కాల్పులను నిలిపివేసిన పాక్


Fri,May 25, 2018 08:16 AM

Lull in border firing after nine days

9 రోజుల్లో 11 మంది మృతి
Jammu-firing
జమ్ము, మే 24: గత తొమ్మిది రోజులుగా జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ గురువారం కాల్పులను నిలిపివేసింది. సరిహద్దు వెంట ఈనెల 15న పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. మొత్తం తొమ్మిది రోజుల కాల్పుల్లో 11 మంది మరణించారు. అందులో ఇద్దరు జవాన్లు ఉన్నారు. 60 మందికిపైగా గాయపడగా.. అందులో దాదాపు 48 మంది ప్రజలు ఉన్నారు. వరుసగా కాల్పులకు తెగబడిన పాక్ గురువారం ఒక్కసారిగా కాల్పులను నిలిపివేసింది. పాక్ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడటంతో సరిహద్దు గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళ్తున్నారు. శిబిరాలకు వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాం అని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన జమ్ము, సాంబా, కతువాల్లో పాఠశాలలు తెరుచుకోవడం లేదని పేర్కొన్నాయి.

రంజాన్ తర్వాత కూడా కశ్మీర్‌లో కాల్పుల విరమణ కొనసాగింపు!

రంజాన్ మాసం నేపథ్యంలో అమలుచేస్తున్న కాల్పుల విరమణను ఇక ముందు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాల్పుల విరమణ మంచి ఫలితాలను ఇస్తున్నదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌లో కాల్పుల విరమణను పాటించడం వల్ల ప్రజలనుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ స్పందనను పాక్ ఓర్వలేకపోతున్నది. అందుకే వరుసగా కాల్పులకు పాల్పడుతున్నది అని పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ట్వీట్ చేస్తూ కాల్పుల విరమణను ప్రకటించినప్పటి నుంచి భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే ఘటనలు చాలా వరకు తగ్గాయి. ఈనెల 17 నుంచి 20 వరకు రాళ్లు రువ్వే ఘటనలు కేవలం ఆరు మాత్రమే చోటుచేసుకున్నాయి. అంతేగాక శాంతి భద్రతలు మెరుగుపడుతున్నాయి. కాల్పుల విరమణ సత్ఫలితాలను ఇస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది అని పేర్కొన్నారు.

809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles