కర్ణాటకలో కంగుతిన్న బీజేపీ


Wed,November 7, 2018 02:20 AM

Karnataka bypoll disaster should force BJP rethink

-ఉప ఎన్నికల్లో కమలనాథులకు గట్టి ఎదురుదెబ్బ
-కంచుకోట బళ్లారిలోనూ తప్పని ఓటమి
-సత్తా చాటిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమి
-2 లోక్‌సభ, 2 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం
-శివమొగ్గను నిలబెట్టుకున్న బీజేపీ
-అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం కుమారస్వామి భార్య అనిత
-ఫలితాలు.. సంకీర్ణ సర్కార్‌కు ప్రజలు పలికిన మద్దతు: సీఎం కుమారస్వామి
-లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాం : పీసీసీ అధ్యక్షుడు గుండూరావు

బెంగళూరు: మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలో మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి భారీ విజయం నమోదు చేసింది. ఈ ఫలితాలు రాష్ట్రంలో నాలుగు నెలల క్రితం అధికారానికి వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్‌కు ఓటర్లు పలికిన మద్దతుగా భావిస్తున్నారు. బళ్లారి, శివమొగ్గ (బీజేపీ), మాండ్య (జేడీఎస్) లోకసభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర స్థానాన్ని సీఎం కుమారస్వామి (జేడీఎస్) వదులుకోవడం, జమఖండీ ఎమ్మెల్యే(కాంగ్రెస్) సిద్దు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 3న పోలింగ్ నిర్వహించగా, మంగళవారం ఫలితాలను ప్రకటించారు. మాండ్య లోక్‌సభ, రామనగర అసెంబ్లీ స్థానాలను జేడీఎస్, బళ్లారి ఎంపీ, జమఖండీ ఎమ్మెల్యేల సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, శివమొగ్గలో బీజేపీ గెలుపొందింది. ఉప ఎన్నికల విజయోత్సాహంతో సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసే పోరాడుతామన్నారు. ఈ విజయాన్ని తమ సంకీర్ణ సర్కార్‌కు ఓటర్లు ఇచ్చిన ఆమోదంగా భావిస్తున్నామన్నారు. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప బీజేపీకి చెందిన జే శాంతపై 2.43 లక్షలపైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించారు.

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్పకు పట్టుగొమ్మగా ఉన్న శివమొగ్గలో ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర జేడీఎస్ ప్రత్యర్థి మధు బంగారప్పపై 52,148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ స్థానంలో ఎంపీగా యడ్యూరప్ప అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రామనగరలో సీఎం కుమారస్వామి భార్య అనిత 1,09,137 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడంతో అనిత విజయం నల్లేరు మీద నడకైంది. జమఖండీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్దు న్యామగౌడ కొడుకు ఆనంద న్యామగౌడ గెలిచారు. ఆయన బీజేపీ ప్రత్యర్థి శ్రీకాంత్ కులకర్ణిని 39,480 ఓట్ల తేడాతో ఓడించారు. మాండ్య లోక్‌సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఎల్‌ఆర్ శివరామె గౌడ భారీ విజయాన్ని నమోదు చేశారు. బీజేపీ అభ్యర్థి సిద్దరామయ్యను ఆయన 3,24,943 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు చెందిన వొక్కలిగుల ప్రాబల్యం గల మాండ్యలో జేడీఎస్ ఆధిపత్యం నిలుపుకుంది.

120కి పెరిగిన కూటమి బలం

ఉప ఎన్నికల ఫలితాలతో 224 మంది సభ్యులుగల అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 120కి పెరిగింది. బీజేపీకి 104 మంది సభ్యులున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇతర పార్టీల కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం (113) లేకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిగా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల గెలుపుతో కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని, దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టారు. బీజేపీ విభజన, నియంతృత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు చెప్పారు. ఈ ఎన్నికల్లో మద్యం, ధనం ప్రభావం చూపాయని బీజేపీ నేత యడ్యూరప్ప ఆరోపించారు.

కూలిన కాషాయ కోట

Ugrappa
15 ఏండ్లుగా కంచుకోటగా ఉన్న బళ్లారి లోక్‌సభ స్థానాన్ని కోల్పోవడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మైనింగ్ కాంట్రాక్టర్లు గాలి జనార్దన్‌రెడ్డి సోదరుల అనుచరుడైన బీ శ్రీరాములు గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు చిత్రదుర్గ జిల్లా మొల్కమూరు నుంచి గెలుపొందడంతో తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప 2.43 లక్షల భారీ మెజారిటీతో శ్రీరాములు సోదరి శాంతను ఓడించారు. బళ్లారి జిల్లాలోకి జనార్దన్‌రెడ్డి ప్రవేశంపై కోర్టు నిషేధాజ్ఞలు విధించడం, శ్రీరాములు పైనే ఆధారపడటంతో ఓడిపోయామని బీజేపీ నేతలంటున్నారు. బళ్లారిలో గెలుపు కోసం కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డినట్టు తెలుస్తున్నది. 2004 వరకు ఇక్కడ కాంగ్రెస్‌దే హవా. 1999లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌పై గెలుపొందారు. 2004 తర్వాత రెడ్డి సోదరుల ప్రాబల్యం పెరుగడంతో బీజేపీకి బళ్లారి కంచుకోటగా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్పను స్థానికేతరుడని బీజేపీ ప్రచారం చేసినా ఆయన బళ్లారిలో అత్యధికంగా గల నాయక (వాల్మీకి) సామాజిక వర్గం కావడంతోపాలు అవినీతి ఆరోపణలు లేనందునే ఓటర్లు ఆదరించారని పరిశీలకులంటున్నారు.

1297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles