రాజీనామాలపై తక్షణం నిర్ణయించాలి


Fri,July 12, 2019 03:02 AM

Karnataka crisis Speaker meets rebel MLAs says will study resignations all night

- కర్ణాటక స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
- మెరుపు వేగంతో పనిచేయలేనన్న రమేశ్‌కుమార్
- రాజీనామాల పరిశీలనకు సమయం కావాలంటూ పిటిషన్
- మళ్లీ రాజీనామా లేఖలిచ్చిన రెబల్స్
- అవి నిబంధనల ప్రకారమే ఉన్నాయన్న స్పీకర్


న్యూఢిల్లీ, జూలై 11: కర్ణాటకలో అసెంబ్లీ నుంచి తప్పుకున్న 16 మంది అధికార పక్షాల ఎమ్మెల్యేల రాజీనామాపై అనిశ్చితి కొనసాగుతున్న ది. రాజీనామా చేసిన పది మంది రెబల్ ఎమ్మెల్యేలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్‌కుమార్ బేఖాతరు చేశారు. తాను మెరుపు వేగంతో పనిచేయలేనని తేల్చి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ముందు హాజరైన పది మంది రెబల్స్.. తాజాగా మరోసారి రాజీనామాలను సమర్పించారు. వారి రాజీనామాలన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నా, వారు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, వారు సమర్పించిన పత్రాలు నిజమైనవేనా అన్నది నిర్ధారించాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. ముంబైలోని ఒక హోటల్‌లో మకాం వేసిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం రెండు ప్రత్యేక విమానాల్లో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి ఒక లగ్జరీ బస్సులో బందోబస్తు మధ్య అసెంబ్లీకి చేరుకుని స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించాక వారు తిరిగి ముంబై వెళ్లిపోయినట్టు తెలిసింది. అధికార పార్టీలకు చెందిన 16 మంది (13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్) ఎమ్మెల్యేల రాజీనామాతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.
ramesh-kumar1

ఈ రోజే నిర్ణయించాలి: సుప్రీంకోర్టు

రెబల్ ఎమ్మెల్యేలను సాయంత్రం 6 గంటలకు కలుసుకొని, వారు సమర్పించే రాజీనామాలు స్వీకరించి, వాటిపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఉదయం కర్ణాటక స్పీకర్‌ను ఆదేశించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తమకు శుక్రవారం తెలియజేయాలని ఆదేశించింది. తాము సమర్పించిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదని పది మంది రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన స్పీకర్ రమేశ్‌కుమార్ వెంటనే ఒక పిటిషన్ దాఖలు చేస్తూ, కోర్టు ఆదేశాల ప్రకారం తాను పది మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకుంటాను తప్ప.. వారి రాజీనామాపై నిర్ణయాన్ని వెల్లడించలేనన్నారు. వారి రాజీనామాల పరిశీలనకు తనకు కొంత సమయం పడుతుందన్నారు. స్పీకర్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
ramesh-kumar2

పరిస్థితిని భ్రష్టు పట్టించారు

రెబల్ ఎమ్మెల్యేలు పరిస్థితిని భ్రష్టు పట్టించారని స్పీకర్ రమేశ్‌కుమార్ అన్నారు. నా కార్యాలయానికి రాకుండా నేను వారిని (రెబల్స్‌ను) అడ్డుకోలేదు. నన్ను కలుసుకోవడానికి వారు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో తెలియడం లేదు అని స్పీకర్ మీడియాతో అన్నా రు. నన్ను కలుసుకోవడానికి వారు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వారు స్వేచ్ఛగా నా దగ్గరికి రావచ్చు. వారి వైఖరే భ్రష్టు పట్టించేదిగా ఉంది అని అన్నారు. రెబల్స్ రాజీనామాపై ఈ రోజే నిర్ణయం తీసుకుంటారా అన్న విలేకరుల ప్రశ్నకు.. న్యాయస్థానం ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆదేశించలేదు అని బదులిచ్చారు.

అసమ్మతి శిబిరానికి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు

ముంబైలోని ఓ హోటల్‌లో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేల వద్దకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరారు. దీంతో ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 14కు చేరింది.
ramesh-kumar3

రాజీనామాలు తాజాగా సమర్పిస్తాం: రెబల్స్

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్‌కు తాము మళ్లీ రాజీనామాలు సమర్పిస్తామని కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో చెప్పారు. తాము ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామన్నారు. తాము కేవలం అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేశామని, ఇందులో బీజేపీకి ఎటువంటి పాత్ర లేదని తెలిపారు.

నేనెందుకు రాజీనామా చేయాలి: కుమారస్వామి

అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం మైనారిటీలో పడిన నేపథ్యంలో తన రాజీనామా కోసం వస్తున్న డిమాండ్లను సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. నేనెందుకు రాజీనామా చేయాలి? ఆ అవసరమేమొచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. 2009-10లో మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు నాటి సీఎం యడ్యూరప్పను వ్యతిరేకించారని, కానీ ఆయన రాజీనామా చేయలేదని కుమరస్వామి గుర్తు చేశారు. కుమారస్వామి రాజీనామాను డిమాండ్ చేస్తూ యెడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు అసెంబ్లీ ఎదుట ఆందోళన చేసిన సంగతి తెలిసిందే
ramesh-kumar4

అవిశ్వాసాన్ని ఎదుర్కొంటాం: మంత్రివర్గం

అధికార పక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వ మనుగడ డోలాయమానంలో పడినా తాము విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నామని కర్ణాటక క్యాబినెట్ విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం కుమారస్వామి అధ్యక్షతన గురువారం సాయంత్రం సమావేశమైన క్యాబినెట్ అవిశ్వాసాన్ని ధైర్యంగా, ఐక్యంగా ఎదుర్కొంటామన్నది. సమావేశ వివరాలను రాష్ట్ర మంత్రి కృష్ణ బైరెగౌడ మీడియాకు చెప్పారు. రాజకీయ పరిణామాలపై.. ప్రత్యేకించి ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభ పరిస్థితిపై చర్చించాం. ఈ సమస్యకు గల కారణాలను, పరిష్కారాల పైనా మాట్లాడుకున్నాం అని చెప్పారు. కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నించడం ఇది ఆరోసారి ఆరోపించారు. ఇంతవరకు బీజేపీ చేసిన దాడులన్నంటినీ తట్టుకున్నాం. ఈసారి ఆ దాడి కొంత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పరిస్థితులను ధైర్యంగా, ఐక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించాం అని కృష్ణ బైరెగౌడ చెప్పారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles