కుల్‌భూషణ్‌తో బలవంతంగా నేరం ఒప్పించారు


Thu,February 21, 2019 01:35 AM

Kulbhushan Jadhav Sentence Based on Extracted Confession Should be Annulled

-పాక్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలి
-వియన్నా సదస్సు తీర్మానాలను పాక్ ఉల్లంఘించింది
-ఆ దేశ న్యాయవాది అనుచిత భాషను ఉపయోగించారు
-కుల్‌భూషణ్ కేసులో ముగిసిన భారత్ వాదనలు

హేగ్, ఫిబ్రవరి 20: కుల్‌భూషణ్ జాదవ్‌తో బలవంతంగా నేరం ఒప్పించి, దాని ఆధారంగా పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)కు భారత్ తెలిపింది. అందువల్ల కుల్‌భూషణ్ మరణశిక్షను రద్దుచేసి, అది అమలు కాకుండా పాకిస్థాన్‌ను ఆపాలని విజ్ఞప్తి చేసింది. కుల్‌భూషణ్ మరణశిక్షను రద్దు చేయాలని లేదా ఆయనను భారత అధికారులు కలువటానికి అనుమతించి, సాధారణ చట్టాల కింద మరోసారి నేర విచారణ జరిపించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రమాణ పత్రాన్ని ఐసీజేకు సమర్పించారు. వియన్నా సదస్సులోని 36వ ఆర్టికల్‌ను పాకిస్థాన్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.

ఈ కేసులో భారత్ తరఫున వాదనలు వినిపించిన మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే మాట్లాడుతూ, మానవ హక్కులను పరిరక్షించేందుకు ఆర్టికల్ 36ను ఒక శక్తిమంతమైన ఆయుధంగా మార్చే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ సందర్భంగా సాల్వే గత వారం పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు పుల్వామా, ఇరాన్‌లో జరిపిన కిరాతక ఉగ్రదాడుల గురించి వివరించారు. ఐరాస నిషేధించిన అల్‌కాయిదా, లష్కరే, జైషే మహమ్మద్ వంటి పలు ఉగ్రవాద సంస్థలకు పాక్ సురక్షిత స్థావరంగా ఉందని తెలిపారు. జాదవ్ కేసు విచారణను నాలుగైదు నెలల్లో పూర్తి చేశారని, ముంబై ఉగ్రదాడుల కేసు పదేండ్లు దాటుతున్నా అతీగతీ లేదని గుర్తు చేశారు. తామైతే ముంబై ఉగ్రదాడికి పాల్పడిన కసబ్ కేసును పలుమార్లు సమీక్షించి తీర్పును అమలు చేశామని తెలిపారు. ఐసీజేలో పాకిస్థాన్ న్యాయవాది ఉపయోగించిన అనుచిత భాష పట్ల సాల్వే అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇలాంటివి పునరావృతం కాకుండా ఐసీజే ఒక నియంత్రణ రేఖను గీయాలని సూచించారు. ఈ కేసులో పాక్ తరఫున వాదనలు వినిపించిన ఖవార్ ఖురేషీ సిగ్గుచేటు, నాన్‌సెన్స్, అవమానకరం, అహంకారం వంటి అనుచిత పదాలను ఉపయోగించారని, ఇటువంటి భాషా ప్రయోగం గర్హనీయమని సాల్వే పేర్కొన్నారు. అటువంటి భాషను ఉపయోగించే కుసంస్కారం భారత్‌కు లేదన్నారు. కుల్‌భూషణ్ కేసులో రెండోరౌండ్ వాదనలను సాల్వే బుధవారం వినిపించారు. ఆయనకు 90 నిమిషాల సమయం కేటాయించిన ఐసీజే వాదనలు ముగించాలని సూచించింది. ఈ మేరకు సాల్వే తన వాదనలను పూర్తి చేశారు. కాగా, ఈ కేసును విచారణ జరుపుతున్న ధర్మాసనంలో సభ్యునిగా ఉన్న పాక్ తాత్కాలిక జడ్జి తస్సాదుక్ హుస్సేన్ జిల్లానీ అస్వస్థతకు గురైనట్టు తెలిపే ఎటువంటి సాక్ష్యాధారం తమకు అందలేదని ఐసీజే తెలిపింది.

529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles