అనుమతిలేని బోటు.. అనుభవంలేని డ్రైవర్Tue,November 14, 2017 01:14 AM

కృష్ణా జలవిషాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య
పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ,గవర్నర్ నరసింహన్, రాష్ట్రమంత్రి కేటీఆర్ సంతాపం
మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

boat
హైదరాబాద్/అమరావతి, నమస్తే తెలంగాణ: కృష్ణానదిలో జరిగిన జలవిషాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. విజయవాడ సమీపంలోని ఫెర్రివద్ద ఆదివారం జరిగిన పడవ దుర్ఘటన స్థలంలో 20 మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు. ఒక మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 21 మంది మృతుల్లో 18 మంది ఒంగోలుకు చెందినవారే. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రి ఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రివర్ బోటింగ్ సంస్థపై కేసు నమోదు చేసినట్టు సీఎం వివరించారు. సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై కేసు నమోదు అయినట్టు తెలిపారు. బోటుకు అనుమతిలేదని, డ్రైవర్‌కు అనుభవం లేదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బోటు సిబ్బంది రామారావు, భైరవస్వామి నదిలో ఈదుకుంటూ బయటకు వచ్చి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారికోసం నదిలో కూడా గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. పవిత్ర సంగమం వద్ద సంభవించిన పడవ ప్రమాద ఘటనాస్థలిని సీఎం చంద్రబాబు సోమవారం పరిశీలించి, సహాయచర్యలపై ఆరా తీశారు. ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పడవ ప్రమాదంపై ట్విట్టర్‌లో దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు.
police

మృతుల్లో సీపీఐ నారాయణ బంధువులు


బోటు ప్రమాద మృతుల్లో కొల్లగుంట ఆంజనేయులు(53), అరవపల్లి గురునాథరావు(63), కూరపాటి నారాయణరాజు(55), తిప్పారెడ్డి కుసుమాంబ(59), దాచర్ల భారతి(45), జెట్టి ప్రభాకర్‌రెడ్డి(62), పెండ్యాల సుజాత(47), వేగిరెడ్డి బిందుశ్రీ(40), సాయని కోటేశ్వరరావు(8), బూసరాపల్లి వెంటేశ్వర్లు(49), కళ్లగుంట వెంకటరమణ(49), సాయన వెంకాయమ్మ(58), దేవబత్తిన లీలావతి(50), పసుపులేటి సీతారామయ్య(55), పసుపులేటి అంజమ్మ(45), కటారి సుధాకర్(60), కోసూరి రిషిత్‌రాయ్(14), నెల్లూరుకు చెందిన పోపూరి హరిత(33), పోపూరి లలితమ్మ(56), కటారి భూలక్ష్మి(45), బోటు డ్రైవర్ సూరిబాబు ఉన్నారు. మృతుల్లో ఏపీ డీజీపీ సాంబశివరావు బంధువు పసుపులేటి సీతారామయ్య, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి రామారావు మేనకోడలు లీలావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. బోటు ప్రమాదంలో మరణించిన లీలావతి అనే మహిళ మృతదేహాన్ని చూసి, ఆమె తల్లి లక్ష్మీకాంతం గుండెపోటుతో మరణించింది. కాగా పడవ ప్రమాదం ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ ప్రమాదంలో తన భార్య పుట్టింటికి చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాట్‌ను సందర్శించారు. ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

383

More News

VIRAL NEWS