పర్యాటక కేంద్రంగా కార్గిల్!


Wed,September 11, 2019 02:14 AM

Kargil Looks To Gain Fame As A Tourist Place

- యుద్ధక్షేత్రం ముద్రను తొలిగించాలని స్థానికుల విజ్ఞప్తి
- పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించాలని డిమాండ్


లెహ్, సెప్టెంబర్ 10: కార్గిల్.. ఈ పేరు వినగానే భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం గుర్తుకొస్తుంది. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు సాగిన ఈ సంగ్రామంలో భారత్ ఘన విజయం సాధించింది. భారత భూభాగంలోకి చొరబడిన పాకిస్థాన్ దళాలను ఆపరేషన్ విజయ్ ద్వారా తరిమికొట్టి భారత్ విజయభేరి మోగించింది. ఈ విజయానికి గుర్తుగానే ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. అయితే యుద్ధం ముగిసి రెండు దశాబ్దాలు పూర్తయినా కార్గిల్‌పై ఆ యుద్ధముద్రలు మాత్రం చెరిగిపోలేదు. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటకక్షేత్రంగా ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత వారం మూడు రోజుల పాటు కార్గిల్‌లో పర్యటించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి కార్గిల్ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నో సుందర ప్రదేశాలు..

కార్గిల్ యుద్ధం ముగిసి 20 ఏండ్లు పూర్తయినా, ఇప్పటికీ సెర్చ్ ఇంజిన్‌లో కార్గిల్ అని టైప్ చేస్త్తే నాటి యుద్ధం గురించే కనిపిస్త్తున్నది. పర్యాటకమే జీవనాధారమైన ఈ ప్రాంత ప్రజలకు ఇది నిజంగా అన్యాయం. ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నప్పటికీ, యుద్ధ క్షేత్రం అనే ముద్ర ఉన్న కారణంగా ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారలేకపోయింది అని ఆల్ కార్గిల్ ట్రావెల్, ట్రేడ్ అసోసియేషన్‌కు చెందిన అష్రఫ్ అలీ పేర్కొన్నారు. లెహ్, కార్గిల్‌కు (ప్రస్తుతం ఈ రెండు జిల్లాలు లడఖ్‌కు చెందినవి) కేంద్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వడంతో, మునుపటి జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ రెండు జిల్లాలు.. కశ్మీర్‌లోయతో ముడిపడి ఉన్న హింస నుంచి బయటకు రాగలమని భావిస్తున్నామన్నారు. లెహ్‌పైనే కేంద్రం ఎక్కువ దృష్టిసారిస్తున్నదని కార్గిల్ వాసులు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని బమ్యాన్‌లో ఉన్న బుద్ధుడి విగ్రహాలను తాలిబన్లు ధ్వంసం చేయడంతో.. అలాంటి శిల్పాలు ఇక ఇక్కడ మాత్రమే మిగిలాయి. వీటిని సంరక్షించకుండా అలాగే వదిలేశారు అని హోటల్ యజమాని ఎండీ హస్నేన్ రంగ్యూల్ పేర్కొన్నారు. కార్గిల్‌ను ఏటా 1.25 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తున్నప్పటికీ, దీన్ని విడిది కేంద్రంగానే పరిగణిస్తున్నారని అన్నారు. కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం కళంక్‌లో కొంత భాగాన్ని ఇక్కడే చిత్రీకరించారు. కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్ర జీవితం ఆధారంగా ఆ చిత్రం తెరకెక్కడం విశేషం. మరణానంతరం కెప్టెన్ బాత్రాను భారత ప్రభుత్వం పరమ్‌వీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది.

మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం చర్యలు..

లెహ్, కార్గిల్ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేసేందుకు సమగ్ర ప్రతిపాదనలను పంపాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ మిషన్‌లో ఈ రెండు ప్రాంతాలను కూడా చేర్చే విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తున్నదని ఓ అధికారి వెల్లడించారు. స్థానిక అధికారుల నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 2015లో కేంద్రం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా 100 నగరాలను ఎంపికచేయగా, అందులో జమ్ము కూడా ఉన్నది.

1224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles