెగని పోరుసల్పుతూ అలిసిపోయారు! సాహితీవేత్తగానేకాకుండా.. సినీ రచయితగా.. దర్శకుడిగా మహామహులైన నటుల ఆహార్యానికి తగ్గ పదును పదాలందించిన కరుణానిధి.. అనేక ఆటుపోట్లను అవలీలగా అధిగమించిన దిగ్గజం.. ఐదుసార్లు తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించిన రాజకీయ కురువృద్ధుడు.. తన జీవితకాలాన్ని సాఫల్యంచేసుకుని అస్తమించారు. హేతువాదిగా.. గొప్ప ప్రసంగకర్తగానే కాకుండా.. అంతకుమించిన పాలనాదక్షుడిగా ప్రఖ్యాతిపొందిన కరుణానిధి జీవితమంతా పోరాటమే! అన్నాదురై కుడిభుజంగా ప్రారంభించిన రాజకీయ జీవితంలో ఎంజీఆర్, జయలలిత వంటి అసాధారణ నేతలను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నో అనుభవాలు.. అర్ధరాత్రి జైలుకు ఈడ్చుకుపోయిన ఉదంతాలు! వేటికీ బెదరని వ్యక్తిత్వం! తమిళనాడుకే ప్రత్యేకమైన అతివాద రాజకీయ వాతావరణంలో తనదైన రీతిలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆరు దశాబ్దాలు రారాజులా నిలిచిన ఏకైక నేత కరుణానిధి! రెండు మత్తగజాలు ఢీకొన్నట్టుగా తమిళ రాజకీయాల్లో ఒక దశలో ఎంజీఆర్‌తో.. మరో దశలో జయలలితతో కరుణానిధి పోరాటం కొనసాగింది. ఏడాదిన్నర క్రితం జయలలిత, ఇప్పుడు కరుణానిధి మరణించడంతో తమిళనాడులో పూడ్చలేని రాజకీయ శూన్యత నెలకొన్నది. తమిళనాడు శోకతప్తమైంది. దేశం గొప్ప నేతను కోల్పోయింది.

karuna1
చెన్నై, ఆగస్టు 7: డీఎంకే అధినేత, ద్రవిడ రాజకీయ కురువృద్ధుడు ముత్తువేల్ కరుణానిధి కన్నుమూశారు. గత 11 రోజులుగా మృత్యువుతో పోరాడిన 94 ఏండ్ల తమిళ దిగ్గజం చెన్నైలోని కావేరీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని ఉద్ధండుడు కరుణానిధికి ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు. వారిలో కుమారుడు ఎంకే స్టాలిన్ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ కాగా, కుమార్తె కనిమొళి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ద్రవిడ ఉద్యమంలో చెరగని చిహ్నంగా మిగిలిపోయిన కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు కన్నుమూశారని కావేరీ దవాఖాన ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ వైద్యుల బృందం సాధ్యమైనంత మేరకు కృషి చేసినప్పటికీ ఆయనను రక్షించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసింది. కరుణానిధి మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఏడురోజుల సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలపైనున్న జాతీయ జెండాలను సగం వరకు అవనతం చేస్తామని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నామని ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ చెప్పారు.
karuna2
బుధవారం సాయంత్రం కరుణ అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సెలవును ప్రకటించింది. కరుణానిధి గౌరవార్థం బుధవారం సంతాప దినంగా పాటించనున్న కేంద్రం ఢిల్లీతోపాటు అన్నిరాష్ర్టాల రాజధానుల్లోనూ జాతీయ పతాకాన్ని సగంవరకు అవనతం చేయాలని రాష్ర్టాలకు సూచించింది. కరుణానిధి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్ వద్ద ఉంచనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో మాజీ సీఎం అంత్యక్రియలు నిర్వహిస్తామని గిరిజా వైద్యనాథన్ తెలిపారు. బుధవారం ఉదయం 4.00 గంటలకు కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీహాల్‌కు తరలిస్తామని డీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది. కావేరీ దవాఖాన నుంచి కరుణ భౌతిక కాయాన్ని తొలుత గోపాలపురంలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఆ తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో సీఐటీ కాలనీలోని ఆయన కుమార్తె కనిమొళి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన మూడో భార్య, ఇతర కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం రాజాజీ హాలుకు తరలించనున్నారు. ఈ దుఃఖ సమయంలో డీఎంకే కార్యకర్తలు క్రమశిక్షణను పాటించి మౌనంగా ఉండాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. వైద్యులు గత రెండేండ్లుగా తన తండ్రికి చికిత్సనందిస్తున్నారని, ఆయన ప్రాణాలు నిలిపేందుకు వారు తమ శక్తిమేరకు కృషి చేశారని చెప్పారు. దవాఖానకు వద్దకు వచ్చిన కార్యకర్తలందరూ ఆ ప్రదేశాన్ని ఖాళీచేసి వెళ్లిపోవాలని కోరారు. మరోవైపు చెన్నైలోని మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు పళనిస్వామి ప్రభుత్వం నిరాకరించింది.
karuna3
దీంతో డీఎంకే మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, సీఎం కేసీఆర్ కరుణానిధి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అనారోగ్యం బారినపడిన కరుణానిధిని ఆయన కుటుంబసభ్యులు గత నెల 28న కావేరీ దవాఖానలో చేర్పించారు. కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించిందని, కీలకమైన అవయవాలు వైద్యానికి స్పందించడం లేదని కావేరి దవాఖాన సోమవారం సాయంత్రమే వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కావేరీ దవాఖాన మరో బులెటిన్ విడుదల చేస్తూ, కరుణ ఆరోగ్యం మరింత తీవ్రంగా విషమించిందని తెలిపింది. దీంతో దవాఖాన వెలుపల అప్పటివరకూ గంభీరంగా ఉన్న వాతావరణంలో కలకలం మొదలైంది. కొందరు గుండెలు బాదుకుంటూ ఏడ్వడం ప్రారంభించారు. మరికొందరు స్పృహ తప్పిపడిపోయారు. తిరిగి 6.10 గంటలకు ఆయన మృతి చెందినట్టు దవాఖాన వర్గాలు ప్రకటించడంతో కార్యకర్తలు, అభిమానులు రోదనలు మిన్నంటాయి. నగరంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కొద్ది సేపట్లోనే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రాష్ట్రమంతటా మద్యం దుకాణాలను, బార్లను మూసివేశారు.
karuna4

తమిళనాడు అంతా అలర్ట్


తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా అలర్ట్ ప్రకటించింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కీలక ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తన దీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థి జయలలిత మరణించిన 20 నెలల అనంతరం కరుణానిధి మృతి చెందారు.

కరుణానిధి మరణం తీరని లోటు


సీఎం కేసీఆర్ సంతాపం.. నేడు చెన్నైకి పయనం
కరుణానిధి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత రాజకీయరంగానికి ఆయన మరణం తీరని లోటని తెలిపారు. తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా దశాబ్దాల తరబడి సేవలందించారని కొనియాడారు. సామాన్య జనాలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాలపై సుదీర్ఘ సమాలోచనలు చేస్తున్న సీఎం కేసీఆర్ ఇటీవలే చెన్నైకి వెళ్లి కరుణానిధితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.

నేడు చెన్నైకి సీఎం కేసీఆర్


కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ బుధవారం చెన్నైకి వెళ్లనున్నారు. మహానాయకుడిగా వెలుగొందిన కరుణానిధికి తెలంగాణ ప్రజల పక్షాన, వ్యక్తిగతంగా కేసీఆర్ నివాళి అర్పిస్తారు.

డీఎంకే అధినేత కరుణానిధి ప్రజా జీవితపు విశిష్ట వ్యక్తి. ఆయన సేవలు నిరుపమానం.
-రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

విస్త్రృత ప్రజాదరణ గల నాయకుడు


కరుణానిధి గొప్ప వ్యక్తి. విస్త్రృత ప్రజాదరణ గల నాయకుడు. ఆయన ఆలోచన విధానం విభిన్నం. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. తమిళనాడు ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన వ్యక్తి.. తమిళ గొంతును బలంగా వినిపించిన వ్యక్తి. గతంలో ఆయనను పలుసార్లు కలుసుకున్నాను. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం.. నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడటం నిజంగా గొప్ప విషయం. దేశంలో ఎమర్జెన్సీ సందర్భంగా ఆయన పోరాటం మనకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కరుణానిధి ఇకలేరన్న విషయం తెలిసి చాలా బాధపడ్డా. ఈ దేశం గొప్ప రచయితను, ప్రజానాయకుడిని, ధైర్యవంతుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా సానుభూతి
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మన దేశం ఒక గొప్ప బిడ్డను, నాయకుడిని కోల్పోయింది. తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. ఆరు దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
-కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

నా జీవితంలో చీకటి రోజు


కరుణానిధి మరుణం మరువలేనిది. ఈ రోజు నా జీవితంలో చీకటి రోజు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా
-నటుడు రజినీకాంత్

సంతాపం తెలిపిన వారిలో మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్‌సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం ఫడ్నవీస్, సీఎం పినరాయి విజయన్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సినీ ప్రముఖులు ఉన్నారు.

633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles