అయ్యో పాపం.. కేరళ


Thu,August 16, 2018 12:43 PM

Kerala floods live updates Death toll rises to 75 IMD issues red alert

-72కు చేరిన మృతుల సంఖ్య
-బుధవారం ఒక్కరోజే 29మంది దుర్మరణం
-కొచ్చి విమానాశ్రయం మూసివేత
-14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
-భారీవర్షాలకు కర్ణాటకలో ఇద్దరు మృతి,5 జిల్లాల్లో అలర్ట్

తిరువనంతపురం/కొచ్చి, ఆగస్టు 15: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. వారంరోజుల కిందట ప్రారంభమైన భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా రాష్ర్టాన్ని ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఈ నెల 8 నుంచి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 72కు చేరింది. బుధవారం ఒక్కరోజే 29 మంది దుర్మరణం చెందారు. కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నీరు చేరడంతో శనివారం వరకు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొచ్చికి వచ్చే విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుజ్హితురై, ఎరానియల్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా భారత వాతావరణ విభాగం (ఐఎంఏ) రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలకు తోడు, బలమైన గాలులు గంటకు 60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఈదురుగాలుల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్, కొజికోడ్ జిల్లాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. ముళ్లపెరియార్ డ్యాం సహా దాదాపు 30 రిజర్వాయర్ల గేట్లను ఎత్తిన అధికారులు.. భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు. ముళ్లపెరియార్ డ్యాం నీటిమట్టం 142 అడుగుల గరిష్ఠస్థాయికి చేరడంతో ఆనకట్ట భద్రత దృష్ట్యా నీటిమట్టాన్ని 139 తగ్గించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి కేరళ సీఎం విజయన్ లేఖరాశారు. ఈ డ్యాం కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నప్పటికీ నిర్వహణ బాధ్యతలను మాత్రం తమిళనాడు చూస్తున్నది. కేరళ వరద పరిస్థితి గురించి సీఎం విజయన్ ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడారని.. రాష్ర్టాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారని ప్రభుత్వ ప్రకటన పేర్కొన్నది.
Nagercoil

మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం విజయన్ మాట్లాడుతూ వరదల మధ్య రాష్ట్రం స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నదని.. అందరం ఉమ్మడిగా ఈ విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎర్నాకుళం జిల్లాలో 23 వేల మంది తాత్కాలిక శిబిరాలకు తరలివెళ్లగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాంపుల్లో 1.5 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. కాగా భారీవర్షాల కారణంగా కర్ణాటకలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఐదు జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

2164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles