Telangana Intermediate 1st & 2nd Year Results 2019

తొలి లోక్‌పాల్ పీసీ ఘోష్


Wed,March 20, 2019 03:09 AM

Justice PC Ghose appointed first Lokpal

-నియామక ఉత్తర్వులు జారీ
-ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 19: అవినీతికి పాల్పడితే ప్రధానిపైన అయినా విచారించే అధికారం గల దేశ తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటన చేసింది. లోక్‌పాల్ లేదా అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌గా పీసీ ఘోష్ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదం తెలిపారు. లోక్‌పాల్‌లో ఓ మహిళా జడ్జి సహా నలుగురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు, నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా సశస్త్ర సీమా బల్ చీఫ్ అర్చన రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీకే జైన్, మహేంద్రసింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతం, జ్యుడీషియల్ సభ్యులుగా న్యాయమూర్తులు దిలీప్ బీ భోసలే, ప్రదీప్ కుమార్ మహంతి, అభిలాష కుమారి, అజయ్‌కుమార్ త్రిపాఠి నియమితులయ్యారని రాష్ట్రపతి భవన్ తెలిపింది.

ghosh2
లోక్‌పాల్, ఇతర సభ్యుల పేర్లను ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసు చేయగా, రాష్ట్రపతి కోవింద్ ఆమో దించారు. లోక్‌పాల్ సభ్యులు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారి నియామకం అమలులోకి వస్తుంది. జస్టిస్ పీసీ ఘోష్ (66), సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017, మేలో రిటైరయ్యారు. అదే ఏడాది జూన్ 29 నుంచి ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యునిగా ఉన్నారు. అంతకుముందు 1997 లో కలకత్తా హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అయితే లోక్‌పాల్ నియామకాలపై వివాదం తలెత్తే అవకాశం ఉంది. లోక్‌పాల్ ఎంపిక కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రారం జరిగిన కమిటీ చివరి సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.

సుప్రీంకోర్టు జోక్యంతో కదలిక

లోక్‌పాల్ నియామకంలో జాప్యంపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు.. ఎంపిక కమిటీ సమావేశం ఎప్పుడు జరుగుతుందో పది రోజుల్లోగా తెలుపాలని ఈ నెల 7న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. అంతకుముందు, లోక్‌పాల్‌ను, సభ్యులను ఫిబ్రవరి నెలాఖరులోగా ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు జనవరి 17న గడువు విధించింది. దీంతో లోక్‌పాల్ ఎంపిక కమిటీ ఈ నెల 15న సమావేశమై లోక్‌పాల్ చైర్‌పర్సన్‌ను, సభ్యులను ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులుంటారు. వీరిలో నలుగురు తప్పనిసరిగా న్యాయాధికారులై ఉండాలి. లోక్‌పాల్‌లో సగానికి తగ్గకుండా సభ్యులు ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు ఉండాలి. ఒకసారి ఎంపికైన సభ్యులు ఐదేండ్లు, 70 ఏండ్లే వచ్చే వరకు లోక్‌పాల్‌లో కొనసాగుతారు.

137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles