కేరళ విలవిల..


Thu,August 16, 2018 12:45 PM

Kerala floods 26 killed Idukki dam gates opened after 26 years

-భారీ వర్షాలతో అతలాకుతలం
-కొండచరియలు విరిగిపడి 26 మంది మృత్యువాత
-26 ఏండ్లలో తొలిసారి ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేత
-నిలిచిన రైలు, విమాన సర్వీసులు

తిరువనంతపురం, ఆగస్టు 9: కేరళ రాష్ర్టాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండురోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 26 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వానలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అలప్పుజ, ఇడుక్కి, వయనాడ్, కొల్లాం, మళప్పురం జిల్లాల్లో వరద పోటెత్తడంతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి రహదారులు, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మళప్పురంలో 10 అడుగల మేర నీరు నిలిచిపోయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కేరళలో ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడి ఇడుక్కి జిల్లాలో 11 మంది, ఉత్తర మళప్పురం జిల్లాలో ఆరుగురు, కన్నూర్, వయనాడ్ జిల్లాల్లో తొమ్మిది మందితో కలిపి మొత్తం 26 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇడుక్కి జిల్లాలో మరణించిన 11 మందిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఇడుక్కి రిజర్వాయర్‌లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏండ్ల తర్వాత తొలిసారి చేరుథోని డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు.

kerala3
దీంతో ప్రాజెక్టు పరిధిలోని 10వేల మందిని 157 పునరావాస శిబిరాలకు తరలించారు. కొచి జిల్లాలోని ఇదమలయార్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. పెరియార్ నది ఉప్పొంగి సమీప గ్రామాల్ని ముంచెత్తింది. కాగా, భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలమైన నేపథ్యంలో పర్యాటకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎత్తైన ప్రదేశాలు, డ్యాంలున్న ప్రాంతాలకు వెళ్లకూడదని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. వరదలతో కారణంగా అలప్పుజ జిల్లాలోని పున్నమాడ సరస్సులో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న వార్షిక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. మళప్పురంజిల్లాలో 40 సెంటీమీటర్లు, వాయినాడ్‌లో 31 సెం.మీ.ల వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. భారీ వర్షాలతో కొచ్చి విమానాశ్రయంలో దాదాపు రెండుగంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

kerala2

మరో రెండు రోజులు భారీ వర్షాలు

కేరళలో మరో రెండురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు సీఎం పినరాయి విజయన్ అధికారులతో సమీక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సహాయాన్ని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

2567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles