స్వేచ్ఛాస్వర్గం సృష్టిద్దాం


Wed,January 24, 2018 03:10 AM

Let Us Create A Heaven Of Freedom Sans Divisions Says PM Modi

-సంపదతోపాటు సంతృప్తి కావాలంటే భారత్‌కు రండి
-వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, స్వీయ వాణిజ్య రక్షణ ధోరణి..
-ప్రపంచం ఎదుట ఉన్న ఈ మూడు సవాళ్లపై అంతా ఏకమవ్వాలి
-దేశాల ఐక్యతకు వసుధైక కుటుంబం భావన నేటి అవసరం
-ప్రపంచ ఆర్థిక వేదిక ప్లీనరీలో ప్రధాని మోదీ
-పెట్టుబడులకు భారత్ ద్వారాలు తెరిచే ఉన్నాయని వ్యాఖ్య

దావోస్, జనవరి 23: ప్రపంచం నేడు మూడు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ సవాళ్లకు వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. స్వీయ వాణిజ్య రక్షణ ధోరణి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం- నేడు ప్రపంచం ఎదుట ఉన్న మూడు అతిపెద్ద సవాళ్లని చెప్పారు. దేశాల మధ్య ఐక్యత సాధించడానికి భారతీయ వేదాంతమైన వసుధైక కుటుంబం భావన నేటి అవసరమన్నారు. దావోస్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ప్లీనరీ సమావేశంలో మోదీ కీలకోపన్యాసం చేశారు. విభజన, చీలికలు లేకుండా పరస్పర సహకారం మాత్రమే పరిఢవిల్లే స్వేచ్ఛా స్వర్గాన్ని సృష్టిద్దాం అని పిలుపునిచ్చారు. సంపదతోపాటు సంతృప్తి, శ్రేయస్సుతోపాటు శాంతి, ఆరోగ్యంతోపాటు సంపూర్ణత కావాలంటే భారత్‌కు రండి అని ఆహ్వానించారు. ప్రపంచ దేశాలు ఒకదానికొకటి అనుసంధానం కావాలని అందరూ చెప్తున్నారని, కానీ ప్రపంచీకరణను నీరుగారుస్తున్నారని అన్నారు. భారత్ మాత్రం వాణిజ్యానికి ద్వారాలు తెరిచే ఉంచిందని చెప్పారు.

సభికుల హర్షధ్వానాల మధ్య నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఆసాంతం హిందీలోనే మాట్లాడారు. 1997లో హెచ్‌డీ దేవెగౌడ తరువాత దావోస్‌కు వచ్చిన మొదటి భారత ప్రధాని తానేనని చెప్పారు. నాటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మారిందని, అలాగే ప్రపంచంలో కూడా అనేక మార్పులు సంభవించాయని అన్నారు. నాడు భారత జీడీపీ 400 బిలియన్ డాలర్లుంటే నేడు అది ఆరు రెట్లకుపైగా పెరిగిందని తెలిపారు. నాడు దేవెగౌడ వచ్చినప్పుడు డబ్ల్యూఈఎఫ్ సదస్సు నినాదం నెట్‌వర్క్ సమాజాన్ని నిర్మించడం అని గుర్తుచేశారు. నేడు ఎన్నో కొత్త పరిణామాల నేపథ్యంలో నాటి నినాదం శతాబ్దాల పురాతనమైనదిగా అనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. గత 20 ఏండ్లలో ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయి. 1997లో ఒసామాబిన్ లాడెన్ పేరు కొందరికే తెలుసు. హ్యారీపోటర్ ఎప్పుడూ వినని పేరు. చదరంగం ఆటగాళ్లకు కంప్యూటర్‌తో ఆడి ఓడిపోతామన్న భయం లేదు. సైబర్ స్పేస్‌లో గూగుల్ లేదు. అమెజాన్ అంటే దట్టమైన అడవులు మాత్రమే. పక్షులు మాత్రమే (ట్వీట్) కూసేవి అని అన్నారు. అయితే నేడు ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ మార్పులు ఎంతో వేగంగా చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. శాంతి, సుస్థిరత, భద్రతలకు సంబంధించి నూతన, తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. విడిపోయిన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తును నిర్మించటం అన్న డబ్ల్యూఈఎఫ్ నినాదాన్ని ప్రస్తావిస్తూ, దేశాల మధ్య ఐక్యతను సాధించేందుకు భారతీయ వేదాంతమైన వసుధైక కుటుంబం అనే భావన నేడు ఎంతో అవసరమని చెప్పారు.
modi

సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో మార్పులు


నేడు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడటంతో సమాజంలోని అన్ని అంశాలు ప్రభావితమవుతున్నాయని మోదీ చెప్పారు. ఈ ప్రపంచాన్ని విడగొట్టేందుకు, కష్టపెట్టేందుకు, ఐక్యం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతున్నదో తెలియజేసే గొప్ప ఉదాహరణ సామాజిక మాధ్యమాలని పేర్కొన్నారు. నేడు గుట్టలకొద్దీ సమాచారం(డాటా)ను సృష్టిస్తున్నారని, దానిని నియంత్రణలోకి తీసుకొనేందుకు తీవ్రమైన పోటీ నెలకొందని అంటూ.. ఆ డాటా ఎవరి స్వాధీనంలో ఉంటే వారే ఈ ప్రపంచాన్ని ఏలుతారన్న భావన నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై మా వైఖరి తెలిసిందే


నేడు ప్రపంచం ముందు ఉగ్రవాదం అతిపెద్ద ముప్పుగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం ఎంతో ప్రమాదకరం. ఇక మంచి ఉగ్రవాది, చెడ్డ ఉగ్రవాది అంటూ నిర్వచించడం కూడా అంతే ప్రమాదకరం అని అన్నారు. సంపన్నులు, విద్యావంతులైన యువత ఉగ్రవాద సంస్థల్లో చేరడం మరింత ప్రమాదకరం అని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరి అందరికీ తెలిసిందేనన్నారు.

వాతావరణ మార్పులపై విభేదాలు విడనాడాలి


వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తమ విభేదాలను విడనాడి ఏకమవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. మానవులు పుడమితల్లి పిల్లలు అని వేల సంవత్సరాల నాటి మా పవిత్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి. కానీ మానవులకు, పర్యావరణానికి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతున్నది? అని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వనరులను అవసరం మేరకే వాడుకోవాలని, స్వార్థంగా వ్యవహరించకూడదని మహాత్మాగాంధీ చెప్పేవారని మోదీ గుర్తుచేశారు.

ప్రపంచీకరణ మెరుపును కోల్పోతున్నది


ప్రపంచ దేశాలు ఒకదానికొకటి అనుసంధానం కావాలని అందరూ చెప్తున్నారని, కానీ ప్రపంచీకరణను నీరుగారుస్తున్నారని మోదీ పేర్కొన్నారు. భారత్ మాత్రం వాణిజ్యానికి ద్వారాలు తెరిచే ఉంచిందని చెప్పారు. ప్రపంచీకరణకు బదులుగా స్వీయరక్షణ ధోరణి పెరుగుతున్నదని అన్నారు. కొన్ని అగ్రరాజ్యాలు ప్రపంచీకరణను వదులుకోవాలని కోరుకోవడం లేదు కానీ స్తంభింపజేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. నూతన టారిఫ్ విధానాలే ఇందుకు ఉదాహరణ అన్నారు. సీమాంతర పెట్టుబడులు మందగించాయని, ప్రపంచ దేశాల మధ్య సరుకుల వినిమయం తగ్గిపోయిందని అన్నారు. నా ఇంటి తలుపులు, కిటికీలను అన్ని వైపుల నుంచి మూసుకోవాలని నేను కోరుకోవడం లేదు. బయటి గాలి స్వేచ్ఛగా లోపలికి రావాలి.. కానీ అది నా ఇంటి పునాదులను పెకిలించకూడదు అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు. సంస్కరణ, ప్రదర్శన, రూపాంతరం అన్న సూత్రాన్ని తమ ప్రభుత్వం పాటిస్తున్నదన్నారు.

571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles