ఏ ప్రాంతంలో ఎవరిది ఆధిపత్యం?


Wed,May 16, 2018 01:44 AM

Karnataka Elections Results 2018  All Eyes On Governor In Karnataka Cliffhanger

MAP
బెంగళూరు: కర్ణాటకలో ఉన్న ఆరు ప్రధాన రీజియన్లలో మెజార్టీ ప్రాంతాల్లో ఆధిపత్యం వహించిన వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటారు. ఈ ఆరు ప్రాంతాల్లో గతంలో ఏయే పార్టీలు ఎన్ని సీట్లు సాధించాయి? ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపే అంశాలు, ప్రస్తుతం ఆయా పార్టీల బలాబలాలు ఇవి.

ముంబై కర్ణాటక (50): ఇది లింగాయత్‌లకు గట్టి పట్టున్న ప్రాంతం. మహదాయీ నదీ జలాల వివాదం, చెరుకు ధరలు, కరువు వంటి అంశాలు ఇక్కడ ప్రభావం చూపుతాయి. 2013లో ఇక్కడ కాంగ్రెస్ 31 స్థానాలు గెలుచుకోగా బీజేపీ కేవలం 13 స్థానాలు మాత్రమే సాధించింది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ 30 స్థానాలతో ఆధిపత్యంలోకి దూసుకెళ్లగా కాంగ్రెస్ 17 స్థానాలకు పరిమితమైంది.

హైదరాబాద్‌కర్ణాటక(31): బళ్లారి నగరం సహా పలు ప్రాంతాలు హైదరాబాద్ కర్ణాటక కిందకు వస్తాయి. దేశంలో రెండో అతిపెద్ద కరువు ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది. వ్యవసాయం, కరువు ఇక్కడ ప్రధాన సమస్యలు. ఇక్కడున్న 31 స్థానాల్లో కాంగ్రెస్ సగం సీట్లు (15) సాధించి ఈ ప్రాంతంలో పైచేయి సాధించింది. కాగా గతంలో కంటే నాలుగు సీట్లు తగ్గాయి. 2013లో బీజేపీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే సాధించగా ప్రస్తుతం 12 సీట్లు పొందింది.

తీరప్రాంత కర్ణాటక (21):అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో మత ఘర్షణలు సర్వసాధారణం. గతంలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 18 స్థానాలకు ఎగబాకింది. అదేసమయంలో కాంగ్రెస్ 13 స్థానాల నుంచి 3 స్థానాలకు పడిపోయింది. ఈ ప్రాంతం నుంచి వీరప్ప మొయిలీ, సదానందగౌడ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
MAP1
బెంగళూరు రీజియన్‌లో రెండుస్థానాలకు ఎన్నికలు జరుగలేదు.
మధ్య కర్ణాటక (35): కేరళ రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటున్న ఈ ప్రాంతం పర్యాటకానికి పెట్టింది పేరు. 2013లో 19 స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం 11 స్థానాలతో సరిపెట్టుకున్నది. గతంలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి 24 స్థానాలకు ఎగబాకడం గమనార్హం. 2013లో ఏడు స్థానాలు సాధించి రెండోస్థానంలో ఉన్న జేడీఎస్ ఈసారి ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.

దక్షిణ కర్ణాటక (51): దేవెగౌడ సామాజిక వర్గమైన వక్కలిగలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం మొదటి నుంచి జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్నది. గతంలో 21 స్థానాలను గెల్చుకున్న ఆ పార్టీ ఈసారి 25 స్థానాలకు ఎగబాకింది. ఇక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు ముఖాముఖి తలపడ్డాయి. 2013లో 24 స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం 16 సీట్లకే పరిమితం కాగా.. గతంలో రెండు స్థానాలు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ప్రస్తుతం 9 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది.

బెంగళూరు రీజియన్ (36): భారతదేశ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొత్తంమీద ఈసారి ఇక్కడ కాంగ్రెస్ 16 స్థానాలు పొంది పైచేయి సాధించగా.. బీజేపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2013లో కూడా కాంగ్రెస్ 16 స్థానాలనే సాధించడం గమనార్హం. బీజేపీ మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయింది.
Karnataka-Seat-Share

ఒక్కటైన బద్ధశత్రువులు!

ఒకప్పటి బద్ధశత్రువులు సిద్దరామయ్య, కుమారస్వామి ప్రస్తుతం మిత్రులుగా మారారు. కర్ణాటక హంగ్ ఫలితం నేపథ్యంలో సీఎం పీఠం బీజేపీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కుమారస్వామికి దానిని ఇవ్వక తప్పనిపరిస్థితి సిద్దరామయ్యకు ఏర్పడింది. జేడీఎస్‌లో కుమారస్వామి పలుకుబడి పెరిగిపోవడాన్ని ప్రశ్నించినందుకు 2005లో సిద్దరామయ్యను పార్టీ నుంచి తరిమేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం అదే కుమారస్వామితో దోస్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్, జేడీ(ఎస్)లు కలిస్తే ఫలితాలు మరోలా ఉండేవి

కర్ణాటక ఎన్నికల్లో విజేతలకు అభినందనలు. ఓడిపోయిన వారు తిరిగి పోరాడండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ.. జనతాదళ్(సెక్యులర్)తో చేతులు కలిపి కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి ఉంటే ఫలితాలు చాలా భిన్నంగా ఉండేవి.
- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం

బీజేపీ విజయం.. ఈవీఎంలపై సందేహం

బీజేపీ విజయం నమ్మదగింది కాదు. క్షేత్ర పరిస్థితులు, ఫలితాలకు సరిపోలడంలేదు. భవిష్యత్‌లో ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల తోనే నిర్వహించాలి.
- జయంత్ పాటిల్, ఎన్సీపీ నేత

మీపై మీకు నమ్మకముంటే బ్యాలెట్‌తో పోటీచేయండి

ఈవీఎంలపై పలు సందేహాలు ఉన్నందున బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరు పాలి. ఉప ఎన్నికల్లో ఓడి పోయినా బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. మీపై(బీజేపీ) మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి బ్యాలెట్ పేపర్లతో పోటీచేయండి.
- ఉద్దవ్‌థాక్రే, శివసేన అధినేత

పరిస్థితులు భిన్నంగా ఉంటే..

కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకున్నా, ఆ ప్రయత్నాన్ని విమర్శించొద్దు. పరిస్థితులు భిన్నంగా ఉంటే బీజేపీ కూడా ఇదే పనిచేసేది.
- ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం

ధర్మోపదేశాలు చేయొద్దు

కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిపై బీజేపీ ధర్మోపదేశాలు చేయొద్దు. 2015లో బీహారీల తీర్పునకు వ్యతిరేకంగా నితీశ్‌తో కలిసి రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ నీతులు వల్లిస్తారా?
- తేజస్వీయాదవ్, ఆర్జేడీ నాయకుడు

ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని పిలువాలి

అతిపెద్ద పార్టీగా గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు మొదట గవర్నర్ పిలువాలి. బలాన్ని నిరూపించుకోలేకపోతే జేడీఎస్‌ను ఆహ్వానించాలి
-సోమ్‌నాథ్ చటర్జీ(లోక్‌సభ మాజీ స్పీకర్)

లింగాయత్‌ల అంశం ప్రస్తావించకపోతే బాగుండేది

-కాంగ్రెస్ ఓటమిపై మొయిలీ వ్యాఖ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు లింగాయత్‌ల విషయాన్ని ప్రస్తావించకపోతే బాగుండేదని, ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చేవని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ చెప్పారు. కుల సమీకరణల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని, అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించే కుల సమీకరణాల్లో కాంగ్రెస్ తప్పు చేసినట్లు అర్థమవుతున్నదని చెప్పారు. ఫలితాలు నిరుత్సాహ పరిచాయని పేర్కొన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లింగాయత్‌లకు మైనారిటీ హోదా ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు

-కేంద్రమంత్రులు రవిశంకర్, నిర్మల, గడ్కరీ వెల్లడి
కాంగ్రెస్ విభజించు రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని, ప్రధాని అభివృద్ధి ఎజెండాకు పట్టం కట్టారని బీజేపీ తెలిపింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని పదవిని చేపట్టడానికి తాను సిద్ధమేనని ఇటీవల ఒకరు ప్రకటించారని పరోక్షంగా రాహుల్‌గాంధీని విమర్శించారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ ఈ రోజు చారిత్రాత్మకమైనదని, ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారనడానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్త్ భారత్ నిజరూపం దాల్చుతున్నది. ఇందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దేశంలో పంజాబ్ మినహా అతిపెద్ద రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది అని పేర్కొన్నారు.

878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles