నేడే కుమారకు పరీక్ష


Fri,May 25, 2018 02:47 AM

Karnataka CM Kumaraswamy to face floor test today BJP fields nominee for speaker post

-ఆపరేషన్ కమల నేపథ్యంలో ఆందోళన
-రిసార్టుల్లోనే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
-స్పీకర్ ఎన్నిక బరిలో అభ్యర్థిని నిలిపిన బీజేపీ

Kumaraswamy-SrisriNirmal
బెంగళూరు, మే 24: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే విశ్వాస పరీక్ష కంటే ముందే స్పీకర్ ఎన్నిక రూపంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి తొలి సవాల్ ఎదురుకానున్నది. అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ సురేశ్‌కుమార్‌ను బీజేపీ బరిలో నిలిపింది. తద్వారా కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందే బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని బీజేపీ సృష్టించింది. అధికార కూటమి తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేయగా.. బీజేపీ తరఫున సురేశ్‌కుమార్ తన నామినేషన్‌ను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. పార్టీ పెద్దల సూచనలతో నేను స్పీకర్ పదవికి నామినేషన్ వేశాను. మా పార్టీ బలం, ఇతర పరిస్థితుల ఆధారంగా నేను విజయం సాధిస్తానని మా పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తంచేశారు. శుక్రవారం 12.15 గంటలకు స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత ఏంజరుగుతుందో మీరే చూస్తారు అని బీజేపీ స్పీకర్ అభ్యర్థి సురేశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. అయితే బీజేపీ పాచిక పారదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. స్పీకర్ పదవికి దాఖలు చేసిన నామినేషన్‌ను బీజేపీ ఉపసంహరించుకుంటుందని లేదా తమ అభ్యర్థి రమేశ్‌కుమార్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

కొనసాగుతున్న రిసార్ట్ రాజకీయాలు

ఆపరేషన్ కమలను బీజేపీ మళ్లీ ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళన నేపథ్యంలో కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ఒకరోజే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను గురువారం కూడా హోటళ్లకే పరిమితం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తీర్పు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్టుల్లోనే గడుపుతున్నారు. ఈ నెల 15 నుంచి కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు బయటపడుదామా అని ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని, మీడియాతో మాట్లాడనివ్వడం లేదని విమర్శలు వస్తున్నా అలాంటిదేమీ లేదని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఖండిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక్క పూట ఇంటికి వెళ్లే అవకాశం కల్పించాలని కోరినా వారికి అనుమతి లభించలేదని తెలుస్తున్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని హిల్టన్ ఎంబసీ గోల్ఫ్‌లింక్స్ హోటల్‌లో ఉంచగా.. జేడీఎస్ తన ఎమ్మెల్యేలను గోల్ఫ్‌ష్రైన్ రిసార్ట్‌లో ఉంచింది. విశ్వాస పరీక్ష అయ్యేవరకు తమ ఎమ్మెల్యేలు రిసార్ట్‌లోనే ఉంటారని, తర్వాత వారు తమ తమ కుటుంబాలను కలుసుకోవచ్చని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ఎమ్మెల్యేలను నిర్బంధించారన్న ఆరోపణలపై స్పందిస్తూ దీనిని నిర్బంధించడం అని అంటే అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. ఎమ్మెల్యేలు అత్యంత విలాసవంతమైన రిసార్టుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఫోన్లు స్వాధీనం చేసుకున్నామనడం సరికాదు. వారి ఫోన్లు వారి వద్దే ఉన్నాయి. వారు తమ తమ కుటుంబాలతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవాలని కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారు అని సదరు కాంగ్రెస్ నేత చెప్పారు. కాగా ఈ విమర్శలపై జేడీఎస్ నేత సదానంద స్పందిస్తూ ఒక్కసారి విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత మా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు తిరిగి వెళ్తారు. ఫోన్లను తీసుకున్నామనేది అబద్ధం అని పేర్కొన్నారు.

Kumaraswam

దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం

-తన ప్రమాణ స్వీకార వేళ విపక్ష నేతలు తరలి రావడంపై కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి హర్షం
-పాలనలో తన తండ్రి జోక్యం ఉండదని వెల్లడి

సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి వివిధ పార్టీలు, రాష్ర్టాలకు చెందిన 20 మందికి పైగా జాతీయ నేతలు రావడంపై కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయ సృష్టికి ఈ సందర్భం సంకేతాలిచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ అనుభవాలను ఖచ్చితంగా ఉపయోగించుకుంటానే గానీ ఆయన నీడలో పని చేయబోనని స్పష్టం చేశారు. పాలనలో తన తండ్రి దేవెగౌడ జోక్యం చేసుకోబోరని చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు వాటికి మెరుగులు దిద్దుతామని, నూతన పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. కావేరి, మహదాయి నదీ జలాల వివాదాలపై పొరుగు రాష్ర్టాల నేతలతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామన్నారు. జేడీఎస్ కాంగ్రెస్ పక్షాల మధ్య అంతర్గత కుమ్ములాటలు రావాలని బీజేపీ సహజంగానే కోరుకుంటుందని, కానీ ఆ పార్టీ ఆశలు వమ్మవుతాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపడం తేలిక కాదని, పరిమితులు ఉంటాయని అయితే ఆ పరిమితులను అధిగమించగలనని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా పొరపాట్లు చేయకుండా, సమయాన్ని వృథా చేయకుండా సుస్థిర పాలన ఇవ్వడానికి ప్రయత్నిస్తామని కుమారస్వామి చెప్పారు.

1432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS