ఎమ్మెల్యే గణేశ్‌పై హత్యాయత్నం కేసు


Tue,January 22, 2019 02:34 AM

Karnataka Congress MLA J N Ganesh who attacked MLA Anand Singh booked for attempt to murder

-బెంగళూరు రిసార్టులో ఘర్షణపై పోలీసులకు బాధిత ఎమ్మెల్యే ఫిర్యాదు
-గణేశ్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
-ఘర్షణపై విచారణకు కమిటీ ఏర్పాటు

బెంగళూరు, జనవరి 21: బెంగళూరు శివారులోని ఈగల్టన్ రిసార్టులో చోటుచేసుకున్న ఘర్షణలో సహచర ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. దాడిలో గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఆనంద్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను శుక్రవారం ఈగల్టన్ రిసార్టుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే శనివారం రాత్రి ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, జేఎన్ గణేశ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆనంద్‌పై గణేశ్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆనంద్ ముఖం, కన్ను, ఛాతీపై గాయాలైనట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. రాజకీయంగా అంతం చేస్తానని తన(ఆనంద్‌సింగ్) మేనల్లుడు బెదిరించినట్లు గణేశ్ ఆరోపించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందని, ఈ క్రమంలో గణేశ్ తనపై దాడికి దిగాడని ఆనంద్ ఆరోపించారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.

గణేశ్‌పై సస్పెన్షన్ వేటు

సహచర ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గణేశ్‌పై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు డిప్యూటీ సీఎం పరమేశ్వర నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, రిసార్ట్‌లో జరిగిన గొడవలో తానూ గాయపడ్డానని గణేశ్ చెప్పారు. అయితే మీడియాలో వార్తలు వెలువడినట్లు బాటిల్‌తో ఎక్కడా దాడి జరుగలేదని తెలిపారు. తాను కావాలని ఘర్షణ పడలేదని, తన వల్ల ఆనంద్ బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు.

857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles