మేరునగధీరుడు..ద్రవిడ సూరీడు


Wed,August 8, 2018 12:27 PM

karunanidhi fond of movements and literature

- ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో తానే తలైవర్
- ఐదుసార్లు ముఖ్యమంత్రి, 13 సార్లు ఎమ్మెల్యేగా జయకేతనం
- సినీ వినీలాకాశంలో కలైజ్ఙర్‌గా పట్టాభిషేకం
- హేతువాదిగా, సినీ సాహితీ వేత్తగా, రాజకీయ దురంధరుడిగా బహుముఖ ప్రస్థానం
-తెలుగు గడ్డపైనే మూలాలు

ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు.. ఆయన గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు.. ద్రవిడ ఉద్యమానికి నిలువెత్తు ప్రతీక.. ఆత్మగౌరవ పోరాటానికి ఆయన పతాక. పోరాటం ఆయన మార్గం.. ధిక్కారం ఆయన నైజం.. అన్యభాష వద్దు.. తమిళమే ముద్దు అంటూ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన సిపాయి.. కళారంగం ఆయన పుట్టిల్లు.. రాజకీయం ఆయన కదనరంగం.. తన కలం, గళం జనం కోసం..ఆయన ప్రసంగం ప్రవాహఝురి.. ఆయన వాక్చాతుర్యం నిరుపమానం.. ఓటమికి ఆయనంటేనే భయం.. 60 ఏండ్ల అప్రతిహత విజయపరంపర ఆయన సొంతం. 94 ఏండ్ల నిండైన జీవితం.. 80 వసంతాల రాజకీయ వైభవం.. 64 ఏండ్ల సినీ పట్టాభిషేకం.. 50 వసంతాల పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇదీ ఆయన ట్రాక్ రికార్డు. కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నించిన ధీశాలి.. బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ కోవిదుడు, కళామతల్లి ముద్దుబిడ్డ.. ఏడు దశాబ్దాల రాజకీయ చైతన్య తరంగం, డీఎంకే దిగ్గజం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి అలియాస్ కలైజ్ఙర్ అలియాస్ నల్ల కళ్లద్దాల పెద్దాయన(దేశవ్యాప్తంగా ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు) ప్రస్థానం గురించి సవివరంగా..

అసలు పేరు దక్షిణామూర్తి.. ములాలు తెలుగుగడ్డలో..


భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించి, ప్రస్తుతం జీవించి ఉన్న అతి కొద్ది మంది నాటి తరం నేతల్లో కరుణానిధి ఒకరు. కరుణానిధి అసలు పేరు ముత్తువేల్ దక్షిణామూర్తి. 1924 జూన్ 3వ తేదీన నాగపట్టిణం జిల్లా తిరుక్కువలై గ్రామంలో నాయి బ్రాహ్మణ కులంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలు, అంజు. వారి పూర్వీకులు తెలుగువారు కావడంతో ఆయనకు తొలుత దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. కరుణ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందినవారు. ఆయన జన్మించకముందే కరుణ కుటుంబం తమిళనాడుకు వలస వెళ్లింది. సంగీతకారుల కుటుంబానికి చెందిన కరుణ మాతృభాష తెలుగు కావడంతో ఆయన ప్రత్యర్థులు తరుచూ పరాయి అంటూ విమర్శలు గుప్పించేవారు. కానీ, ఆయన వాటిని తేలిగ్గా తీసిపారేసేవారు. మరోవైపు ద్రవిడ ఉద్యమ కెరటం అన్నాదురై కూడా తెలుగు మూలాలు ఉన్నవారే కావడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో అన్నాదురై మాట్లాడుతూ.. మా అమ్మ బంగారమ్మ కంచి గుడిలో దేవదాసి, ఆమె స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది అని చెప్పారు.
KARUNANIDHI1

సాహిత్య నిధి..


కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే చదివిన కరుణానిధికి ఉద్యమాలు, నాటకాలు, సాహిత్యం అంటే ఎంతో ఆసక్తి. మూఢ విశ్వాసాల నుంచి ప్రజల్ని చైతన్యం చేసేందుకు నాటికలు రాసి ప్రదర్శించేవారు. కవితలు రాసి చదివి వినిపించేవారు. కవితలు, సాహిత్యంపై ఉన్న ఆసక్తి ఆయన్ను తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టేలా చేసింది. స్రిప్టు రచయితగా ఆయన కెరీర్ ప్రారంభించారు. సహజసిద్ధంగా ఆయనకు గల తెలివి తేటలు, వ్యాఖ్యాన నైపుణ్యం ప్రజాదరణ గల రాజకీయ నాయకుడిగా శరవేగంగా రూపాంతరం చెందేందుకు దోహదపడ్డాయి. ద్రవిడ ఉద్యమంలో భాగస్వామిగా, హేతువాద, సామ్యవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన కరుణానిధి తన రచనల్లో వాటికి ఇతోధికంగా చోటు కల్పించేవారు. చారిత్రక, సామాజిక సంస్కరణలను ప్రోత్సహిస్తూ రాసిన రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. తమిళ సాహిత్యంలో కరుణానిధిది ప్రత్యేకస్థానం. గేయాలు, లేఖలు, స్క్రీన్‌ప్లేలు, నవలలు, జీవిత గాథలు, చారిత్రక నవలలు, నాటకాలు, డైలాగ్‌లు, సినిమా పాటలు ఇలా విభిన్న రంగాల్లో తన నిరుపమాన శైలిని కొనసాగించారు. కరుణ వందకుపైగా కవితలు, గేయాలు, పుస్తకాలు రాశారు. గత ఆరు దశాబ్దాల్లో ఆయన సుమారు 2లక్షలకుపైగా పేజీలు రాశారంటే ఆయనకు ఈ రంగంపై ఎంత ఇష్టమో చెప్పనక్కరల్లేదు.
KARUNANIDHI2

14వ ఏటే రాజకీయ ప్రస్థానం..


కరుణానిధి 14వ ఏటే రాజకీయ రంగంలో ప్రవేశించారు. జస్టిస్ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరిగా భావించే అళగిరిస్వామి ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన కరుణానిధి 1938లో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. స్థానిక యువత కోసం సంస్థను స్థాపించిన కరుణానిధి.. ఆ సంస్థ కోసం చేతిరాతతో కూడిన దినపత్రిక మానవర్ నెసాన్ నడిపారు. దాని ద్వారా యువతలో స్ఫూర్తిని రగల్చడానికి ప్రాధాన్యమిచ్చారు. తదుపరి దశలో తమిళ్ మానవర్ మాండ్రం అనే పేరుతో విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో ఉధృతంగా సాగిన ద్రవిడ ఉద్యమంలో తొలి విద్యార్థి సంఘంగా తమిళ్ మానవర్ మాండ్రం పేరొందింది. విద్యార్థి సంఘ సభ్యుల్లో స్ఫూర్తిని, ఆవేశాన్ని రంగరించేందుకు ప్రారంభించిన దినపత్రిక క్రమంగా మురసోలిగా రూపాంతరం చెందింది. అదే తర్వాతి కాలంలో డీఎంకే అధికార దినపత్రికగా అవతరించింది. మురసోలి పత్రికలో కరుణ రాస్తున్న ఉదాస్‌పిరప్పి (ఓ సోదరుడా) అనే లేఖల సీరియల్ ప్రపంచంలోని న్యూస్ పేపర్ల సీరియల్ చరిత్రలో అతి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నదిగా రికార్డు సృష్టించింది.
KARUNANIDHI3

కరుణ టూ తలైవర్ వయా కలైజ్ఙర్


రాజకీయరంగంలోనే కాదు తమిళ సినీ పరిశ్రమలోనూ కరుణానిధి పాత్ర ఎనలేనిది. స్క్రిప్టు, పాటలు, డైలాగుల రచయితగా ఆయన పేరొందారు. థోకూ మెడాయి అనే కళారూపాన్ని వీనులవిందుగా ప్రదర్శించినందుకు కరుణానిధి కలైజ్ఙర్ (కళాకారుడు) అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన అభిమానులు, డీఎంకే నేతలు, శ్రేణులు ముద్దుగా కలైజ్ఙర్ అని పిలుచుకుంటారు. రాజకీయ రంగంలో అశేష ప్రజాభిమాన్ని సంపాదించుకున్న కరుణను పార్టీ శ్రేణులు గౌరవంగా తలైవర్(నాయకుడు) అని పిలుస్తారు. తన రచనలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలిచిన కరుణను కళైమామణి పురస్కారంతో సత్కరించారు.

కళ్లకూడి ఉద్యమంతో పేరు ప్రఖ్యాతులు


1953లో పారిశ్రామిక పట్టణం కళ్లకూడిలో జరిగిన ఉద్యమం కరుణకు తమిళనాడులో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. కళ్లకూడి ఆందోళనగా ఇది ప్రసిద్ధి చెందింది. ఉత్తరాదికి చెందిన సిమెంట్ మొఘల్ దాల్మియా పేరిట కళ్లకూడి గ్రామ పేరును నాటి ప్రభుత్వం దాల్మియాపురంగా మార్చింది. తమిళనాడుపై ఉత్తరాది పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ డీఎంకే ఆందోళన బాట చేపట్టింది. దాల్మియాపురం పేరును మార్చి కళ్లకూడి పేరునే తిరిగి పెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. కరుణ దీనికి సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలో రైల్వే స్టేషన్‌కు దాల్మియాపురం అన్న పేరును తొలగించి రైలు పట్టాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఈ ఉద్యమంలో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోగా, కరుణానిధి అరెస్టయ్యారు. తమిళ రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఎదిగేందుకు కళ్లకూడి ఉద్యమం కరుణకు ఎంతగానో దోహదపడింది. ఎమర్జెన్సీ సమయంలో 1975లో మీసా చట్టం కింద జైలు పాలైనప్పుడు కరుణ పలు సమస్యలు ఎదుర్కొన్నారు. జైలులో ఆయన్ను పోలీసులు తీవ్రంగా కొట్టేవారు. కరుణను రక్షించేందుకు డీఎంకే పార్టీ ఖైదీ ఒకరు మరణించారు.
periyar

1957లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు..


కరుణానిధి 1957లోనే తన 33వ ఏట తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కులిథాళాయి స్థానం నుంచి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1961లో డీఎంకే కోశాధికారిగా నియమితులైన కరుణానిధి, ఏడాదిలోపే 1962లో అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి రెండేండ్లకే 1969లో అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై మరణించడంతో కరుణానిధి(48 ఏండ్ల వయస్సులో) తొలిసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు డీఎంకే పార్టీ తొలి అధినేతగా ఎన్నికయ్యారు. 1949లో డీఎంకేను సీఎన్ అన్నాదురై స్థాపించారు. అయితే, ఆయన తన గురువు పెరియార్ రామస్వామి నాయకర్‌పై ఉన్న గౌరవంతో అధ్యక్ష స్థానాన్ని ఖాళీగా ఉంచి తాను మాత్రం ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అన్నాదురై మరణాంతరం డీఎంకే పగ్గాలు చేపట్టిన కరుణ 1969లో డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు గత 50 ఏండ్లుగా డీఎంకే అధినేతగా కొనసాగుతున్నారు. 1972లో తన స్నేహితుడు, ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్‌తో విభేదాలు తలెత్తాయి. దీంతో రామచంద్రన్ కరుణకు ప్రత్యర్థిగా మారారు. డీఎంకే నుంచి విడిపోయి స్వంతంగా అన్నాడీఎంకే పార్టీని ఆయన ఏర్పాటుచేశారు. 1977, 80, 85 ఎన్నికల్లో ఎంజీఆర్ ఘనవిజయం సాధించారు. 1987లో రామచంద్రన్ కన్నుమూశారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కరుణ విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
traffic

నిండుసభలో జయలలితకు పరాభవం


1989-91 మధ్య కొద్దికాలం సీఎంగా పనిచేసిన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో శాంతిభద్రతల పరిస్థితి సరిగ్గా లేదన్న కారణంతో కేంద్రం రద్దుచేసింది. 1989లో తిరిగి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కరుణానిధి హయాంలో జయలలితకు అసెంబ్లీలో నిండు సభ సాక్షిగా ఘోర అవమానం జరిగింది. డీఎంకే ఎమ్మెల్యేలు ఆమె హెడ్‌ఫోన్లు లాగేశారు. ఈ సందర్భంగా జయలలిత పట్ల కరుణ చేసిన అనుచితవ్యాఖ్య సభలో గందరగోళానికి దారితీసింది. దురై మురుగన్ అనే డీఎంకే సభ్యుడు ఆమె చీర లాగడానికి ప్రయత్నించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. నాటి నుంచి 1991 ఎన్నికల్లో తిరిగి గెలుపొందే వరకు జయలలిత అసెంబ్లీలో అడుగు పెట్టనేలేదు. తిరిగి 1996 ఎన్నికల్లో డీఎంకేను కరుణానిధి విజయ పథాన నడిపించి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.
karuna-arrest

వివాదాలూ ఎక్కువే


తమిళ రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో, సామాజిక కార్యక్రమాల్లో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న కరుణానిధి సుదీర్ఘ జీవితంలో వివాదాలూ ఎక్కువే. వీరనామ్ ప్రాజెక్టు టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగిందని కరుణానిధి ప్రభుత్వంపై సర్కారియా కమిషన్ అభియోగాలు మోపింది. విభజన రాజకీయాలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కరుణానిధి ప్రభుత్వాన్ని నాటి కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దుచేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలో ైఫ్లెఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై 2001లో ఆయన అరెస్టయ్యారు. అర్ధరాత్రి సమయంలో సరాసరి ఆయన పడకగదిలోకి ప్రవేశించిన పోలీసులు కరుణను అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సేతు సముద్రం వివాదం చర్చకు వచ్చినప్పుడు కరుణానిధి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. వేల ఏండ్ల క్రితం రాముడు అనే దేవుడు ఉన్నాడని ఇది (రామసేతు) చెబుతున్నది. ఆయన నిర్మించిన వంతెనను ముట్టుకోవద్దని చెబుతారు. రాముడు ఎవరని నేను ప్రశ్నిస్తున్నా? ఏ ఇంజినీరింగ్ కాలేజీ ఆయనకు డిగ్రీ పట్టా ఇచ్చింది? అని కరుణానిధి చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇక 1991 మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యపై దర్యాప్తు జరిపిన జస్టిస్ జైన్ కమిషన్ మధ్యంతర నివేదికలో కరుణానిధి పేరు చేర్చింది. ఎల్‌టీటీఈకి కరుణానిధి సహకరించారని పేర్కొంది. రాజీవ్ హంతకులకు తమిళనాడు సీఎం కరుణానిధి, డీఎంకే సహకరించాయని, ఆయన హత్యకు వారిదే బాధ్యత అని తాత్కాలిక నివేదికలో పేర్కొంది. కానీ తుది నివేదికలో కరుణ పేరు కనుమరుగైంది. ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడని 2009 ఏప్రిల్‌లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణానిది వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పీఠంపై ఐదుసార్లు.. ఎమ్మెల్యేగా 13 సార్లు


కరుణానిధి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠంపై 1969లో కూర్చున్నారు. ఆ తర్వాత 1971, 1989, 1996, 2006లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1957లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కరుణ అప్రతిహతంగా తన విజయయాత్రను కొనసాగించారు. తాను పోటీచేసిన ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోలేదు. 2017లో జరిగిన తాజా ఎన్నికల వరకు మొత్తం ఆయన 13 సార్లు ఘనవిజయం సాధించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. సుమారు 61 ఏండ్లపాటు ఆయన శాసనసభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన తిరువావూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 పార్లమెంటు స్థానాలకు గానూ 40 స్థానాల్ని గెలుచుకుని రికార్డు సృష్టించారు. దక్షిణ భారత సినిమా రంగానికి చెందిన వారిలో ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణే.

పరాశక్తితో తమిళనాట ప్రభంజనం


ఆత్మగౌరవ, ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన కరుణానిధి తమిళ సినిమాలో తన సిద్ధాంతాలు, భావాల ప్రచారానికి తొలిసారి పరాశక్తి సినిమాను ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలు, విలువలకు మద్దతునిస్తూ నిర్మించిన ఈ చిత్రం తమిళ సినిమాను మలుపు తిప్పింది. తమిళ సినీరంగానికి శివాజీ గణేశన్, ఎస్‌ఎస్ రాజేంద్రన్ అనే ఇద్దరు ప్రముఖ నటులను పరిచయం చేసింది. తొలుత ఈ సినిమాపై నిషేధం విధించినా.. తుదకు 1952లో విడుదలైంది. వివాదాల మధ్య విడుదలైన పరాశక్తి అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. కరుణ 1947 నుంచి 2011 వరకు సుమారు 64 ఏండ్లపాటు స్క్రిప్టు రచయితగా పనిచేశారు. 50కిపైగా సినిమాలకు కథలు, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. కరుణ సంభాషణలను అందించిన రాజకుమారి చిత్రంతోనే ఎంజీఆర్ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మదరుదనట్టు ఇలవరసి(1950), మందిరి కుమారి (1950), పరాశక్తి(1952), తిరుంబిపర్(1953), అరసిలంగ్‌కుమారి(1961) ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. పరాశక్తి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే సందేశంతో పణం, థాంగరత్నం అనే సినిమాలకు కరుణానిధి స్క్రిప్ట్ రాశారు. తర్వాతి కాలంలో వితంతు పునర్వివాహం, ఆత్మగౌరవ వివాహాలను ప్రోత్సహిస్తూ.. అంటరానితనం, జమిందారీ వ్యవస్థను అంతం చేయాలన్న సందేశాలతో కరుణానిధి రచనలు సాగాయి. టీఆర్ సుందరం స్థాపించిన మోడ్రన్ థియేటర్స్ స్టూడియో.. స్క్రిప్ట్ రచయితగా కరుణానిధికి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
stalin

స్టాలిన్‌కు రాజకీయ వారసత్వం


కరుణ తన రాజకీయ వారసత్వాన్ని చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌కు అప్పగించారు. తండ్రి నిర్ణయంతో విభేదించిన పెద్ద కుమారుడు అళగిరి తండ్రిపై తిరుగుబాటు చేశారు. దీంతో 2014లో అళగిరిని డీఎంకే నుంచి బహిష్కరించారు. దశాబ్దాలపాటు స్టాలిన్ రాజకీయ నైపుణ్యాల్ని పరిశీలించిన తర్వాతే ఆయన్ను తన వారసుడిగా ప్రకటించారని డీఎంకే పెద్దలు చెబుతుంటారు. స్టాలిన్ తొలిసారి 1989, 1996ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు కరుణ సీఎంగా ఉన్నా స్టాలిన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. 1996లో చెన్నై నగర మేయర్‌గా స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006లో నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాకే స్టాలిన్‌కు మంత్రి పదవి దక్కింది. 2009లో డిప్యూటీ సీఎంగా నియమించారు.
karunanidhi-family

ముగ్గురు సతులు.. ఆరుగురు సంతానం


కరుణానిధికి ముగ్గురు భార్యలు.. పద్మావతి అమ్మళ్, దయాళు అమ్మళ్, రజతీ అమ్మళ్. వీరి ద్వారా ఆరుగురు సంతానం కలిగారు. వీరిలో నలుగురు కొడుకులు ఎంకే ముత్తు, ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, ఎంకే తమిళరసు. ఇద్దరు కూతుళ్లు ఎంకే సెల్వి, కనిమొళి. తొమ్మిది మంది మనుమలు ఉన్నారు. మొదటి భార్య పద్మావతి అమ్మాల్ కొడుకు ఎంకే ముత్తు. పద్మావతి అమ్మాళ్ 1948లోనే మృతి చెందారు. రెండో భార్య దయాళు అమ్మాళ్‌కు కొడుకులు అళగిరి, స్టాలిన్, తమిళరసుతోపాటు కూతురు సెల్వి ఉన్నారు. 60వ పడిలో ఉన్నప్పుడు కరుణానిధి మూడో భార్య రజతీ అమ్మాళ్‌ను పెండ్లి చేసుకున్నారు. రజతీ అమ్మాళ్‌కు కూతురు కనిమొళి జన్మించారు. కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ కొడుకులే దయానిధి మారన్, కళానిధిమారన్.
wife-of-karunanidh

నలుగురు సీఎంలను అందించిన తమిళ సినిమా


తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. హేతువాద నేత పెరియార్ రామస్వామి శిష్యుడిగా ఉన్న సీఎన్ అన్నాదురై సినీ కథా రచయిత. తర్వాతీ కాలంలో రామస్వామి పెరియార్‌ను వ్యతిరేకించి 1949 సెప్టెంబర్ 17న డీఎంకే స్థాపించారు. రాజకీయంగా ప్రజాదరణ సాధించేందుకు తమిళ సినిమాను విస్తృతంగా వినియోగించుకున్న నేత అన్నాదురై. డీఎంకే కార్యకర్తలందరికీ అన్నగా సుపరిచితుడైన అన్నాదురై 1967 నుంచి 1969 వరకు సీఎంగా పని చేశారు. అన్నాదురై మరణం తర్వాత 1969 నుంచి 1976 వరకు కరుణానిధి సీఎంగా ఉన్నారు. తర్వాత డీఎంకే నుంచి విడిపోయి అన్నా డీఎంకే ఏర్పాటు చేసిన సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ 1977 నుంచి 1987లో మరణించే వరకు సీఎంగా పనిచేశారు. 1991లో కరుణ ప్రభుత్వాన్ని రద్దుచేయడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అన్నాడీఎంకేకు సారథ్యం వహించిన నటి జయలలిత తొలిసారి సీఎం అయ్యారు.

1537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles